- తన చావుకు మంత్రి అజయ్కారణమని సాయిగణేశ్ చెప్పినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలే
- రామాయంపేట తల్లీ కొడుకుల సూసైడ్ ఘటనలో టీఆర్ఎస్ లీడర్లను కాపాడే యత్నం
- నిందితులే వచ్చి లొంగిపోయే దాకా చర్యల్లేవ్
మెదక్/ఖమ్మం, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తల్లీకొడుకులు గంగం పద్మ, సంతోష్, బీజేపీ కార్యకర్త సామినేని సాయి గణేశ్ సూసైడ్ కేసుల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తమ మృతికి టీఆర్ఎస్ప్రజాప్రతినిధుల వేధింపులే కారణమని చనిపోయే ముందు తీసిన వీడియోల్లో బాధితులు స్పష్టంగా చెప్పినా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. బాధితుల బంధువులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ప్రతిపక్షాల విషయంలో కంప్లైంట్ రావడమే ఆలస్యం అన్నట్లు అరెస్టులతో చెలరేగిపోయే పోలీసులు.. ఇప్పుడు అన్ని ఆధారాలున్నప్పటికీ అధికార పార్టీ నేతలను అరెస్ట్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఉన్నందువల్లే నిందితులపై చర్యలకు పోలీసులు వెనుకాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఖమ్మంలో బాధితుడి అమ్మమ్మ ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా ఏ ఒక్కరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. రామాయంపేటలో ప్రజాగ్రహానికి భయపడి నిందితులే స్వయంగా వచ్చి లొంగిపోవడం గమనార్హం.
ఖమ్మంలో బాధితుడిపైనే కేసు
ఖమ్మంలో ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సామినేని సాయి గణేశ్కేసులో నిందితులపై చర్యలకు పోలీసులు వెనుకాడుతున్నారు. మంత్రి పువ్వాడ అజయ్, స్థానిక టీఆర్ఎస్ లీడర్ ప్రసన్న కృష్ణ, పోలీసులు తనపై 16కి పైగా కేసులు పెట్టించారని, వాళ్ల వేధింపుల వల్లే తాను చనిపోవాలనుకున్నానని సాయి గణేశ్మీడియా ప్రతినిధులకు చెప్పాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్న సమయంలో రికార్డు చేసిన ఈ వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలోనూ తిరిగాయి. కానీ పోలీసులు ఆత్మహత్యాయత్నం చేసిన గణేశ్‌పైనే 309 సెక్షన్‌ప్రకారం కేసు నమోదు చేశారు. తర్వాత రెండ్రోజుల్లోనే సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో గణేశ్ చనిపోయాడు. ఆ వీడియోలో చెప్పినవే అతడి చివరి మాటలయ్యాయి. తర్వాతి రోజు మంత్రి అజయ్, ప్రసన్న కృష్ణపై గణేశ్ అమ్మమ్మ ఫిర్యాదు చేసింది. ఇది జరిగి నాలుగు రోజులు అవుతున్నది. కానీ ఇప్పటిదాకా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. తర్వాత జిల్లా బీజేపీ నేతలు సీపీ విష్ణు ఎస్.వారియర్‌ను కలిసి కంప్లైంట్ చేశారు. రోజులు గడుస్తున్నా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వెనుక అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయని బీజేపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. గణేశ్ అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై కనీసం రిసిప్ట్ ఇవ్వలేదని, కేసు నమోదు చేయలేదని చెబుతున్నారు.
మరణ వాంగ్మూలంగా తీసుకోరట!
సాయి గణేశ్వీడియోను మరణవాంగ్మూలంగా తీసుకోలేమని పోలీసులు అంటున్నారు. పూర్తిగా స్పృహలో ఉన్న వ్యక్తి, జడ్జి లేదా తహసీల్దార్ సమక్షంలో వీడియో రికార్డు చేస్తేనే మరణ వాంగ్మూలంగా పరిగణిస్తామని ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. దీనిపై బీజేపీ నేతలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోనే సాయి గణేశ్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబితే.. వెంటనే అతని స్టేట్ మెంట్‌ను ఎందుకు రికార్డు చేయలేదని నిలదీస్తున్నారు. తాము ఈ విషయంలో పోలీసులకు ముందుగానే అలర్ట్ చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇటీవల వనమా రాఘవ విషయంలో రామకృష్ణ ఫ్యామిలీ చనిపోవడానికి ముందు రికార్డు చేసిన వీడియో ఆధారంగానే కేసు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలానే సాయి గణేశ్ వీడియోను మరణ వాంగ్మూలంగా పరిగణించి, నిందితులపై కేసు పెట్టాలని డిమాండ్చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఈ కేసు విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు.
