సెన్సేషన్ కోసమే కౌన్సిలర్ భర్త దారుణ హత్య.. విచారణలో సంచలన విషయాలు

జగిత్యాల జిల్లా కోరుట్లలో ఇటీవల జరిగిన కౌన్సిలర్ భర్త పోగుల లక్ష్మీరాజం హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. సెన్సేషన్ కోసమే లక్ష్మీరాజంను హత్య చేసినట్లు విచారణలో నిందితులు వెల్లడించారని చెప్పారు జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్. ఎవరైనా ప్రముఖ వ్యక్తిని చంపి.. ఆ తర్వాత ఆ ఫేమ్ తో ల్యాండ్ సెటిల్మెంట్లు చేసుకోవచ్చన్న  ఉద్దేశంతో ఈ ఘాతుకానికి నిందితులు పాల్పడినట్లు చెప్పారు. ప్రధాన నిందితుడు నాగరాజు, అతడి తమ్ముడు త్రిమూర్తితో పాటు వీరికి సహకరించిన ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల వద్ద నుంచి 3 బైకులు, ఒక కారు, 8 సెల్ ఫోన్లు, 5 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. 

జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ వెల్లడించిన వివరాల ప్రకారం..  

ప్రతిరోజూ ఉదయం టీ తాగడం పోగుల లక్ష్మీరాజంకు అలవాటు. ఎప్పటిలానే ఆగస్టు 8వ తేదీ ఉదయం 9 గంటలకు కోరుట్ల పట్టణంలోని శంకర్ టీ స్టాల్ వద్దకు వెళ్లాడు. టీ తాగుతున్న సమయంలోనే ప్రధాన నిందితుడు  నాగరాజు, అతడి తమ్ముడు త్రిమూర్తి బైక్ వెళ్లారు. లక్ష్మీరాజంపై కత్తితో మెడ, తలపై నాగరాజు దాడి చేశాడు. మర్డర్ జరుగుతున్న సమయంలో ప్రత్యక్ష సాక్ష్యులు గట్టిగా అరవడంతో నిందితులు బైక్ పై పారిపోయారు. 

వెంటనే స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న లక్ష్మీరాజంను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడి భార్య, కౌన్సిలర్ ఉమారాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నలుగురు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు లక్ష్మీరాజం కుటుంబ సభ్యులు, బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. ఏడు బృందాల ద్వారా అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. 

ఆగస్టు 11వ తేదీ ఉదయం 4 గంటల సమయంలో నలుగురు నిందితులు కారులో కోరుట్లకు వస్తున్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితుల వాహనాన్ని ఆపి.. తనిఖీలు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకుని.. తమదైన స్టైల్లో విచారించడంతో అసలు నిజం ఒప్పుకున్నారు. నలుగురు ఇచ్చిన సమాచారం మేరకు మిగతా ఐదుగురు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని జిల్లా ఎస్పీ చెప్పారు. ఈ కేసులో ఇంకా ఎవరిదైనా ప్రమేయం ఉంటే వారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. మృతుడు లక్ష్మీరాజంకు నిందితులకు గతంలో ఎలాంటి గొడవులు లేవని జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ స్పష్టం చేశారు.

విచారణలో సంచలన విషయాలు ఇవే.. 

ప్రధాన నిందితుడు నాగరాజు గతంలో లైన్ మెన్ గా పని చేసేవాడు. 2021లో ఎల్ఎండీ కాలనీలో ఒక భూ వివాదంలో జోక్యం చేసుకుని.. కొంతమందితో కలిసి ఒక వ్యక్తిని మర్డర్ చేశాడు. ఆ తర్వాత నాగరాజును ఉద్యోగం నుంచి తొలగించడంతో అప్పటి నుంచి ల్యాండ్ సెటిల్ మెంట్లు, పంచాయతీలు చేస్తూ వస్తున్నాడు. కోరుట్లలో ప్రవీణ్ సింగ్ అనే రౌడీ షీటర్ అనుచరుడే నాగరాజు. ఈ మధ్యే ప్రవీణ్ సింగ్ హత్యకు గురయ్యాడు. 

