కీసరలో 2 కిలోల పప్పీ స్ట్రా పట్టివేత

కీసర/దిల్​సుఖ్ నగర్ : కీసర మండలం యాదగిరిపల్లి చౌరస్తాలో ఓ ఆటో ట్రాలీలో తరలిస్తున్న 2 కిలోల 200 గ్రాముల పప్పీ స్ట్రా పోలీసులు పట్టుకున్నారు. ఈ డ్రగ్ ను రాజస్థాన్ కు చెందిన కరణ్ సింగ్ రాజ్ పుత్(19), రాకేశ్​మంజు బర్ఫీలాల్ (26) తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు జరుగుతోందని సీఐ వెంకటయ్య తెలిపారు.

అలాగే కొత్త పేట రైతు బజార్ వద్ద ఉన్న సుజాత బాయ్స్ హాస్టల్ వద్ద గంజాయి అమ్ముతున్న యలమంచ నిరీక్షన్​, భూషణగారి వెంకట్ రెడ్డి, మిట్ట బలరామ కృష్ణ, ఎందూరి జోష్ ,చిట్టెపు సాగర్ రెడ్డి అనే ఐదుగురు యువకులను చైతన్యపురి పోలీసులు, ఎల్ బీ నగర్ ఎస్​ఓటీ పోలీసులు పట్టుకున్నారు.  80 గ్రాముల గాంజా, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.  యశ్వంత్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. 

క్వేక్ ఎరినా పబ్ లో 8 మందికి డ్రగ్స్​ పాజిటివ్

గచ్చిబౌలి : న్యూఇయర్​వేడుకల్లో డ్రగ్స్  ను నియంత్రించడం కోసం టీజీ న్యాబ్ పోలీసులు ముందస్తుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి కొండాపూర్​ మజీద్ బండలోని మాయా కన్వెన్షన్ సెంటర్ లో కొనసాగుతున్న క్వేక్ ఎరినా పబ్​లో పియానో ప్లేయర్ బెన్ బూమర్ షో ఏర్పాటు చేశారు. టీజీ న్యాబ్, ఎస్ఓటీ,  మాదాపూర్, గచ్చిబౌలి పోలీసులు సోదాలు చేశారు.

ఈ ఈవెంట్​లో పాల్గొన్న 25 మందికి డ్రగ్స్ పరీక్షలు చేయగా, ఎనిమిది గంజాయి తీసుకున్నట్టు తేలింది. వారిని గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాజిటివ్​వచ్చినవారిలో నలుగురు సాఫ్ట్​వేర్​ ఎంప్లాయ్స్​ఉన్నారు. కాగా వారు పబ్​లో గంజాయి తీసుకోలేదని, రెండు మూడు రోజుల కింద తీసుకుని ఉంటారని పోలీసులు తెలిపారు.