గ్యాంగ్ సినిమా చూసి..జ్యూవెలరీ షాపు దోచుకున్నరు

గ్యాంగ్ సినిమా చూసి..జ్యూవెలరీ షాపు దోచుకున్నరు
సోదాల పేరుతో 17 బంగారు బిస్కెట్లతో ఎస్కేప్
స్కెచ్ వేసింది గోల్డ్​మేకర్ జకీర్​గా నిర్ధారణ
ఫేక్ ఐటీ అధికారుల కేసు ఛేదించిన పోలీసులు
10 మంది సభ్యుల ముఠాలో నలుగురి అరెస్ట్
కేసు వివరాలు వెల్లడించిన  సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్, వెలుగు : ఇన్​కమ్​ట్యాక్స్ అధికారులమంటూ సికింద్రాబాద్ పాట్ మార్కెట్‌లోని సిద్ధి వినాయక జ్యూవెలర్స్​లో దోపిడీకి పాల్పడిన కేసును పోలీసులు ఛేదించారు. ఫేక్ ఐడీ కార్డులు చూపించి శనివారం చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర ముఠాలోని నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఏడు బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నామని   హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. పరారీలో ఉన్న మరో ఆరుగురి కోసం గాలిస్తున్నట్లు ప్రకటించారు. సూర్య నటించిన ‘గ్యాంగ్’, అక్షయ్ కుమార్ నటించిన ‘స్పెషల్ 26’ సినిమాలు చూసి దోపిడీకి స్కెచ్ వేసినట్లు విచారణలో తేలిందన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

ప్లాన్ ప్రకారమే పనిలో చేరిన జకీర్

సికింద్రాబాద్​కు చెందిన మహేందర్ బాబు నవకేతన్ కాంప్లెక్స్​లోని పాట్ మార్కెట్​లో సిద్ధి వినాయక జ్యూవెలర్స్ షాపు నిర్వహిస్తుంటాడు. పోయిన ఏడాది రంజాన్​కు ముందు మహారాష్ట్రలోని ఖానాపూర్​కు చెందిన జకీర్ ఘనీ (35) గోల్డ్ మేకర్​గా పనిలో చేరాడు. సిద్ధి వినాయక జ్యూవెలర్స్​కు హర్షద్ గోల్డ్ మెల్టింగ్ నుంచి బంగారం సప్లై అయ్యేది. జకీర్ ఘనీ నెల రోజులుగా హర్షద్ గోల్డ్ మెల్టింగ్ షాపులో పనిచేస్తున్నాడు. ఇక్కడ తయారు చేసిన నగలన్నీ సిద్ధి వినాయక జ్యూవెలర్స్​కు వెళ్లేవి. రెండు షాపుల్లో గోల్డ్ బిస్కెట్స్ ఉండటం గమనించిన జకీర్.. ప్లాన్​లో భాగంగా కొన్ని రోజులు రెక్కీ చేశాడు. 

బంగారం విలువ రూ.60లక్షలు

జకీర్ ఘనీ సమాచారంతో శనివారం ఉదయం  11.40 గంటలకు 10 మంది సిద్ధి వినాయక జ్యూవెలర్స్​లోకి వెళ్లారు. ఐడీ కార్డులు చూపించి తాము ఐటీ అధికారులని నమ్మించారు. అక్కడ పనిచేసే వాళ్ల సెల్​ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. బంగారం కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారంటూ తనిఖీలు ప్రారంభించారు. 10 నుంచి 15 నిమిషాల పాటు సోదాలు చేస్తున్నట్లు నటించి.. రూ.60లక్షలు విలువ చేసే 17 బంగారం బిస్కెట్లకు (1700 గ్రాములు) సంబంధించి ఎలాంటి ట్యాక్స్ కట్టలేదని చెప్పి.. మొత్తాన్ని స్వాధీనం చేసుకుని, నోటీసులివ్వకుండా వెళ్లిపోయారు. ఈ విషయాన్ని షాపు సిబ్బంది తోటి జ్యూవెలరీ షాపు వాళ్లకు చెప్పారు. ఐటీ అధికారులు తనిఖీలు చేయరని, ముందుగా నోటీసులిస్తారని చెప్పడంతో షాపు మేనేజర్ వికాస్ వెంటనే మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

దోపిడీలో మహారాష్ట్ర, గోవా గ్యాంగ్​లు

మహారాష్ట్రలోని ఖానాపూర్​కు చెందిన తన ఫ్రెండ్స్ రెహ్మాన్ గఫూర్‌(30), ప్రవీణ్ యాదవ్‌(32), ఆకాశ్ అరుణ్ (31), అభిజిత్ కుమార్‌‌, అమోల్, గనపాత్ర జాదవ్‌, గోవాకు చెందిన సిద్ధనాథ్, సంజయ్ పరుశరామ్, వినోద్ జాదవ్, అజయ్ జాదవ్​తో కలిసి జకీర్​ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. దోపిడీ ఎలా చేయాలో తెలుసుకునేందుకు ‘గ్యాంగ్’, ‘స్పెషల్ 26’ సినిమాలు చూశారు. 10 మంది ఫేక్ ఇన్​కమ్ ట్యాక్స్​ ఐడీ కార్డులు తయారు చేసుకున్నారు. 24వ తేదీన బస్సు, ట్రైన్​లో హైదరాబాద్ చేరుకున్నారు. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్​లోని ఢిల్లీ లాడ్జ్​లో దిగారు. 

మరో ఆరుగురి కోసం గాలింపు

కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. వర్కర్స్​పై అనుమానంతో సిబ్బందిని విచారించారు. దీంతో జకీర్ ఘనీ ప్లాన్​ బయటపడింది. జకీర్​ను అదుపులోకి తీసుకున్న టాస్క్​ఫోర్స్ పోలీసులు ఖానాపూర్ వెళ్లి రెహ్మాన్​గఫూర్, జకీర్, ప్రవీణ్, ఆకాశ్ అరుణ్​లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 7 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో 10 బిస్కెట్లు గోవా గ్యాంగ్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 17 గోల్డ్ బిస్కెట్స్ చోరీ చేశాక మహారాష్ట్రకు చెందినవాళ్లు 7,  గోవాకు చెందిన వాళ్లు వాటాలుగా 10 పంచుకున్నట్లు విచారణలో తేలింది.