నల్గొండ, వెలుగు: మునుగోడు నియోజకవర్గంలోకి డబ్బు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో కేవలం ప్రతిపక్ష లీడర్లను మాత్రమే పోలీసులు టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల లీడర్ల వాహనాలపైనే నిఘా పెడుతున్నారు. సోమవారం చల్మెడ క్రాస్‌రోడ్డు వద్ద ఓ బీజేపీ లీడర్ కారులో రూ.కోటి పట్టుకున్నట్లు ప్రకటించిన పోలీసులు.. మంగళవారం గట్టుప్పల్శివారులో కాంగ్రెస్ నేతకు చెందిన కారు నుంచి రూ.19 లక్షలు సీజ్ చేసినట్లు చెప్పారు. కానీ అధికార పార్టీ నుంచి 15 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలంతా మునుగోడులో తిష్టవేసి ప్రచారం పేరుతో నిత్యం మందు, విందు, జన సమీకరణ అంటూ కోట్లు కుమ్మరిస్తున్నా, స్వయంగా మంత్రి మల్లారెడ్డి కుల సంఘాలకు బహిరంగంగా లక్షలకు లక్షలు పంచుతున్నా పోలీసులు, ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఖర్చు పెడుతున్న కోట్ల రూపాయలు మునుగోడులోకి ఏ రూట్లలో, ఏ కార్లలో వస్తున్నాయో, వాటిని చెక్‌పోస్టుల్లో ఎందుకు పట్టుకోవడం లేదో ఆఫీసర్లకే తెలియాలంటూ జనం మండిపడుతున్నారు.
టీమ్‌లన్నీ ప్రతిపక్షాలపైకి
మునుగోడు బైపోల్‌లో డబ్బు, మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు పోలీస్, రెవెన్యూ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఏడు సర్వైలెన్స్ టీమ్‌లు పనిచేస్తున్నాయి. వీరికి సహకరించేందుకు ఒక్కో గ్రామంలో ఎస్ఐ, పది మంది సిబ్బందిని కేటాయించారు. 24 గంటలపాటు పనిచేసేలా 16 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మరో 16 ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్), 14 ఫ్లయింగ్ స్క్వాడ్(ఎఫ్‌ఎస్),7 వీఎస్(వీడియో సర్వైలెన్స్), 18 ఎస్ఎస్టీ(స్టాటిస్టిక్సర్వైలెన్స్ టీమ్)లను రంగంలోకి దించినట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి పంపాల్సిన పోలీసులు వివక్ష చూపుతున్నారు. కేవలం బీజేపీ, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష నేతల వెహికల్స్‌ను మాత్రమే అణువణువూ తనిఖీ చేసి, అధికార పార్టీ లీడర్ల వాహనాలను నామమాత్రంగా చూసి వదిలేస్తున్నారు. ఈ వ్యవహారంపై విమర్శలు రావడంతో ఒకరిద్దరు మంత్రుల వాహనాలు కూడా తనిఖీ చేసినట్లు రెండు వీడియోలు తీసి, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.
విజయవాడలో పట్టుకుని.. మునుగోడులో దొరికినట్లు..
మునుగోడు ఠాణా పరిధిలోని చల్మెడ చెక్ పోస్ట్ వద్ద సోమవారం చేసిన తనిఖీల్లో కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి ప్రకటించారు. కరీంనగర్‌లోని13 డివిజన్ కార్పొరేటర్ భర్త చొప్పరి వేణు.. ఓ బీజేపీ లీడర్ కోసం విజయవాడ నుంచి టాటా సఫారీ కారులో డబ్బు తెస్తుండగా, పట్టుకొని సీజ్‌చేసినట్లు ఆమె చెప్పారు. కానీ వేణు వద్ద దొరికిన కోటి రూపాయలు బైపోల్ కోసం తెస్తున్నవి కాదని, ఆయన విజయవాడ సమీపంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయగా వచ్చిన పైసలు అని బీజేపీ నేతలు అంటున్నారు. కరీంనగర్‌కు చెందిన టీఆర్ఎస్ లీడర్లు ఇచ్చిన సమాచారం మేరకే చొప్పరి వేణు నుంచి విజయవాడ సమీపంలో పోలీసులు డబ్బు స్వాధీనం చేసుకున్నారని, ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో మునుగోడులో దొరికినట్లు సీన్ క్రియేట్చేయించారని ఆరోపిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు విజయవాడ నుంచి రెండు చెక్‌పోస్టులు దాటించారని, అక్కడి సీసీటీవీ ఫుటేజీలను చూస్తే అసలు దొంగలెవరో బయటపడుతారని చెబుతున్నారు. మంగళవారం గట్టుప్పల్ నుంచి పుట్టపాక వెళ్లే దారిలో పోలీసులు చేసిన తనిఖీల్లో ఓ కారులో రూ.19 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డబ్బు కాంగ్రెస్ పార్టీకి చెందినవని తొలుత ప్రచారం చేశారు. చివరికి ఆ పైసలు ఓ వ్యక్తి భూమి కొనుగోలు వ్యవహారానికి సంబంధించినవని చెప్పడంతో పోలీసులు ఆ మేరకు ఎంక్వైరీ చేస్తున్నారు.
అధికార పార్టీకి రైట్ రైట్
మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్గౌడ్కార్లను ఇప్పటికి రెండుసార్లు తనిఖీ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్న పోలీసులు.. బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఇతర మంత్రుల వాహనాల జోలికి వెళ్లడం లేదు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తదితర మంత్రులు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి రెండు, మూడు రోజులకోసారి నియోజకవర్గానికి వస్తున్నారు. ఇలా వచ్చిపోయే వాహనాలను పోలీసులు, ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు. ఓటర్లను ఊరు కూడా దాటినివ్వకుండా కాపలా కాస్తున్న టీఆర్ఎస్ ఇన్చార్జిలు, ఎంపీటీసీ పరిధిలో బాధ్యతలు చూస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేల వైపు పోలీసులు, సర్వైలెన్స్టీమ్లు కన్నెత్తి చూడటం లేదు. విందులు, వినోదాల పేరుతో దావత్‌లు ఇస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
మంత్రిపై చర్యలేవీ
మంత్రి మల్లారెడ్డి ఏకంగా చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో ఓ కుల సంఘానికి రూ.2 లక్షలు పంపిణీ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినా ఎన్నికల అధికారులు, పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితయ్యారు. ‘‘12 లక్షలు ఇస్తామన్నరు.. 2 లక్షలే ఇచ్చిన్రు.. మిగిలిన పైసలెక్కడ?’’ అంటూ ప్రజలు నిలదీసినా ఇప్పటివరకు మంత్రి మల్లారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మంత్రులను, ఎమ్మెల్యేలను గ్రామాల్లో ఎవరైనా గట్టిగా నిలదీస్తే చితకబాదుతున్న పోలీసులు.. డబ్బులు పంపిణీ చేస్తున్న టీఆర్ఎస్ లీడర్లకు తెరవెనుక సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.