ఐటీ రంగానికి ప్రసిద్ది గాంచిన బెంగళూరు సిటీ.. అక్కడి పోలీసులను ఓ కేసు విషయంలో ఉరుకులు, పరుగులు పెట్టించింది. 77 ఏళ్ల వృద్ధుడి మృతి కేసును చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులకు.. విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. మొదటి నుంచి అనుమానించినట్లుగానే అది రోడ్డు ప్రమాదం కాదు.. హత్యనేని చివరకు తేల్చారు..? క్షణికావేశంలో ఓ వ్యక్తి కోపానికి నిండు ప్రాణం బలైందని గుర్తించారు..! అసలింతకు బెంగళూరు పోలీసులు ఈ కేసును ఎలా చేధించారు..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నవంబర్ 16వ తేదీ.. కృష్ణప్ప అనే 77 ఏళ్ల వ్యక్తి మందుల కోసం తన ఇంటి దగ్గరలో ఉన్న మెడికల్ షాపునకు స్కూటర్ పై వెళ్తున్నాడు. ఇంతలో సర్ఫరాజ్ ఖాన్ అనే వ్యక్తి తన టూవీలర్ తో కృష్ణప్ప స్కూటర్ ను ఢీకొట్టాడు. దీంతో బండిపై నుంచి కృష్ణప్ప కిందపడిపోయాడు. సర్పరాజ్ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిర్లక్ష్యంగా బండి ఎందుకు నడిపావు అంటూ కృష్ణప్ప నిలదీశాడు. దీంతో కట్టలు తెంచుకున్న కోపంతో కృష్ణప్పపై చేయి చేసుకున్నాడు సర్ఫరాజ్ ఖాన్. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.
ఈ ఘర్షణలో మరింత రగిలిపోయిన సర్ఫరాజ్ ఖాన్.. రాయితో కృష్ణప్పపై పదే పదే దాడి చేశాడు. తన ఫ్రెండ్ వద్దని వారించినా అస్సలు పట్టించుకోలేదు సర్ఫరాజ్ ఖాన్. స్పృహ తప్పి కిందపడిన కృష్ణప్పను అక్కడే వదిలి పారిపోయారు సర్ఫరాజ్, అతడి ఫ్రెండ్. రక్తపు మడుగులో పడి ఉన్న కృష్ణప్పను స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అప్పటికే పరిస్థితి విషమించిన కృష్ణప్ప.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా పోలీసులు ముందుగా భావించి..కేసు నమోదు చేశారు. కృష్ణప్ప హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని అనుకున్నారు. ఆ తర్వాత విచారణలో అసలు నిజాలు తేలాయి.
ఎందుకో.. ఈ కేసు విషయంలో మొదటి నుంచి కృష్ణప్ప కుమారుడు సతీష్ కుమార్ కు అనుమానం కల్గింది. తమ తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, ఏదో జరిగి ఉంటుందని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంకేముందు.. సతీష్ ఫిర్యాదుతో ఆ కోణంలోనూ పోలీసులు మరింత లోతుగా విచారణ సాగించారు.
ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. కృష్ణప్ప రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, హత్యకు గురయ్యాడని తేలింది. నిందితుడు సర్ఫరాజ్ ఖాన్.. ఓ బైక్ ను దొంగతనం చేసి, పోలీసులకు దొరక్కుండా.. పారిపోతున్న క్రమంలో కృష్ణప్ప స్కూటర్ ను ఢీకొట్టాడని దర్యాప్తు అధికారి ఒకరు చెప్పారు.