యాదాద్రి భువనగిరి జిల్లా పాత గుట్ట చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. యాదగిరిగుట్ట పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. పప్పు కుమార్ బల్మికి అనే వ్యక్తి వద్ద గంజాయి పట్టుబడింది. టీవీఎస్ వాహనంపై వెళ్తుండగా అతడిని పోలీసులు ఆపి.. తనిఖీ చేయగా.. సుమారు 129 గ్రాముల గంజాయి దొరికింది.
వెంటనే పప్పు కుమార్ ను పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. తాను గంజాయిను అమ్మేందుకు వచ్చానంటూ సమాధానం చెప్పడంతో షాక్ అయ్యారు పోలీసులు. వెంటనే అతడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రిమాండ్ కు తరలించారు.
డ్రగ్స్ అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన అదేశాలు జారీ చేశారు. ఆదివారం (డిసెంబర్ 24న) నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. గంజాయి అనే పదం తెలంగాణ రాష్ట్రంలో వినిపించకూడదన్నారు. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.