ఏపీ అసెంబ్లీ : జగన్ చేతిలోని ప్లకార్డులు చింపేసిన పోలీసులు..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు హోరాహోరీగా జరుగుతున్నాయి. సభను నిరసిస్తూ మాజీ సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. ‘సేవ్‌ డెమొక్రసీ’ అని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్నారు పోలీసులు. వారి చేతుల్లో ఉన్న ప్లకార్డులు, పేపర్లు లాక్కుని చింపేశారు. 

పోలీసుల తీరుపై వైయస్‌ జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అధికారం ఎవరిచ్చారంటూ పోలీసులను నిలదీశారు.  అసెంబ్లీ గేటు వద్ద పోలీసుల వ్యవహారశైలిపై ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫైర్ అయ్యారు. పోలీసుల ఝులుం ఎల్లకాలం సాగదని.. ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. 

Also Read :- అసెంబ్లీ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్

పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కానీ, యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కోసం కాదన్నారు జగన్. పోలీసుల వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేసిన జగన్ సభలో సైతం సేవ్ డెమొక్రసి అంటూ నినాదాలు చేశారు. సభ నుంచి వాకౌట్ చేశారు.