- నల్గొండ జిల్లాలో గతేడాది పెరిగిన ప్రమాదాలు
- రూ. 5.14 కోట్లు చోరీ అయితే.. రూ.2.27 కోట్లే రికవరీ
నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలో యాక్సిడెంట్లు, చోరీలను అరికట్టడంలో పోలీస్ శాఖ విఫలం అవుతోంది. గతేడాది జిల్లాలో క్రైమ్ రేటు తగ్గినట్లు చెబుతున్నా ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన ముఖ్యమైన కేసుల్లో డిపార్ట్‌మెంట్ వెనుకబడినట్లు కనిపిస్తోంది. దొంగలు పట్టపగలే ఇండ్లలోకి చొరబడి అందనికాడికి దోచుకుపోతున్నారు. మరోవైపు హైవేలపైన వాహనాల స్పీడ్‌ను కంట్రోల్ చేయలేకపోతున్నారు. నేషనల్, స్టేట్ హైవేలపై స్పీడ్ బ్రేకర్లు పెట్టకూడదన్న రూల్ ఉన్నప్పటికీ ఎక్కువ యాక్సిడెంట్లు జరిగే ప్రాంతాల్లో రంబుల్ స్టిప్స్, స్పీడ్ గన్స్, ప్లాస్టింగ్ స్టాండ్స్ ఏర్పాటు చేశారు.
రెండేళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్లను లెక్కలోకి తీసుకుని రోడ్డు భద్రతా చర్యలు చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ రోడ్ల భద్రత గురించి పట్టించుకోవడం మానేశారు. దీంతో హైవేలపై పరిస్థితులు అదుపుతప్పి నిత్యం యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రమాదాల నివారణకు యాక్సిడెంట్ రిజల్యూషన్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నా నార్కట్‌పల్లి – అద్దంకి, చింతపల్లి – మాచర్ల హైవేలపై, పట్టణాల్లోని ప్రధాన రోడ్లపై జరుగుతున్న ప్రమాదాల గురించి పట్టించుకోవడం లేదు. 2021లో జరిగిన వేర్వేరు యాక్సిడెంట్లలో 323 మంది చనిపోగా, గతేడాది348 మంది మృతి చెందారు. ఆలాగే 2021లో జరిగిన యాక్సిడెంట్లలో 373 మంది గాయాల పాలైతే, గతేడాది 708 మందికి గాయాలయ్యాయి.
అడ్డూ అదుపులేని దొంగతనాలు
దొంగలను పట్టుకునేది సీసీ కెమెరాలే తప్ప తమ పని కాదన్నట్టుగా పోలీస్ శాఖ వ్యవహరిస్తోంది. ఎక్కడికక్కడ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెబుతూ పెట్రోలింగ్‌ను బంద్ చేసింది. చోరీలు జరిగితే సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకునేందుకు తీసుకుంటున్న చర్యలు కూడా నామమాత్రంగానే ఉంటున్నాయి. భారీ చోరీలు, ముఖ్యమైన వ్యక్తుల ఇండ్లలో జరిగే దొంగతనాలకే ప్రయారిటీ ఇస్తున్నారు తప్ప, సాధారణ జనాలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది నాలుగైదు ముఖ్యమైన కేసులను చేధించిన పోలీస్ శాఖ ఇతర కేసుల విషయంలో చొరవ చూపలేకపోయింది. మిర్యాలగూడ, చిట్యాల, నిడమనూరు స్టేషన్ల పరిధిలో రెండు, మూడు అంత ర్ రాష్ట్ర దొంగల ముఠా కేసులు మినహా ఇతర కేసుల్లో ఎలాంటి పురోగతి సాధించలేదు. గతేడాది సాధారణ చోరీ కేసులు 323 నమోదయ్యాయి. వేర్వేరు దొంగతనాల కేసుల్లో రూ. 5.14 కోట్లు సొత్తు చోరీ కాగా, కేవలం రూ.2.27 కోట్లే రికవరీ చేశారు.
ఇన్‌కం వచ్చే కేసులపైనే ఫోకస్
ఇన్‌కం తెచ్చే డ్రంకెన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం, పెండింగ్ చలాన్ల రికవరీ వంటి వాటిపైనే పోలీస్ శాఖ దృష్టి పెట్టింది. మోటార్ వెహికల్ చట్టం కింద గతేడాది 87,375, 14,858 డ్రంక్ అండ్ డ్రైవ్, 13,725 ఈపిటీ కేసులు నమోదయ్యాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి లక్షలాది రూపాయల ఇన్‌కం వచ్చింది. మరోవైపు గంజాయి అక్రమ రవాణాను అరికట్టడంపై ఫోకస్ చేశారు. గంజాయి స్మగ్లింగ్ కింద 23 కేసులు నమోదు కాగా, 101 మందిని అరెస్ట్ చేసి, సుమారు రూ.5.59 కోట్ల విలువైన 2,795 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇసుక మాఫియా విషయంలో మాత్రం చూసీచూడనట్టుగానే వదిలేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి 310 కేసులతోనే సరి పెట్టారు. సాండ్ పాలసీ అమల్లో ఉన్న జిల్లాలో అక్రమంగా ఇసుక దందా జరుగుతున్నా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలీసులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట పడితే ఇటు ప్రభుత్వానికి, అటు పంచాయతీలకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది.
క్రైమ్ రేట్ తగ్గినట్లు కనిపించినా...
నల్గొండ జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గినట్లు పోలీస్ శాఖ చెబుతోంది. 2021తో పోలిస్తే గతేడాది అన్ని రకాల కేసులు తగ్గాయని అంటున్నారు. కానీ మర్డర్లు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, మోసాలు వంటి కేసులను కట్టడి చేయడంలో పోలీసులు స్థానికంగా పలు సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని సీనియర్ఆఫీసర్ ఒకరు చెప్పారు. ముఖ్యంగా మహిళలు, మైనర్ బాలికలపైన జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్ కేసులు పునరావృతం కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. 2021లో అన్ని రకాల కేసులు కలిపి 9,535 నమోదు కాగా, గతేడాది 7,343 నమోదయ్యాయి. 2021తో పోలిస్తే 2,192 కేసులు తక్కువ నమోదైనట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి.