వీడిన కేసుల మిస్టరీ..ఆరుగురు అరెస్ట్

వీడిన కేసుల మిస్టరీ..ఆరుగురు అరెస్ట్

మెదక్​టౌన్, వెలుగు : పాతకక్షలతో ఒకచోట, వేధింపులు తట్టుకోలేక మరోచోట కుటుంబ సభ్యులను సొంతోళ్లే చంపేశారు. ఆ నేరం తమపై పడకుండా వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు చేసి కటకటాలపాలయ్యారు. ఇటీవల మెదక్​ జిల్లాలో రెండు చోట్ల జరిగిన మర్డర్​ కేసులను పోలీసులు ఛేదించారు. రెండు ఘటనల్లో ఆరుగురి నిందితులను అరెస్టు చేశారు. మెదక్​ డీఎస్పీ ఆఫీసులో శుక్రవారం అడిషనల్​ఎస్పీ కేసుల వివరాలను మీడియాకు వెల్లడించారు. 

పాతకక్షలతో.. 

మెదక్​పట్టణంలోని అవుసులపల్లికి చెందిన తాడెపు పోచయ్య కుమారుడు శివాజీ(23) మెకానిక్​గా పని చేసేవాడు. అతడు ఈనెల 28న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని అందరూ భావించారు. కానీ మృతుడి తండ్రి పోచయ్య అనుమానం వ్యక్తం చేస్తూ మెదక్​ రూరల్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టడంతో శివాజీ హత్యకు గురైనట్లు తేలింది. 27న సాయంత్రం అదే గ్రామానికి చెందిన పోచయ్య అన్నదమ్ముల పిల్లలు తాడెపు సాయిలు, తాడెపు లక్ష్మణ్​తో పాటు ట్రాక్టర్​ మెకానిక్​లైన మొరికే మల్లేశం, కుంటి దుర్గా బన్నీ  కలిసి శివాజీని వెంటబెట్టుకుని మెదక్​ హౌసింగ్​ బోర్డు కాలనీలోని ఓ ప్రైవేట్ ​వెంచర్​లోకి వెళ్లారు. శివాజీతో వారికి  వ్యాపారానికి సంబంధించిన గొడవలున్నాయి.  నలుగురు కలిసి శివాజీని రాడ్లతో కొట్టి హత్య చేశారు. అదే రోజు రాత్రి డెడ్​బాడీని తమ టూ వీలర్​పై తీసుకెళ్లి మెదక్​–రామాయంపేట రోడ్డులో యాక్సిడెంట్​గా క్రియేట్​ చేశారు. మరుసటిరోజు స్థానికులు ఇచ్చిన సమాచారంతో మృతుడి కుటుంబ సభ్యులకు విషయం తెలిసిందని ఏఎస్పీ వివరించారు. నలుగురి నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

అన్నంలో విషం పెట్టి.. ఉరివేసి.. 

హవేలీఘనపూర్​మండలం  నాగాపర్​ గ్రామానికి చెందిన చింతకింది దేవేందర్(35) గతంలోనే భార్యతో విడాకులు తీసుకున్నాడు. తల్లి భూమవ్వ, తమ్ముడు కృష్ణతో కలిసి ఉంటున్నాడు. అయితే ఈనెల 17న దేవేందర్​చనిపోయాడు. అతడు మద్యానికి బానిసై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి, తమ్ముడు చెప్పారు. అదే రోజు అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉండగా దేవేందర్​ది ఆత్మహత్య కాదని, అనుమానాలు ఉన్నాయని స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. దేవేందర్​ మద్యం తాగి రోజూ తమతో గొడవపడుతున్నాడని తల్లి, తమ్ముడు కలిసి అన్నంలో విషం పెట్టి అతడిని చంపేశారు. అనంతరం డెడ్​బాడీని తాడుకు వేలాడదీశారు. తాగుడుకు బానిసై ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులను నమ్మించారు. కానీ పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ఈ మేరకు వారిద్దని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. సమావేశంలో మెదక్​ డీఎస్పీ సైదులు, మెదక్​ రూరల్​ సీఐ విజయ్​, మెదక్​ రూరల్ ఎస్సై మోహన్​రెడ్డి, హవేలీఘనపూర్ ​ఎస్సై మురళి 
పాల్గొన్నారు.