బ్రిటిష్ కాలంలో రైతాంగ ఉద్యమాలు: పంటపై పన్ను వసూలు విధానాలు

బ్రిటిష్ కాలంలో రైతాంగ ఉద్యమాలు: పంటపై పన్ను వసూలు విధానాలు

భారతదేశంలో రైతాంగ ఉద్యమాలకు బ్రిటీష్​ వారు అవలంబించిన విధానాలు ప్రధాన కారణమయ్యాయి. జమీందారీ, రైత్వారీ విధానం ద్వారా రైతులను దోపిడీ చేయడం, బలవంతంగా నీలిమందు పంటలను సాగు చేయమనడం, వడ్డీ వ్యాపారుల దోపిడీ రైతుల్లో అశాంతికి కారణమైంది. ఇవి తీవ్ర ఉద్యమాలకు దారి తీశాయి. మహాత్మాగాంధీ, సర్ధార్​ వల్లభాయ్​ పటేల్​, జేబీ కృపలాని, బాబు రాజేంద్రప్రసాద్​ వంటి నాయకులు  నాయకత్వం వహించడంతో కొన్ని ఉద్యమాలు భారతదేశ చరిత్రలో గొప్ప ఉద్యమాలుగా నిలిచాయి.  

చౌర్​ తిరుగుబాటు: ఈ తిరుగుబాటు దుర్జన్​సింగ్​ ఆధ్వర్యంలో దుర్భిక్షం, శిస్తు పెంచడానికి వ్యతిరేకంగా బెంగాల్​లోని మిడ్నాపూర్​, బాకురా జిల్లాలో జరిగింది. 
నీలిమందు తిరుగుబాటు: ఈ తిరుగుబాటు విష్ణుచరణ్​ బిశ్వాస్​, దిగంబర్​ బిశ్వాస్​ల నాయకత్వంలో బెంగాల్​లోని గోవిందపూర్​ గ్రామంలో జరిగింది. ఇండిగో పంటలను పండించడాన్ని బ్రిటీష్​ వారు ముఖ్యంగా ప్లాంటర్స్​ బలవంతపెట్టడం, ఈ పంటలను పెంచడానికి దదోన్​ అనే లోన్​ సౌకర్యం కల్పించడం, అధిక వడ్డీలను వసూలు చేయడం. ఈ ఉద్యమాన్ని నీలదర్పన్​ (దీనబందు మిత్ర – 1859) అనే బెంగాలీ డ్రామా వ్యాప్తి చేసింది. హరిశ్చంద్ర ముఖర్జీ నడిపిన హిందూ పేట్రియాట్​ అనే పత్రిక ఈ ఉద్యమానికి మద్దతు తెలిపింది. ఈ ఉద్యమం ఫలితంగా 1860లో టవర్​ ఆధ్వర్యంలో నీలిమందు కమిషన్​ను నియమించింది. ఫలితంగా నీలిమందును పండించడాన్ని నిషేధించారు. 

పబ్నా ఉద్యమం: ఇది కేశవ్​ చంద్రరాయ్​, శంభూనాథ్​ పాల్​ నాయకత్వంలో పబ్నా జిల్లాలో జరిగింది. పబ్నా పోరాటం జమీందార్ల మధ్య కౌలుదార్ల మధ్య ప్రారంభమై కౌలుదారీ చట్టాలకు నాంది పలికింది. ఈ ఉద్యమానికి తనవంతు మద్దతుగా     ఆర్​.సి.దత్​ 1874లో పీసెంట్​ ఆఫ్​ బెంగాల్​ అనే పుస్తకం రాశారు. బెంగాల్​ కౌలుదారు చట్టం–1875 కౌలుదార్ల రక్షణ విషయాన్ని ధ్రువీకరించడానికి భూమి లేని రైతులకు, రైతు కూలీలకు పంటలో భాగాన్ని కల్పించడానికి ఉద్దేశించింది. ఫలితంగా రైతులు కొంతవరకు రక్షణ పొందారు. 

దక్కన్​ షౌకార్​ వ్యతిరేక అల్లర్లు: ఇది షౌకార్లు అనే గుజరాతీ, మార్వాడీ వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా పూనా, సతారా, అహ్మద్​నగర్​, షోలాపూర్​లో జరిగింది. దక్కన్​ రైతాంగ పోరాటం సూఫా గ్రామంలో ప్రారంభమై ఇతర గ్రామాలకు వ్యాపించింది. ఈ ప్రాంతంలో బ్రిటీష్​ రెవెన్యూ విధానాన్ని, సివిల్​ కోర్టు పని విధానాలను సర్​ జి.వింగేట్​ చాలా లోతుగా అధ్యయనం చేశారు. ఫలితంగా రైతుల ఉద్యమం వల్ల దక్కన్​ వ్యవసాయ ఉపశమన చట్టం–1879 అనే చట్టం వచ్చింది. దీనివల్ల వడ్డీవ్యాపారుల నుంచి రైతులు రక్షణ పొందారు. 

