రైతులకు బేడీలు!
ట్రిపుల్ ఆర్ బాధితులకు సర్కారు మార్క్ మర్యాద
మే 30 మంత్రి జగదీశ్ రెడ్డి కాన్వాయ్ అడ్డగింత
అరెస్టు చేసిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్
జూన్ 13న బెయిల్ కోసం బేడీలతో భువనగిరి కోర్టుకు
భువనగిరి : ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కారు’ ఇదీ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ చేసుకుంటున్న ప్రచారం.. తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతి అని కోట్లు గుమ్మరించి జాతీయ స్థాయి పత్రికల్లో ఢంకా బజాయించుకుంటున్నది. కానీ.. వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఆరుగాలం శ్రమించి పంటలు పండించే అన్నదాతకు సంకెళ్లు వేశారు. నలుగురు రైతులను బేడీలతోనే కోర్టుకు తీసుకొచ్చారు. రాజధాని నగరానికి సమీపంలో ఉన్న భువనగిరిలోనే ఇది జరగడం గమనార్హం.
రీజినల్ రింగు రోడ్డు అలైన్ మెంటు మార్చాలని, కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. గత నెల మే 29వ తేదీన భువనగిరి కలెక్టరేట్ వద్ద ధర్నాలు, ఆందోళనలు చేశారు. అదే నెల 30 వ తారీఖున మంత్రి జగదీశ్ రెడ్డి కాన్వాయ్‌ని నిరసన కారులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో పోలీస్ అవుట్ పోస్ట్ ను కాలబెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ ఆరుగురు రైతులపై ఐపీసీ 147, 148, 341, 427, 436, 353, 120 బీ(రెడ్ విత్) 149 ఐపీసీ సెక్షన్ 3( పీడీపీపీ యాక్ట్) కింద కేసులు పెట్టారు.
వీరిలో గడ్డమీది మల్లేశ్, పల్లెర్ల యాదగిరి, అవిశెట్టి నిఖిల్, మల్లెబోయిన బాలును మే 30న రాత్రి అరెస్ట్ చేశారు. బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి, కాంగ్రెస్ లీడర్ తంగెళ్లపల్లి రవికుమార్పరారీలో ఉన్నట్లు చూపారు. రిమాండ్‌కు తరలించిన నలుగురు భువనగిరి సబ్‌జైలులో ఉండగా బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు ములాఖత్‌కు ప్రయత్నించారు. దీంతో ఆ నలుగురిని నల్లగొండ జైలుకు మార్చారు. కోర్టు నలుగురికి 14 రోజుల రిమాండ్ విధించించగా ఇవాళ్టి (జూన్ 13)తో గడువు ముగిసింది. బెయిల్ కూడా మంజూరైంది. వారిని భువనగిరి కోర్టు హాజరు పర్చేందుకు బేడీలతో తీసుకువచ్చారు. ఇద్దరేసి రైతులకు కలిపి బేడీలు వేసి కోర్టుకు తీసుకు రావడం గమనార్హం.
అలైన్ మెంట్ మారిందిలా..
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం భూములు సేకరిస్తున్న విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మునుగోడు, భువనగిరి, ఆలేరు సెగ్మెంట్ల పరిధిలోని ఐదు మండలాలకు ఈ రీజినల్ రింగ్ రోడ్ ఎఫెక్ట్ ఉంటుంది. యాదాద్రి అభివృద్ధి, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత భూముల రేట్లు బాగాపెరిగాయి.. ప్రభుత్వం ఎకరాకు కేవలం ఐదారు లక్షలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో ఒక్క రాయగిరికి చెందిన రైతుల భూమే ఎక్కువగా పోతుంది. దీంతో ఆందోళనకు గురైన రైతులు అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సమర్పించారు. ఫలితం లేకపోవడంతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వందలాది మంది పోలీసులను తీసుకొని వచ్చిన అధికారులు రైతులను అరెస్టు చేసి వారి భూముల్లో సర్వేలు చేశారు. వాస్తవానికి పాత అలైన్ మెంట్ ప్రకారం భూసేకరణ చేస్తే తమ భూమి కాకుండా రాజకీయ నాయకులది, ప్రజాప్రతినిధుల జాగా పోతుందని, కావాలనే మార్చారని రైతులు ఆరోపిస్తున్నారు. పాత అలైన్ మెంట్ ప్రకారం చేస్తే తమకు ఎలాంటి నష్టం వాటిళ్లదని అంటున్నారు.
ఇప్పటికే మూడు సార్లు నష్టం
హైదరాబాద్–విజయవాడ రహదారి విస్తరణలో భాగంగా తమ భూములను సర్కారు తీసుకొని పరిహారం అందించిందని, ఆ డబ్బులతో బస్వాపురం రిజర్వార్ పరిసరాల్లో కొనుక్కున్నామని, అప్పటి వరకు ఆ రిజర్వాయర్ ఊసే లేదని రైతులు అంటున్నారు. తర్వాత అక్కడ రిజర్వాయర్ ప్రతిపాదనలో మరో సారి భూములు లాక్కొని యాదాద్రి సమీపంలో కేటాయించిందంటున్నారు. తర్వాత టెంపుల్ సిటీ విస్తరణ పేరుతో మరోమారు భూముల లాక్కుందని, తామంతా పేద రైతులమని ఎవరికి రెండు మూడు ఎకరాలకు మించి భూమి లేదని ఆవేదన చెందుతున్నారు. మరో మారు తమ భూములను లాక్కుంటే ఎలా బతకాలని కన్నీరు పెట్టుకుంటున్నారు.
కాళ్లు మొక్కినా కనికరించలే
ఆఫీసర్ల కాళ్లు మొక్కినం.. మాకు న్యాయం చేయాలని బతిమిలాడినం.. అందరూ మీకు అన్యాయం జరిగిందంటున్రు కానీ ఎవరూ న్యాయం చేస్తలేరు.. రాయగిరి మీద నుంచి సీఎం పోయినా, కేటీఆర్ పోయినా.. గుట్టకు జగదీశ్ రెడ్డి వచ్చినా మమ్మల్ని ముందస్తు అరెస్టు చేస్తుండ్రు. మా పక్కల్నే ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి వందల ఎకరాల జాగా ఉంది.. ఆ జాగాను ముడ్తలేరు.. మా భూమిని తీసుకుంటరట ఇదెక్కడి న్యాయం.
-పాండు, రైతు, రాయగిరి