ప్రవీణ్ సింగ్ మర్డర్ తర్వాత నాగరాజుకు ఆయన బృందానికి ల్యాండ్ సెటిల్ మెంట్లు చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తమకు సమాజంలో గుర్తింపు రాలేదనే ఉద్దేశంతో వ్యక్తి మర్డర్ కు ప్లాన్ చేశారు. కోరుట్ల పట్టణంలో మంచి పలుకుబడి ఉన్న ఎవరైనా వ్యక్తిని చంపేయాలని, దాని ద్వారా తాము సెన్సేషన్ క్రియేట్ చేయడం ద్వారా ల్యాండ్ సెటిల్ మెంట్లు ఈజీగా చేసుకోవచ్చని విత్తనాల నాగరాజు ప్లాన్ చేస్తాడు. ఇదే విషయాన్ని తన బృంద సభ్యులకు చెబుతాడు. 

మర్డర్ కోసం కౌన్సిలర్ ఉమారాణి భర్త పోగుల లక్ష్మీరాజంను ఎంచుకుంటారు. మార్త నరసింహులు అనే వ్యక్తి ద్వారా లక్ష్మీరాజం కదలికలను ప్రతిరోజూ తెలుసుకున్నారు. మార్త నరసింహులు ఇచ్చిన సమాచారంతోనే నిందితులు కోరుట్ల పట్టణంలోని శంకర్ టీ స్టాల్ వద్దకు వెళ్లి.. లక్ష్మీరాజంను హత్య చేశారు. ఆగస్టు 8వ తేదీన మార్నింగ్ 7 గంటలకు తొమ్మిది మంది నిందితులు ముందుగా కలుసుకునే చంపేందుకు వెళ్లారు. నిందితులందరూ ఎక్కువగా వాట్సాప్ కాల్స్ లోనే మాట్లాడుకున్నారు. చాలా తెలివిగా.. ఎవరికి దొరకుండా వాట్సాప్ కాల్స్ లో మాట్లాడుకున్నారు. 

లక్ష్మీరాజంను మర్డర్ చేసేందుకు ఒకే బైక్ పై నాగరాజు, అతడి తమ్ముడు త్రిమూర్తి టీ స్టాల్ వద్దకు వెళ్లారు. వీరికి సమీపంలోనే వంశీ, అతడి తమ్ముడు మధు మోహన్ మరో బైక్ పై వెళ్లారు. దీపక్, అలియాస్ సిద్ధు, ప్రభాస్ అనే మరో ఇద్దరూ మరో బైక్ పై కొంతదూరంలో ఉన్నారు. టీ స్టాల్ వద్ద మర్డర్ ప్లాన్ సక్సెస్ కాకపోతే మరో చోట చంపేందుకు దీపక్, ప్రభాస్ సిద్ధంగా ఉన్నారు. 

లక్ష్మీరాజంను మర్డర్ చేసిన తర్వాత నిందితులందరూ వంశీ పొలం వద్ద కలుసుకున్నారు. మళ్లీ ఇక్కడ కూడా ప్రధాన నిందితుడు నాగరాజు ఒక ప్లాన్ చేశాడు. నేరాన్ని తనపై వేసుకుంటే లైన్ మెన్ ఉద్యోగం రాదని, ఇప్పటికే తనపై ఒక మర్డర్ కేసు ఉందని భావించి..పిల్లి సత్యానారాయణ, త్రిమూర్తి (నాగరాజు తమ్ముడు)పై వేసుకోవాలని వారికి చెప్పాడు నాగరాజు. పల్సర్ బైక్ ఇచ్చి వారిని మరో చోటకు పంపించాడు. ఆ తర్వాత అందరూ దొరికిపోయారు. అనుకున్న ప్రకారం ప్లాన్ సక్సెస్ కావడంతో ఇప్పుడు కటకటాలు లెక్కించాల్సి వచ్చింది. 

మృతుడు లక్ష్మీరాజం బంధువులు మరికొంతమందిపైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారని, వారిని కూడా విచారిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితులందరికీ కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తొమ్మిది మంది నిందితుల్లో ఐదుగురిపై రౌడీషీట్ ఉంది. వీరిపై పీడీయాక్ట్ కూడా నమోదు చేస్తామన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టి.. త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోరుట్ల ప్రజలు భయపడొద్దని, ఏదైనా సమాచారం ఉంటే  తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించే వారిని సహించేది లేదని స్పష్టం చేశారు.