పంజాబ్​లో రైతుల అశాంతి: ఈ అశాంతికి ప్రధాన కారణం వడ్డీ వ్యాపారులు రైతుల భూములను హస్తగతం చేసుకోవడం. ఇందులో భాంగా రైతులు వడ్డీ వ్యాపారులపై దాడి చేసి హత్య చేశారు. దీని నివారణకు పంజాబ్​ భూ అన్యాక్రాంత చట్టాన్ని(1902) తీసుకువచ్చింది. ఈ చట్టం రైతుల నుంచి భూములను వడ్డీ వ్యాపారులకు బదిలీ కావడాన్ని 20 సంవత్సరాలకు మించిన తాకట్టులను నిషేధించింది. ఈ ఉద్యమకాలంలో అత్యంత ఆదరణ పొందిన పాట పగిడి సంబాల్​ ఓ జట్టా. ఈ గేయాన్ని బంకా దయాళ్​ రచించారు. 

చంపారన్​ సత్యాగ్రహం: భారత రైతాంగ ఉద్యమాలన్నింటికంటే ఇది ఉన్నతమైంది. విశిష్టమైంది. ఇది చంపారన్​(బిహార్​) జిల్లాలో జరిగింది. బలవంతంగా నీలిమందు మొక్కలను సాగు చేయమనడం, తీన్​కతియా పద్ధతి విధింపు బలమైన కారణాలుగా ఉన్నాయి. తీన్​కతియా అంటే భూమిలో 3/20వ వంతు నీలిమందు మొక్కల సాగుకు రిజర్వ్​ చేయడం. 1917, ఏప్రిల్​ 10న ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమంలో జేబీ కృపాలాని, బాబు రాజేంద్రప్రసాద్, మహాదేవ్​ దేశాయ్​, మజహర్​ ఉల్​ హక్​లు పాల్గొన్నారు. రాజ్​కుమార్​ శుక్లా ఆహ్వానం మేరకు ఈ ఉద్యమంలో భాగంగా గాంధీ మొదటిసారి సూరత్​లో సత్యాగ్రహాన్ని పాటించారు. గాంధీని 
భారతదేశంలో మొదటిసారిగా 1817, ఏప్రిల్​ 18న విచారించారు. చివరికి తీన్​కతియా పద్ధతిని రద్దు చేశారు.
 
ఖేడా సత్యాగ్రహం: ఇది మొదటగా మోహన్​లాల్​ పాండ్య, మహాత్మా గాంధీల నాయకత్వంలో ఖేడా జిల్లా(గుజరాత్​)లో ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి ప్రధాన కారణం సగటు పంట దిగుబడి 25 శాతం కంటే తగ్గడం, ఇలా తగ్గితే రెవెన్యూ వసూలు చేయరాదని రెవెన్యూ రికార్డుల్లో  ఉన్నా దాన్ని బ్రిటీష్​ వారు పాటించకపోవడం. ఈ ఉద్యమంలో పాల్గొన్న ఇతర నాయకులు వల్లభాయ్​ పటేల్​, ఇందూలాల్​ యాగ్నిక్​. 

బార్దోలీ సత్యాగ్రహం: ఈ ఉద్యమాన్ని నో రెవెన్యూ క్యాంపెయిన్​ అని కూడా పిలుస్తారు. ఇది వల్లభాయ్​ పటేల్​, కున్వర్​జి మోహతా (పట్టేదార్​ యువక్​ మండల్​) నాయకత్వంలో బార్దోలీ(గుజరాత్​)లో జరిగింది. ఇందుకు భూమి శిస్తును పెంచడం(22శాతం) ప్రధాన కారణమైంది. దీనికోసం బ్రిటీష్​ వారు బ్రూమ్​ఫీల్డ్​, మాక్స్​వెల్​ కమిటీని నియమించగా, ఈ కమిటీ భూమిశిస్తును 5.7 శాతం మాత్రమే పెంచాలని సూచించింది. ఈ కమిటీ రిపోర్టు ప్రకారం శిస్తు పెంచడం అన్యాయం. 

