మూసీ ప్రక్షాళన ఎన్నడు?

మూసీ నది కాలుష్యంతో  ఆరోగ్యాలపై తీవ్ర  ప్రభావం పడుతుంది. ఈ నది పైకి ఆహ్లాదం, లోన   కాలకూట  విషంగా మారింది. అనంతగిరి కొండ కోనల్లో పురుడు పోసుకుని వందల కిలోమీటర్ల వరకు జీవ జలాన్ని అందించింది మూసీ.   మానవ తప్పిదాలు,  స్వార్ధ ప్రయోజనాలు , తాత్కాలిక అవసరాల కోసం సహజ వనరులను ధ్వంసం చేస్తుండడంతో నేడు కాలుష్య కాసారమై దేశంలోనే అత్యంత ప్రమాదకర నదుల సరసన చేరింది. పరిశ్రమల వ్యర్థ విషపూరిత రసాయనాలు , హాస్పిటళ్ల వ్యర్థాలు, డ్రైనేజీ మురుగు నీరు , చివరికి చెత్తాచెదారాలు. మాంస వ్యర్థాలు , జంతు కళేబరాలు ఒక్కటేమిటి సర్వం ఇందులోకి డంపింగ్ చేసేస్తున్నారు. ఎంతో సుందరమైన నది ఈనాడు తన పూర్వ ప్రాభవం కోల్పోయి ఘోషిస్తోంది. 

వ్యవసాయమూ కాలుష్యమైంది.

ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో పరవళ్లు తొక్కి పచ్చని పంటలతో , జలచరాలతో ,  స్వచ్ఛమైన గాలి ,  వాతావరణంలో  కళకళలాడిన  మూసీ  నది  పరివాహక ప్రాంతాలు  నేడు శవాకారాలు  అవుతున్నాయి. ఆనాడు ఈ నీటితో చక్కటి పాడి పంటలతో పాటు అందులో చేపలు , ఎండ్రికాయలు, రొయ్యలతో సమృద్ధిగా విలసిల్లాయి . అయితే  అది  గతం,  ప్రస్తుతం  దీని  పరీవాహక గ్రామాల్లో ఇప్పుడు   ముక్కుపుటలదిరే  దుర్గంధం, దుర్వాసనలు. ఈ ప్రాంతాల్లో నేడు కాలుష్యపు  నీటి కారణంగా  వరి  పంట  దిగుబడి  తగ్గిపోయింది.  ఆ పండిన పంట  సైతం  రంగు మారి , తాలు రూపంలో బరువు తక్కువగా పండుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం   చేస్తున్నారు .  ఇక్కడ   పండించిన  వరి  పంటకు  సైతం  సరియైన  గిట్టుబాటు ధర లభించడం  లేదు .  ఈ  కారణంగా  ఇక్కడ  బడా  భూస్వాములంతా  పశుగ్రాసం  కోసం  వాడే   పచ్చి గడ్డి సాగుకు , గడ్డి వ్యాపారులకు అప్పగించి సాగు చేయిస్తున్నారు.  పరీవాహక   ప్రాంతాల    ప్రజల    జీవనం , ఆరోగ్యం ప్రమాదంలోకి నెట్టబడుతోంది.  ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోందని పర్యావరణ వేత్తలు, పరిశోధకులు, వైద్య నిపుణులు ఘోషిస్తున్నారు. మూసీ   నీటిలో  3 తుల్యమైన   పలు  రకాల   రసాయన పదార్థాలు   ఉన్నట్టు  శాస్త్రవేత్తలు   పేర్కొంటున్నారు.  ఆరోగ్యానికి హాని కలిగించే విష రసాయనాల వల్ల జ్ఞాపక శక్తి సైతం తగ్గిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు యుద్ధ ప్రాతిపదికన నడుం బిగిస్తేనే రాబోయే తరాలకు మేలు చేసినవారమవుతారని, లేదంటే భవిష్యత్తుతరాలకు అన్యాయం చేసినవారవుతారని హెచ్చరిస్తున్నారు. 

పూర్వ వైభవం సాధ్యమేనా ? 

మూసీ   నదికి  పునర్​ వైభవం   వస్తుందా ?  రాష్ట్ర    సర్కారు   మూసీ నది శుద్ధికి ప్రయత్నాలు చేస్తూన్నా, ఫలితం కనిపించలేదు.  వ్యర్థాలలో అధిక శాతం విషపూరిత రసాయనాలు ఉండటంతో వీటిని శుద్ధి చేయడం ఎంత వరకు సఫలీకృతమవుతుందనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కాలకూట విషంలా మారి మానవాళి మనుగడకే ప్రమాదంగా  పరిణమించిన మూసీ నదిని సమూలంగా ప్రక్షాళన చేయాలి. ఇందుకోసం ఎంత వ్యయమైనా వెనకడుగువెయ్యకూడదు. ఘాడమైన విష రసాయనాలతో కూడిన పారిశ్రామిక వ్యర్థాలు కలపకుండా ఇతరత్రా వ్యర్థాలు సైతం డంపింగ్ చేయకుండా కఠినమైన , పకడ్బందీ చట్టం తీసుకురావాలి.  మూసీ ప్రక్షాళన విషయంలో ప్రకటనలతోనే సరిపెట్టకుండా చిత్తశుద్ధితో శాశ్వత చర్యలకు పూనుకోవాలి.  అధునాతన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ ) ఏర్పాటు విషయంపై దృష్టి సారించాలి . అభివృద్ధి చెందిన దేశాల్లో వాడుతున్న పరిజ్ఞానాన్ని పరిశీలించాలి . రాష్ట్ర హైకోర్టు ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినా, మూసీ ప్రక్షాళన, సుందరీకరణ జరుగుతున్నది మాత్రం లేదు. 

దోమలకు ఆలవాలం ..

మూసీ పరీవాహక ప్రాంతాలు దోమలకు అడ్డాగా పేరు. పగలంతా గడ్డి పొలాల్లో మకాం వేసి పొద్దుగూకే వేళకు జనావాసాల్లోకి చేరి కాటు వేయడం పరిపాటి. అనారోగ్యాలు అంతకన్నా పరిపాటి. దోమల నివారణకు ఫాగింగ్ చేయాల్సి ఉన్నా ఆయా గ్రామ  పంచాయతీలు   నిధుల   లేమితో   ఏమీ   చేయలేకపోతున్నాయి.   మూసీ   నది   కాలుష్యంతో జల జీవాలు   దాదాపు అంతరించిపోగా పశు సంపద కూడా క్రమేపీ కనుమరుగవుతోంది. ఈ నీళ్లు   తాగిన   పశువులు   సూడి   నిలవక వట్టి పోతున్నాయి. ఈ పశువులను సాకలేక పాడిరైతులు దళారులకు తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. 

– జె. హనుము, రీసెర్చ్  స్కాలర్, ఉస్మానియా  యూనివర్సిటీ