రామాయంపేట ఘటనలోనూ నిర్లక్ష్యమే..
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన తల్లీకొడుకుల సూసైడ్ ఘటనలోనూ పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గంగం సంతోష్, తన తల్లి పద్మతో కలిసి ఈ నెల 16న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నారు. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, ఐరేని పృథ్విరాజ్ గౌడ్, తోట కిరణ్, సరాఫ్ స్వరాజ్, కృష్ణాగౌడ్, రామాయంపేట మాజీ సీఐ తాండూరి నాగార్జున గౌడ్ వేధింపులు భరించలేకే తాము చనిపోతున్నట్లు సంతోష్, పద్మ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్లిపింగ్‌తోపాటు మృతుడి అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీసులు 16న ఏడుగురు నిందితులపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా పల్లె జితేందర్‌గౌడ్, ఏ2గా సరాఫ్ యాదగిరిని చేర్చారు. నాలుగు రోజులైనప్పటికీ పోలీసులు నిందితులను అరెస్ట్ చేయలేదు. కేసు దర్యాప్తు పేరుతో కాలయాపన చేస్తూ వచ్చారు. నిందితులంతా గత ఆదివారం ఒకే చోట నుంచి సెల్ఫోన్లో మీడియాతో మాట్లాడారు. ఆ టైంలో సిగ్నల్స్ ఆధారంగా వాళ్లను పట్టుకునే వీలున్నా పోలీసులు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు.
ప్రజాగ్రహానికి భయపడి లొంగిపోయిన్రు
సంతోష్, పద్మ ఆత్మహత్య చేసుకున్న రోజు నుంచే బాధిత కుటుంబ సభ్యులతోపాటు, వేలాదిగా తరలివచ్చిన స్థానికులు నిందితులను అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం నాయకులు, స్థానిక వ్యాపారులు, ప్రజలు నాలుగు రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో మంగళవారం రామాయంపేట బంద్ నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం నాయకులు, ఆర్యవైశ్యులు ర్యాలీలు నిర్వహించి, రాస్తారోకోలు చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు రఘునందన్, ఈటల రాజేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు మృతుల కుటుంబాలను పరామర్శించి, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలా ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఎట్టకేలకు ఆరుగురు నిందితులు మంగళవారం సాయంత్రం కామారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు.
టీఆర్ఎస్ లీడర్లను కాపాడుతున్రు
పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు తాగిన సాయి గణేశ్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు ఎందుకు రికార్డు చేయలేదు. మంత్రి పువ్వాడ అజయ్ ఒత్తిడి మేరకు కేసులు పెట్టి వేధిస్తున్నారని సాయి గణేశ్ చెబుతున్నా, వీడియోలో అన్ని అధారాలున్నా ఎందుకు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు. అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి పోలీసులు పనిచేస్తున్నారు. టీఆర్ఎస్ లీడర్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
- గల్లా సత్యనారాయణ, ఖమ్మం బీజేపీ అధ్యక్షుడు
వీడియోను డెత్ డిక్లరేషన్‌గా తీసుకోవాలి
పోలీస్ స్టేషన్ వద్ద పురుగుల మందు తాగితే.. ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు ఎందుకు వెంటనే అతని స్టేట్ మెంట్ తీసుకోలేదు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు సాయి గణేశ్ వీడియో రికార్డింగ్‌లో స్టేట్ మెంట్ ఇచ్చాడు. దాన్నే డెత్ డిక్లరేషన్‌గా తీసుకోవచ్చు. చనిపోవడానికి ముందు ఇచ్చిన వీడియో స్టేట్‌మెంట్‌ను ఆధారంగా తీసుకోవచ్చని గతంలో చత్తీస్‌గఢ్‌లో ఒక కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా చెప్పింది.
- వెంకట్ గుప్తా, లాయర్, బీజేపీ అనుబంధ న్యాయవాద పరిషత్ జిల్లా కార్యదర్శి