స్మగ్లర్లకు మొఘల్‌పురాలో షెల్టర్ ఇచ్చిన నగల తయారీదారు
హైదరాబాద్, వెలుగు : బంగారం స్మగ్లర్ల అరెస్టు కోసం ఓల్డ్‌సిటీ వెళ్లిన పోలీసులపై ఆదివారం రాత్రి దాడి జరిగింది. మఫ్టీలో ఉన్న పోలీసులపై కర్రలు, ఐరన్ రాడ్స్‌తో 20 మందికి పైగా దాడి చేశారు. ఈ ఘటనలో మైలార్‌దేవ్‌పల్లి డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్రగౌడ్ మరో నలుగురు కానిస్టేబుల్స్ తీవ్రంగా గాయపడ్డారు. మొఘల్‌పురా ఠాణా పరిధిలో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయాజ్, ఖదీర్ అనే వ్యక్తులు విదేశాల నుంచి గోల్డ్ తెచ్చి వట్టేపల్లి, శాస్త్రి పురంలో అమ్ముతున్నట్లు మైలార్‌దేవ్ పల్లి పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర గౌడ్, కానిస్టేబుల్స్ ముక్తార్, అశోక్, విజయ్‌కుమార్, రాజారావు ఆ ఏరియాకు వెళ్లి సెర్చ్ చేశారు. నిందితులు సర్దార్ మహల్‌లోని నగల తయారీదారు ఖాదర్ వద్ద షెల్టర్ తీసుకున్నట్లు గుర్తించారు.
వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఖాదర్ కొంతకాలంగా మొఘల్‌పుర సర్దార్ మహల్ లో ఉంటున్నాడు. ఆర్డర్స్‌పై బంగారు నగలు తయారు చేస్తుంటాడు. వెస్ట్‌బెంగాల్ కు చెందిన 25 మందికి పైగా వర్కర్స్‌గా అతని వద్ద పనిచేస్తున్నారు. స్మగ్లర్లు అయాజ్, ఖదీర్ ను పట్టుకునేందుకు పోలీసులు రావడంతో ఖాదర్ అలర్ట్ అయ్యాడు. దొంగలు వచ్చారని అక్కడి వర్కర్స్‌ను రెచ్చగొట్టాడు. దీం తో మఫ్టీలో ఉన్న పో లీసులపై వర్కర్స్ మూకుమ్మడిగా దాడికి దిగారు. స్మగ్లర్లు అయాజ్, ఖదీర్ అక్కడి నుంచి పారిపోయారు. దాడిలో గాయపడ్డ డీఐ స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు స్పాట్‌కు చేరుకొని గాయపడ్డ వారిని అత్తాపూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.