ఉద్యమానికి కారణాలు 

శాశ్వత శిస్తు విధానం: ఈ విధానాన్ని బ్రిటీష్​ గవర్నర్​ జనరల్​ కారన్​ వాలీస్​ ప్రవేశపెట్టారు. శాశ్వత శిస్తు విధానం ప్రకారం నీటిపారుదల లేని భూమికి 50 శాతం శిస్తు, నీటిపారుదల ఉన్న భూమికి 60 శాతం శిస్తు చెల్లించాలి. జమీందారుల దోపిడీలో భాగంగా కౌలుదారులకు భూమిపైన ఎలాంటి హక్కు లేకపోగా వారిని భూమి నుంచి ఎప్పుడైనా తొలగించవచ్చు. 
రైత్వారీ విధానం: ఈ విధానంలో జమీందారులు లేని ప్రదేశంలో బ్రిటీష్​ వారే పెద్ద జమీందారులుగా వ్యవహరించారు. పంటలు పండకపోయినా శిస్తును మాత్రం పెంచుకుంటూ వెళ్లడమైంది.
వడ్డీ వ్యాపారుల దోపిడీ: వీరు అత్యధిక వడ్డీలు కొన్ని సందర్భాల్లో 500 శాతం వసూలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా దోపిడీకి గురయ్యారు.
నీలి మందు పంటల విధానం: బలవంతంగా రైతులను నీలిమందు పంటలను సాగుచేయమనడం. ఇది ఆహార ధాన్యాల లోటుకు దారి తీసి చాలా మంది రైతులు మృతిచెందారు.

మోప్లా తిరుగుబాటు

ఇది మాలబార్​ (కేరళ) ప్రాంతంలో హిందూ జమీందారుల(జెమ్మీ) భూస్వామ్య వ్యవస్థ, బ్రిటీష్​ ప్రభుత్వం వేధింపులు, దోపిడీలకు వ్యతిరేకంగా జరిగింది. ఈ ఉద్యమంలో భాగంగా మొదటి దశలో కాంగ్రెస్​ పార్టీ నాయకులైన గోపాల్​ మీనన్​, మహదేవ్​ నాయర్​, యాకూబ్​ కాన్​ల ఆధ్వర్యంలో జరగ్గా రెండో దశకు వచ్చేసరికి మోపిల్లా నాయకులైన అలీ ముసలియార్​, కాలాతింగల్ మహ్మద్​, కున్​ మహ్మద్​ హాజిల చేతుల్లోకి వెళ్లిపో యింది. మోపిల్లా అంటే సన్​ ఇన్​ లా అని అర్థం. వీరు పేద ముస్లిం సామాజిక వర్గానికి చెందినవారు. 

ఈ మోప్లా రైతులు వ్యవసా యంపైన, తీర ప్రాంతాల్లో చేపలు పట్టడంపైన ఆధారపడి జీవించేవారు. వ్యవసాయంపైన ఆధారపడి జీవించే ప్రాంతంలో మలబారు రైతాంగ ఉద్యమం తీవ్రస్థాయిలో సాగింది. మోప్లా రైతాంగానికి, హిందూ భూ యజమాని వర్గానికి మధ్య సంభవించిన  కలహాలను మద్రాస్​ ప్రభుత్వం మోప్లా తిరుగుబాటుగా వర్ణించింది. మోప్లా ఉద్యమం తిరిగి సంభవించకుండా ప్రభుత్వం మోప్లా అవుట్​రేజెస్​ చట్టం చేసింది. కానీ దీనిని 1930లో టెనెన్సీ లెజిస్లేషన్​ యాక్ట్​గా అమలు చేశారు.

తేబాగా ఛాయ్​ ఉద్యమం: తేభాగా ఛాయ్​ అంటే వీ వాంట్​ తేబాగా. బ్రిటీష్​ వారు మన దేశాన్ని విడిచి వెళ్లాక ముందు జరిగిన పోరాటాల్లో గిరిజనులు పాల్గొనక తేభాగా రైతాంగ పోరాటం అతి పెద్దది. ఇది బెంగాల్​ సంయుక్త రాష్ట్రాల్లోని ఠాకూర్​ గామ్​లో సుశీల్​సేన్​, చారుమజుందార్​, రామ్​లాల్​సింగ్​, రాజన్​సింగ్​ల నాయకత్వంలో జరిగింది. ఇందులో బెంగాల్​ కిసాన్​సభ ప్రముఖ పాత్ర పోషించింది. ఈ ఉద్యమ కాలంలో ఇంక్విలాబ్​ జిందాబాద్​ నినాదం ప్రముఖంగా వినిపించింది. ఈ ఉద్యమమే నక్సలైట్​ ఉద్యమానికి దారి తీసింది. 

కారణాలు: 1. 2/3 వంతు పంట భూస్వాములకు చెందడం.
2. జోతేదారులు భూమిపై సర్వహక్కులు కలిగి ఉండటం.
3. వడ్డీ వ్యాపారుల దోపిడీ. 
వర్లీ తిరుగుబాటు: మహారాష్ట్ర కోస్తా జిల్లా థానేలో ఎక్కువ సంఖ్యలో వర్లీలు నివసిస్తారు. ఇందులో సీపీఐ, కిసాన్​సభ, ఆదివాసీ సేవా మండల్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణాలుగా భూస్వాముల దోపిడీ, వడ్డీ వ్యాపారుల దోపిడీ, అటవీ కాంట్రాక్టర్ల దమన నీతిని పేర్కొనవచ్చు.