మూసాపేట్ మెట్రో స్టేషన్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం

 మూసాపేట్ మెట్రో స్టేషన్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం

మూసాపేట్ మెట్రో స్టేషన్ లో రైలు కింద పడి ఓ వ్యక్తి  ఆత్మహత్య చేసుకున్నఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఆ వ్యక్తి ముందుగానే ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంతోనే మెట్రో స్టేషన్ లోకి ప్రవేశించినట్లుగా అనుమానిస్తున్నారు. 

అతను టికెట్ తీసుకోకుండానే మెట్రో స్టేషన్ లోకి వచ్చాడని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. అలా వచ్చిన అతను నేరుగా ప్లాట్ ఫాం మీదికి చేరుకున్నాడు. సరిగ్గా రైలు వచ్చే విషయాన్ని గమనించి.. దగ్గరికి రాగానే ఎదురుగా వెళ్లి దూకేశాడు. దీంతో రైలు ఇంజిన్ ఫ్లాట్ ఫాం మధ్యలో అతని శరీరం పడిపోయింది. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో నమోదయ్యింది. పోలీసులు మృతుడిని గుర్తించే పనిలో ఉన్నారు.  సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించామని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.