లాకప్​లలో నలుగుతున్న ఫ్రెండ్లీ పోలీసింగ్​

లాకప్​లలో నలుగుతున్న ఫ్రెండ్లీ పోలీసింగ్​

2023 ఆగస్టు15.. దేశమంతా 77వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్​ నడిబొడ్డున వడిత్య వరలక్ష్మి అనే ఓ గిరిజన మహిళపై అమానవీయ రీతిలో దాడి జరిగింది. అర్ధరాత్రి పూట ఈ దాడికి పాల్పడింది ఏ గూండాలో, దోపిడీ దొంగలో కాదు. సాక్షాత్తూ ప్రజల మాన, ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులు. అలాగని ఆ మహిళ చేసిన నేరమల్లా తన చేతిలో 3 లక్షల రూపాయలు కలిగి ఉండటమే! తన బిడ్డ పెండ్లి కోసమే ఆ పైసలు తెస్తున్నానని, తన వద్ద ఉన్న పెండ్లి కార్డు చూసైనా వదిలేయాలని వేడుకున్నా వినిపించుకోని ఎల్బీనగర్​ పోలీసులు రాత్రిపూట ఆమెను పోలీస్​స్టేషన్ ​తీసుకెళ్లి విచక్షణా రహితంగా కొట్టారు. ఆమె ఒంటి మీది గాయాలు చూస్తే మనం సభ్యసమాజంలోనే బతుకుతున్నామా? అనే అనుమానం కలుగక మానదు. తీవ్ర గాయాలతో నడవలేని స్థితిలో ఉన్న వరలక్ష్మిని16న ఆటోలో ఇంటికి పంపారు. ఎస్ఐ రవికుమార్​ తనను బూటుకాలితో తన్నాడని, మహిళనని చూడకుండా ఇష్టమొచ్చినట్లు కొట్టాడని, తన దగ్గర ఉన్న రూ.3 లక్షలు, బంగారం తీసుకున్నాడని వరలక్ష్మి ఆరోపించినప్పటికీ ఉన్నతాధికారులు మాత్రం హెడ్ కానిస్టేబుల్ శివ శంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. నెలరోజులు గడుస్తున్నా ఎస్ఐ మీద చర్యలు తీసుకున్నది లేదు. ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారీ ఆఫీసర్లను వదిలేసి కింది స్థాయి సిబ్బందిని బలిచేయడం మన పోలీస్​ డిపార్ట్​మెంట్​కే  చెల్లుతోంది.

ఒక్క మరియమ్మ ఘటనలోనే చర్యలు

ఠాణాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు లెక్కలేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో 13 లాకప్ డెత్​లు జరిగినట్లు పోలీస్ ​రికార్డులు చెప్తున్నాయి. 2021 జూన్‌‌‌‌ 18న యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు పీఎస్‌‌‌‌లో జరిగిన మరియమ్మ లాకప్‌‌‌‌డెత్‌‌‌‌ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. రూ.2 లక్షల చోరీ కేసులో ఖమ్మం జిల్లా చింతకాని సమీపంలోని కోమట్లగూడెంకు చెందిన మరియమ్మను అడ్డగూడురు పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన మరియమ్మ చికిత్స తీసుకుంటూ చనిపోయింది. మెదక్​పట్టణానికి చెందిన ఖదీర్​ఖాన్​ లాకప్​డెత్​ కూడా అదే స్థాయిలో కలకలం రేపింది. చైన్​ స్నాచింగ్​ చేశాడనే అనుమానంతో  మెదక్ టౌన్​ పోలీసులు ఈ ఏడాది జనవరి 29న మెదక్ కు చెందిన35 ఏళ్ల ఖదీర్​ఖాన్​ను హైదరాబాద్​ నుంచి పట్టుకెళ్లి ఐదు రోజుల పాటు ఇంటరాగేషన్​ చేసిన అనంతరం తహసీల్దార్​ముందు బైండోవర్ ​చేసి వదిలేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఖదీర్ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి17న చనిపోయాడు. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా హైకోర్టు ఫిబ్రవరి 21న ఖాదీర్​ఖాన్​ మృతి సంఘటనను సుమోటోగా స్వీకరించి, కన్నెర్ర చేస్తే తప్ప పోలీస్​ ఉన్నతాధికారులు ఈ కేసులో ముందుకు కదలలేదు. ఏప్రిల్ 26న హైదరాబాద్​లో ఇలాంటి ఓ లాకప్​డెత్​మరోసారి చర్చనీయాంశమైంది. ఓ కేసులో విచారణ కోసం ఎల్బీనగర్​కు చెందిన 30 ఏండ్ల ఆమూరి చిరంజీవిని తుకారం గేట్​ఠాణాకు తీసుకెళ్లిన పోలీసులు థర్డ్​డిగ్రీ ప్రయోగించారు. దెబ్బలు తాళలేక అదే రోజు అర్ధరాత్రి లాకప్​లోనే చిరంజీవి బతుకు అర్ధంతరంగా తెల్లారింది. బయటకు వస్తున్న కస్టోడియల్​ డెత్​ల సంగతి ఇలా ఉంటే, పోలీసుల వేధింపులు తాళలేక ఠాణాల బయట ఆత్మహత్య చేసుకున్న బాధితులు ఇంకెందరో! అనేక క్రిమినల్ కేసుల్లో పోలీసులు అమాయకులనుచిత్రహింసలకు గురిచేసి తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పైగా లాకప్ డెత్​జరిగినప్పుడు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ తో విచారణ జరిపించాలని చట్టం చెప్తున్నా  కేవలం ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్​ విచారణకు ఆదేశించి, ఆర్డీవోల సాయంతో కేసు మూసివేస్తున్నారనే విమర్శలున్నాయి. ఒక మరియమ్మ కేసులో తప్ప పోలీసులపై తీవ్ర చర్యలు తీసుకున్నది లేదు. బాధితులంతా బలహీనవర్గాల వాళ్లు కావడం, తప్పు చేసిన ఖాకీలపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మళ్లీ మళ్లీ ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారనే  అభిప్రాయాలున్నాయి.

