జగిత్యాల జిల్లా కొండగట్టు దేవస్థానం చోరీ కేసు నిందితులపై బుధవారం (జూన్ 21న) పీడీ యాక్ట్ అమలు చేశారు పోలీసులు. కొండగట్టు దేవస్థానంలో ఫిబ్రవరి 24వ తేదీన చోరీ జరిగిన విషయం తెలిసిందే. గర్భగుడి తాళాలు పగలగొట్టి అందులోని 15 కిలోల బరువు గల అందాజ, 90 వేల విలువ చేసే వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన రామ్ శెట్టి జాదవ్, బాలాజీ రాథోడ్, విఠల్ రావులపై పీడీ యాక్ట్ నమోదు చేసి.. ఉత్తర్వుల కాపీని మల్యాల సీఐ కోటేశ్వర్, ఎస్ఐ అశోక్ కు చర్లపల్లి జైలు అధికారులు అందించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేశారు. నిందితులను కరీంనగర్ జైలు నుండి చర్లపల్లికి తరలించారు. ఆ తర్వాత నిందితులకు చర్లపల్లిలో పీడీ యాక్ట్ నోటీసులు అందించారు మల్యాల సీఐ బిల్లా కోటేశ్వర్, ఎస్ఐ అశోక్.
గత కొంతకాలంగా నిందితులు దొంగతనాలు చేస్తూ.. ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని మల్యాల సీ ఐ కోటేశ్వర్ వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, అందుకే వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామన్నారు. భవిష్యత్తులో ఇంకా ఎవరైనా ఈ తరహా దొంగతనాలు చేసినా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా.. వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు.