24 గంటల్లో హయత్ నగర్ వృద్ధురాలు మర్డర్ కేసులో నిందితుల అరెస్ట్ 

హ‌య‌త్‌న‌గ‌ర్‌లో జూన్ 4న (ఆదివారం) రాత్రి జరిగిన వృద్ధురాలి హత్య కేసును 24 గంటల్లోపు పోలీసులు చేధించారు. ఈ కేసులో ఇద్దర్నీ అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. నగల కోసమే వృద్ధురాలు సత్తెమ్మను నిందితులు హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఎల్బీనగర్ డీసీపీ అనుసాయిశ్రీ చెప్పిన వివరాల ప్రకారం.. 

హ‌య‌త్‌న‌గ‌ర్‌ తొర్రూర్ గ్రామంలో సత్తెమ్మ అనే వృద్ధురాలి హత్య కేసును కేవలం 24 గంటల్లోనే రాచకొండ పోలీసులు చేధించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా లలిత అనే మహిళను గుర్తించి.. ఆమెను అరెస్ట్ చేశారు. సత్తెమ్మ తమ ఇంట్లో ఒంటరిగా ఉందని గమనించిన లలిత, రాకేష్... ఆమెను హత్య చేసి, బంగారం దొంగిలించారు. నారాయణపేటకు చెందిన రాకేష్.. ముత్తుట్ ఫైనాన్స్ లో జాబ్ చేస్తాడని పోలీసులు తెలిపారు. నిందితురాలు లలిత.. సత్తెమ్మ ఇంట్లో పని చేస్తుందని వివరించారు. 

లలిత సత్తెమ్మ కాళ్లు పట్టుకోగా.. రాకేష్ గొంతు నులిమి ఆమె హత్య చేశాడని పోలీసులు తెలిపారు. సత్తెమ్మను చంపాలని నిందితులు గతంలో కూడా ప్లాన్ చేశారని, అయితే అప్పుడు వర్కౌట్ కాకపోవడంతో ఆదివారం రోజు తమ ప్లాన్ ను అమలు చేశారు. నిందితుల నుంచి 23 తులాల బంగారాన్ని  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలించారు పోలీసులు.