పోలీస్​ కంప్లైంట్ ​అథారిటీలు ఎక్కడ?

ఎవరైనా తమకు అన్యాయం జరిగితే పోలీస్​స్టేషన్ ​మెట్లు ఎక్కుతారు. కానీ పోలీసులే అన్యాయం చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇదీ సామాన్యుల ముందున్న ప్రశ్న. 2006లో ‘ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసు తీర్పులో జిల్లాల వారీగా పోలీస్ కంప్లైంట్ అథారిటీలను నియమించాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.  వీటికి సివిల్ కోర్టులకు ఉండే అధికారాలు ఉంటాయి. పోలీసుల ద్వారా అన్యాయం జరిగినప్పుడు సామాన్యులెవరైనా ఈ పోలీస్ కంప్లైంట్ అథారిటీల్లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ క్రమంలో 2021జూన్​లో పోలీస్​ కంప్లైంట్​అథారిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో నం1093 జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ, హైదరాబాద్‌‌‌‌ రీజియన్‌‌‌‌, వరంగల్‌‌‌‌ రీజియన్‌‌‌‌ అథారిటీలు ఏర్పాటయ్యాయి. కేవలం రికార్డుల కోసమే ఈ అథారిటీలను ఏర్పాటు చేశారు తప్ప సుప్రీం గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ ప్రకారం చైర్మన్‌‌‌‌, ప్యానల్‌‌‌‌ మెంబర్స్‌‌‌‌ను నియమించలేదు. మరోవైపు పోలీసుల చేతుల్లో సామాన్యులు చిత్రహింసలకు గురికాకుండా అన్ని ఠాణాల్లో సీసీటీవీ కెమెరాలను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, విజువల్​డేటాను కనీసం ఆరు నెలలు భద్రపరచాలని  సుప్రీంకోర్టు 2015లో తీర్పు ఇచ్చింది. ఈ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణపై జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పర్యవేక్షణ కమిటీలను కూడా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మన రాజధాని నడిబొడ్డున ఏకంగా రూ.600 కోట్లతో కట్టుకున్న కమాండ్ ​కంట్రోల్ సెంటర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని సీసీటీవీలను అనుసంధానించి 24 గంటలూ నిఘా పెడ్తామని రాష్ట్ర సర్కారు చెప్పిన మాట ఉత్తిదే అయింది. నిజానికి చాలా పోలీస్ స్టేషన్లలో నేటికీ పూర్తి స్థాయిలో సీసీటీవీ కెమెరాలు పెట్టలేదు. ఒకవేళ ఏర్పాటు చేసినా అలాంటి ఘటనలు జరిగినప్పుడు సీసీ టీవీలు పనిచేయడం లేదని చెబుతున్నారు.  ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే!

అధికార పార్టీ చెప్పుచేతల్లో పోలీసులు

చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు, తాము సైతం ఆ చట్టానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందనే సంగతి మర్చిపోతున్నారు. మన రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ను​కేవలం రూలింగ్​పార్టీ లీడర్లకే పరిమితం చేశారు. తమ ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లు, ఇతర వ్యవహారాలన్నీ ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల్లో ఉండటం, ఏం జరిగినా వెనకాల వాళ్లు చూసుకుంటారులే అన్న  ధైర్యంతోనే పోలీసులు రెచ్చిపోతున్నారు. నేతల భూ కబ్జాలకు, వనరుల దోపిడీకి అండగా నిలుస్తున్న ఖాకీలు.. ఈ క్రమంలో ప్రత్యర్థులు, సామాన్య ప్రజల పట్ల  కర్కశంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సిరిసిల్లలో రూలింగ్​పార్టీ లీడర్ల ఇసుక దందాను అడ్డుకున్న నేరెళ్ల దళితులను చిత్రహింసలు పెట్టడం దగ్గరి నుంచి ఖమ్మంలో మిర్చి రైతులకు, హుస్నాబాద్​లో  గౌరవెల్లి రిజర్వాయర్​ నిర్వాసితులకు బేడీలు వేయడం దాకా రాష్ట్రంలో పోలీసుల అకృత్యాలకు లెక్కలేదు. బీఆర్ఎస్​ రెండోసారి పవర్​లోకి వచ్చాక రూలింగ్​పార్టీ లీడర్లకు తప్ప ప్రతిపక్షాలకు, సామాన్యులకు వాక్​స్వాతంత్ర్యం లేకుండా పోయింది. ఎమ్మెల్యేలు, మంత్రులను సోషల్​ మీడియాలో విమర్శిస్తే చాలు, పట్టుకెళ్లి చితక్కొడుతున్న ఘటనలు కోకొల్లలు. కేసీఆర్, కేటీఆర్​ పర్యటన ఉంటే చాలు,ప్రతిపక్ష లీడర్లంతా అయితే పోలీస్​ స్టేషన్లలో, లేదంటే హౌస్ అరెస్ట్​లో ఉండాల్సిందే! 

- చిల్ల మల్లేశం, సీనియర్​ జర్నలిస్ట్