వరద సాయంలో ఓట్ల రాజకీయం

వరద సాయంలో ఓట్ల రాజకీయం

అనుకోని విపత్తులు వచ్చిపడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద దిక్కుగా ఉండాలి. ప్రజల కష్టాలను తీర్చేందుకు అండగా నిలబడాలి. పక్కా ప్రణాళికతో సహాయ కార్యక్రమాలు చేపట్టాలి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం దీనికి పూర్తి విరుద్ధంగా నడుస్తోంది. హైదరాబాద్ లో భారీ వర్షాలు, వరదలు వచ్చిన సమయంలో ముందుగా ప్రజలను అప్రమత్తం చేయడంలో ఫెయిల్  అయింది. సహాయ చర్యల్లోనూ నిర్లక్ష్యం వహించింది. నష్ట పరిహారం అందించడంలో రాజకీయాలు చేసిన ఘనత టీఆర్ఎస్ సర్కారుదే. ఎన్నికలు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో ఒక తీరుగా, జిల్లాల్లో పంట పొలాలు దెబ్బతిన్న రైతన్న  విషయంలో మరో తీరుగా పని చేస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఓట్ల కోసం చూసుకోకుండా కష్ట సమయంలో అందరినీ సమానంగా ఆదుకోవాలి. సిటీలో వరదలతో ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరితో పాటూ పంట నష్ట పోయిన ప్రతి రైతుకు పూర్తి పరిహారం ఇవ్వాలి. వర్షాలకు తడిచి న పంటలను ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనాలి.

కోటి ఆశలతో కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రం.. నేడు దాచి దాచి దొంగల పాలుజేసినట్లైంది. రాష్ట్రంలో ఎటుచూసినా అవినీతి, దోపిడీ సాగుతోంది. వనరులు, సంపదను వారసత్వ పాలనలో బంధించే దిశగా పోతోంది. బడుగులను అణచివేస్తూ మన ముఖ్యమంత్రి దొరల పాలన చేస్తున్నారు.ఆఖరికి విపత్తులు ఎదురైన సమయాల్లోనూ ప్రజలను ఆదుకునే విషయంలోనూ అవినీతికే ప్రయారిటీ ఇచ్చిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. దాదాపు వందేండ్ల తర్వాత రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్, తెలంగాణలోని కొన్ని జిల్లాలు అతలాకుతలమైపోయాయి.  ఆ సమయంలో సహాయ చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అంతే కాదు కనీసం వరద సహాయంగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని.. వరద బాధితులు, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలోనూ ఫెయిల్ అయింది.

వరద సాయం కనీసం రూ.లక్ష ఇవ్వాలి

ప్రకృతి వైపరీత్యాల సమయంలో మానవత్వంతో అన్ని సహాయక చర్యలకు ఉదారంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఇందుకోసం 2015లో జీవో నెంబర్ 2ను జారీ చేసింది. ప్రభుత్వ యంత్రాంగమంతా ఏకమై బాధ్యతతో చేసిన ప్రతి పనికీ అయిన ఖర్చును రీ యింబర్స్ చేసే సౌలభ్యం ఆ జీవోలో ఉంది. ఆ జీవో ప్రకారం వరదల కారణంగా మృతి చెందిన వారికి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు తక్షణ చెల్లింపు చేసి రీ యింబర్సు చేసుకోవచ్చు. అలాగే తక్షణ అవసరాలైన తిండి, బట్ట, నీరు, ముంపు తొలగించే చర్యలతో పాటు అన్ని అత్యవసరాలు తీర్చి ఆ మొత్తాన్ని రీ యింబర్స్ చేసుకొనే అవకాశం ఉంది. ప్రతి వరద బాధితునికి రూ.లక్ష చెల్లించే సౌలభ్యం ఉన్నా పది వేలు కూడా తక్షణ సాయంగా ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రాలేదు. ఈ పది వేలను కూడా గ్రేటర్ ఎన్నికల కోసం ఉపయోగించుకునే చవకబారు రాజకీయం అధికార పార్టీ చేస్తోంది.

ప్రభుత్వానికి ప్రణాళిక లేక రైతులకు నష్టం

ప్రభుత్వం సొంత పైత్యంతో మిల్లర్లకు ఉపయోగపడేలా వ్యవసాయ విధానం రూపొందించి.. రైతుబంధు రాదనే బేదిరింపులకు పాల్పడి రైతులతో సన్న బియ్యం తదితర పంటలు వేయించింది. అయితే అకాల వర్షాల వల్ల 90 లక్షల ఎకరాలు మునిగిపోతే ఇంతవరకు తగిన పరిహారం ప్రకటించకపోవటం దుర్మార్గం. కేంద్రం ఇచ్చిన జీవో ప్రకారం.. ఎకరాకు రూ.15 వేల సాయం చేసే చాన్స్ ఉన్నా పట్టించుకోలేదు. అలాగే పౌల్ట్రీలు, గొర్రెలు, మేకలు, మత్స్యసంపద వంటి వాటి నష్టానికి కూడా రూ.30 వేలు ఇచ్చి పూర్తి రీ యింబర్స్​ మెంట్​ కు అవకాశం ఉన్నా వాడుకోలేదు. కేంద్ర విపత్తుల శాఖ నుంచి సహాయంగా వేలాది కోట్లను తీసుకునే వీలున్నా.. సరైన కార్యాచరణ ప్రణాళిక లేకపోవడంతో ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేంద్ర సాయం ద్వారా ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను గట్టెక్కించే అవకాశంపై అవగాహన లేక కాదు.. ప్రజల కష్టాలను తీర్చేందుకు మనసు రాకే ఈ పరిస్థితి ఏర్పడింది.

ఆక్రమణల తొలగింపులో జాగు వరద నియంత్రణ చర్యల్లో వైఫల్యం విషయానికి వస్తే 2016 లోనే ఇప్పటి పరిస్థితికి సంకేతమిచ్చే భారీ వర్షాలు, వరద, ముంపు ట్రైలర్ ను రాష్ట్ర ప్రభుత్వం చూసింది. దాని పూర్తి స్థాయి విస్తరణే నేటి దుస్థితికి కారణం. చెరువుల విస్తరణ, నీటి నిర్వహణలో ఆటంకాల తొలగింపు, నాలాలపై ఆక్రమణలు, కబ్జాల తొలగింపు ద్వారా ఈ దుస్థితిని నివారించే అవకాశమున్నా, అందుకు నిపుణుల కమిటీలు నివేదికలిచ్చినా తమ వారి ప్రయోజనాలు దెబ్బతింటాయనే దురుద్దేశంతో రాష్ట్ర సర్కారు పెడచెవిన పెట్టింది. కరోనా లాక్ డౌన్ సమయంలో పేద, మధ్య తరగతి వర్గాలు ఆదాయం కోల్పోయి ప్రాణ భయంతో ఉన్న దయనీయ స్థితిలో సహాయం చేయాల్సిన ప్రాథమిక విధి ప్రభుత్వానిది. కానీ అందుకు విరుద్ధముగా జనంపై మరింత భారం వేసే ఆలోచనలు చేసింది కేసీఆర్ సర్కారు. ఉన్నసమస్యలను తీర్చాల్సింది పోయి.. రెవెన్యూ సంస్కరణల పేరుతో భూములు, ఆస్తి వివాదాలను పెంచే తీరుగ చర్యలు చేపట్టింది. -ఎర్ర సత్యనారాయణ, అధ్యక్షుడు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం.