చండూరు/మునుగోడు, వెలుగు: చర్లగూడెం రిజర్వాయర్ నిర్వాసితులకు మద్దతుగా తెలంగాణ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా మునుగోడు చౌరస్తాలో స్టూడెంట్స్ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. చర్లగూడెం రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన కుదాభక్ష్‌పల్లి, రాంరెడ్డిపల్లి, శివన్నగూడ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని మర్రిగూడ తహసీల్దార్ఆఫీసు వద్ద 28 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో నిర్వాసితులకు సంఘీభావంగా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో స్టూడెంట్లు దీక్ష చేపట్టారు. పోలీసులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నల్లగొండ అంజితోపాటు స్టూడెంట్లను నల్గొండకు తరలించారు. దీక్షకు వస్తున్న 600 మందికి పైగా నిర్వాసితులను బోడంగిపర్తి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిర్వాసితులు నాలుగు కి.మీ. దూరంలో ఉన్న చండూరుకు నడుచుకుంటూ వెళ్లి చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. మునుగోడు ఎస్సై సతీశ్‌రెడ్డి అక్కడికి చేరుకుని రైతులను చండూరుపీఎస్కు తరలించారు. ఈ సందర్భంగా తోపులాట జరగడంతో ఓ రైతు కిందపడ్డాడు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ తీసుకువెళ్లిన నిర్వాసితులను కొద్దిసేపటి తర్వాత వదిలిపెట్టారు.
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
అరెస్టులతో ఉద్యమంలో ఆపలేరని తెలంగాణ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ అంజి హెచ్చరించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టీఎస్‌యూ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం సరికాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అరెస్టులపై పెట్టిన దృష్టి భూ నిర్వాసితులకు న్యాయం చేయడంపై పెడితే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. నిర్వాసితులకు న్యాయం చేసేంతవరకు ఉద్యమాన్ని ఆపేదిలేదన్నారు. నిరసన కార్యక్రమంలో టీఎస్ యూ నియోజకవర్గం అధ్యక్షుడు చెరుకు శివ, ప్రధాన కార్యదర్శి లింగస్వామి పాల్గొన్నారు.