మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత.. నిరుపేదల గుడిసెలను తొలగించిన పోలీసులు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత.. నిరుపేదల గుడిసెలను తొలగించిన పోలీసులు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కలెక్టరేట్ సమీపంలో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను పోలీసులు బలవంతంగా తొలగించారు. సర్వే నెంబర్ 255/1 లోని 6 ఎకరాల్లో ఇండ్లు లేని వాళ్లు, నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారు. తమకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలంటూ గుడిసెలు వేసుకున్నారు. అయితే.. నిరుపేదలు వేసుకున్న గుడిసెలను భారీ బందోబస్తు మధ్య పోలీసులు తొలగించారు. 

గుడిసెలను తొలగిస్తుండగా.. రెవెన్యూ అధికారులను, వారి సిబ్బందిని మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మహిళలకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో గుడిసె వాసులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తోపులాటలో కొందరు మహిళలు కింద పడిపోయారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్యే ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. పేదల గుడిసెలను తొలగించడం ఇది ఆరోసారి. 

కార్పొరేట్ కంపెనీలకు భూములు ఇస్తున్న రాష్ర్ట ప్రభుత్వం తమలాంటి వారికి భూములు ఇస్తే తప్పేంటని నిరుపేదలు ప్రశ్నిస్తున్నారు. తప్పనిసరిగా ఇక్కడే గుడిసెలు వేసుకుని... ఇక్కడే ఉంటామంటున్నారు. తప్పనిసరిగా తమకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు ప్రభుత్వ భూమిని ఎందుకు పంచరని ప్రశ్నిస్తున్నారు. 6 ఎకరాల్లో కొన్ని వందల కుటుంబాలు జీవిస్తాయంటున్నారు. ఇంత దౌర్జన్యంగా గుడిసెలను తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 
రెవెన్యూ అధికారుల ఆదేశాలతోనే తాము గుడిసెలను తొలగిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఘటనాస్థలం వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది.