జగద్గిరిగుట్ట మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

జగద్గిరిగుట్ట మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

స్నేహితులే కొట్టి చంపేశారు

జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్ట ధీనబంధు కాలనీలో జరిగిన యువకుడి మర్డర్ ​కేసును పోలీసులు ఛేదించారు. స్నేహితులే హంతకులుగా తేల్చారు. ధీనబంధు కాలనీకి చెందిన మహ్మద్​నదీమ్ పాషా, మహ్మద్​ఖలీల్, కట్టా వరప్రసాద్ ముగ్గురు ఫ్రెండ్స్. ఆదివారం అర్ధరాత్రి 2 గంటలకు వడ్డేపల్లి ఎన్​క్లేవ్​వద్ద వరప్రసాద్​బర్త్​డే వేడుకలకు నదీమ్, ఖలీల్ హాజరయ్యారు. మద్యం సేవించిన అనంతరం ఇంటికి బయలుదేరగా, ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఈ క్రమంలో ఖలీల్​ను నదీమ్ పాషా చంపేప్తానని బెదిరించాడు. చెడు అలవాట్లకు బానిసై బ్లేడ్​లను నోట్లో పెట్టుకుని తిరుగుతుండడం, గతంలో సైతం ఇదే విధంగా బెదిరించడంతో భయపడిన ఖలీల్..​ తానే ముందుగా నదీమ్​ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. తన ఫ్రెండ్ ​వరప్రసాద్​తో కలిసి 3 గంటల ప్రాంతంలో అతడి ముఖం, తలపై విక్షణారహితంగా కొట్టి చంపేశాడు.  

సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను సోమవారం అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించినట్లు బాలానగర్​ ఏసీపీ హనుమంతరావు, సీఐ నర్సింహ తెలిపారు. నదీమ్​పై గతంలో దొంగతనం కేసు నమోదైనట్లు పేర్కొన్నారు.