- వెల్లివిరిసిన ఓటరు చైతన్యం
- అత్యధికంగా బోథ్‌లో 74.08 శాతం ఓటింగ్..
- పలుచోట్ల చెదురుమదురు ఘటనలు
- మొరాయించిన ఈవీఎంలు
నెట్వర్క్, వెలుగు : ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీ స్థానాల కోసం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. ఓటేసేందుకు ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి బారులు తీరారు. పోలింగ్ ప్రారంభమైన గంటగంటకూ ఓటర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉదయం 09 గంటలకు 13.22 శాతం, 11 గంటలకు 31.51 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 50.18 శాతం, 3 గంటలకు 62.44, సాయంత్రం 69.81 శాతం పోలింగ్ నమోదైంది.
ఓటింగ్ సరళిని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కంట్రోల్ రూం నుంచి సాధారణ ఎన్నికల పరిశీలకుడు రాజేంద్ర విజయ్, ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా ఎప్పటికప్పుడు పరిశీలించారు. అనంతరం పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్, ఎస్పీ గౌస్ ఆలం తనిఖీలు చేశారు. స్థానిక డైట్ కాలేజీలో కలెక్టర్, ఎస్పీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈవీఏంల మొరాయింపు..
ఆదిలాబాద్ పట్టణంలోని షాదిఖానా, బాలక్ మందిర్ లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంలు మొరాయించాయి. తాంసి మండల కేంద్రంలోని 41 కేంద్రంలో ఉదయం ఈవీఏం మొరాయించడంతో పోలింగ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. భీంపూర్ మండలంలోని అందర్ బందు గ్రామంలో పోలింగ్ విధుల్లో ఉన్న టీచర్ ప్రపుల్ రెడ్డి ఆదివారం రాత్రి బహిర్భూమికి వెళ్లే క్రమంలో పాముకాటుకు గురయ్యారు. ఆయనను రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు.
ఆసిఫాబాద్‌లో 4 గంటల వరకే..
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓటేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. చాలా పోలింగ్ కేంద్రాల వద్ద గంట నుండి రెండు గంటల పాటు ఓపికతో నిలబడ్డారు. ఎండల తీవ్రత దృష్ట్యా టెంట్లు వేయడం, నీళ్లు, మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరిగింది. జిల్లాలో 67.67 శాతం పోలింగ్ జరిగింది. పలు పోలింగ్ కేంద్రాలకు 4 గంటల తర్వాత వచ్చిన ఓటర్లు ఓటు వేయకుండా తిరిగి వెళ్లిపోయారు.
మంచిర్యాల జిల్లాలో..
పార్లమెంట్ఎన్నికల పోలింగ్ మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడంతో జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. మందకొడిగా ప్రారంభమైన పోలింగ్మధ్యాహ్నం స్పీడ్ అందుకుంది. ఎండవేడిమి అంతగా లేకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. నస్పూర్ మండలంలోని రెండు బూత్‌లలో ఈవీఎంలు పది నిమిషాల పాటు మొరాయించాయి.
పలుచోట్ల నిర్ణీత సమయానికి ఐదు నిమిషాలు ముందే పోలింగ్‌కేంద్రాలను సిబ్బంది మూసివేశారు. జైపూర్ మండల కేంద్రంలోని 96 పోలింగ్స్టేషన్లో నిర్ణీత సమయంలో వెళ్లినప్పటికీ పోలింగ్ సిబ్బంది తమకు ఓటువేసే అవకాశం కల్పించలేదని పలువురు ఆందోళన చేశారు. ఐదు నిమిషాలు ముందే పోలింగ్‌కేంద్రాన్ని మూసివేశారని కాంగ్రెస్ లీడర్లు పోలింగ్సిబ్బందిపై మండిపడ్డారు.
సాయంత్రం 5 గంటల వరకు పోలైన ఓటింగ్
పెద్దపల్లి సెగ్మెంట్ ఓటింగ్ శాతం
చెన్నూర్ 68.13
బెల్లంపల్లి 70.53
మంచిర్యాల 59.78
ఆదిలాబాద్ సెగ్మెంట్
సిర్పూర్ 68.14
ఆసిఫాబాద్ 67.21
ఆదిలాబాద్ 69.82
బోథ్ 74.08
నిర్మల్ 69.03
ఖానాపూర్ 67.02
ముథోల్ 72.73