దొంతిలో ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించిన రైతులు
అలైన్మెంట్ మార్పుపై ఆగ్రహం
తూప్రాన్ - నర్సాపూర్ రోడ్డుపై ముళ్ల కంచెలు వేసి ఆందోళన
రైతుపై ఎస్ఐ చేయి చేసుకున్నాడని నిరసన
నచ్చజెప్పినా వినకపోవడంతో వెనుదిరిగిన అధికారులు
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్)పై మెదక్ జిల్లా దొంతిలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. శివ్వంపేట, నర్సాపూర్, తూప్రాన్ మండలాల నుంచి తరలివచ్చిన రైతులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ట్రిపుల్ ఆర్తో విలువైన భూములు పోతున్నాయని, అధికార పార్టీ నేతలకు మేలు చేసేందుకు కావాలనే రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెదక్ (శివ్వంపేట), వెలుగు : రీజినల్ రింగ్‌రోడ్డు (ట్రిపుల్ ఆర్)కు సంబంధించి పొల్యూషన్కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. అలైన్మెంట్మార్పుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఈ కార్యక్రమాన్నిఅడ్డుకున్నారు. రింగ్‌రోడ్డు వద్దంటూ రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు వేసి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై మండిపడ్డారు. రైతుల ఆందోళనతో దాదాపు మూడు గంటల పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అడుగడుగునా అడ్డంకులు ఎదురుకావడంతో అధికారులు అర్ధంతరంగా కార్యక్రమాన్ని ముగించి వెనుదిరిగారు.
రోడ్డుపై ట్రిపుల్ ఆర్ ఫ్లెక్సీల దహనం
రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి మెదక్ అడిషనల్కలెక్టర్రమేశ్ఆధ్వర్యంలో శుక్రవారం శివ్వంపేట మండలం దొంతిలోని ఓ ప్రైవేట్కన్వెన్షన్సెంటర్లో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు. రెవెన్యూతోపాటు, పొల్యూషన్కంట్రోల్బోర్డు అధికారులు, ఆర్ఆర్ఆర్ప్రతినిధులు హాజరయ్యారు. శివ్వంపేట, నర్సాపూర్, తూప్రాన్ మండలాల నుంచి తరలివచ్చిన రైతులు ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారు. ట్రిపుల్ఆర్తో తమ విలువైన భూములు పోతున్నాయని, కొన్నిచోట్ల అధికార పార్టీ వారికి మేలు చేసేందుకు కావాలనే రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా ఎందుకు మార్చారో కారణం చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. అయితే వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సమావేశాన్ని బహిష్కరించి తూప్రాన్ –నర్సాపూర్ రోడ్డుపై ముళ్ల కంచెలు అడ్డుగా వేసి రాస్తారోకో చేశారు. ట్రిపుల్ఆర్ కు సంబంధించిన ఫ్లెక్సీలను దహనం చేసి నిరసన తెలిపారు.
ఎకరానికి 80 లక్షలు ఇవ్వాల్సిందే
రైతులు మాట్లాడుతూ భూమికి భూమి ఇస్తేనే తమ భూములు అప్పగిస్తామని, లేకపోతే ప్రస్తుత మార్కెట్వ్యాల్యూ ప్రకారం ఎకరాకు రూ.70 - నుంచి 80 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్అక్కడికి వచ్చి రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఫంక్షన్హాల్లో మీటింగ్ పెట్టకుండా రీజినల్రింగ్రోడ్డు వెళ్లే గ్రామాలకు వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్నారు. పోలీసుల ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నం చేయగా రైతులు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఆందోళనలో పాల్గొన్న కొంతన్‌పల్లికి చెందిన రైతు పెద్ది వెంకటేశ్‌పై ఓ ఎస్ఐ చేయిచేసుకున్నాడంటూ రైతులు పోలీసులకు ఎదురు తిరిగారు. దీంతో సదరు ఎస్ఐ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాదాపు మూడు గంటల పాటు రైతులు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన కొనసాగించారు. అధికారులు, పోలీసులు ఎంత నచ్చ జెప్పినా వినిపించుకోకపోవడంతో అడిషనల్ కలెక్టర్ రమేశ్ మీటింగ్ నుంచి వెళ్లిపోయారు.
ఉన్నభూమి పోతే ఎట్ల బతకాలె
మాకు రెండెకరాల భూమి ఉంది. దాని మీదే మా బతుకుదెరువు. ఉన్న భూమి రోడ్డుకు తీసుకుంటే మేం ఎట్లా బతకాలి? పైసలు ఇచ్చే బదులు భూమికి బదులు భూమి అయినా ఇవ్వాలి.
- కమలమ్మ, రైతు, రత్నాపూర్
ప్రాణం పోయినా భూమి ఇయ్యం
ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి లేనోళ్లకు భూమి ఇస్తమని చెప్పిండు. కానీ ఇప్పుడేమో పేద రైతుల నుంచి భూమి గుంజుకునుడేంది? మాకు నాలుగెకరాలు ఉంది. అంతా రింగ్ రోడ్డులో పోతదంట. ఆ పొలం పోయినంక మేం బతికేం లాభం. ప్రాణం పోయినా సరే భూమి ఇచ్చేది లేదు.
- యాదమ్మ, రైతు, పాంబండ