- వరంగల్‌లో ముందుకు సాగని సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల పనులు
- రెండేళ్లు దాటినా సగం కూడా పూర్తి కాని ఉర్సుగుట్ట, ప్రగతినగర్ ఎస్‌టీపీ
- రెడ్డిపురం ప్లాంట్‌కు దొరకని స్థలం
- కాలుష్య కాసారాలుగా ఓరుగల్లు చెరువులు
హనుమకొండ, వెలుగు: ఓరుగల్లు చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు కాలుష్య కాసారాలుగా మారుతున్నారు. నగరంలో మురుగు కాల్వలు, నాలాల నుంచి వస్తున్న నీళ్లను శుద్ధి చేసేందుకు సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టీపీ) ఏర్పాటు పనులు ముందుకు సాగడం లేదు. గ్రేటర్ సిటీలో మూడు చోట్ల ఎస్‌టీపీలు నిర్మించాలని ప్రతిపాదించి రెండేళ్లు అవుతున్నా అవి అందుబాటులోకి రావడం లేదు. దీంతో మురుగు నీళ్లన్నీ డైరెక్ట్‌గా చెరువుల్లో కలుస్తుండడంతో అవి కలుషితం అవుతున్నాయి.
శుద్ధి చేయకుండానే చెరువుల్లోకి..
గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 డివిజన్లలో సుమారు 2.25 లక్షల ఇండ్లు, 11 లక్షల జనాభా ఉంది. సిటీలో 1,450 వరకు కాలనీలు ఉండగా, నగరం మొత్తంలో 53.3 కిలోమీటర్ల ప్రధాన నాలాలు, 1,433.02 కిలోమీటర్ల డ్రైన్లు, 151 కిలోమీటర్ల ఒక మీటర్ నాలాలు, 882.21 కిలోమీటర్ల మేర పక్కా డ్రైన్లు, 344.27 కిలోమీటర్ల మేర కచ్చా డ్రైన్లు ఉన్నాయి. ఇండ్ల నుంచి నిత్యం కొన్ని లక్షల లీటర్ల నీళ్లు బయటకు వస్తున్నాయి. ఈ నీళ్లను సీవరేజీ ప్లాంట్‌కు తరలించి, శుద్ధి చేసిన తర్వాత చెరువుల్లోకి వదలడమో లేక మొక్కలు, చెట్లకు తరలించడమో చేయాలి. కానీ వరంగల్‌లో సీవరేజీ ప్లాంట్లు లేకపోవడంతో నీళ్లను నేరుగా చెరువుల్లోకి మళ్లిస్తున్నారు. ఇప్పటికే గుర్రపుడెక్క, ఇతర చెత్తాచెదారంతో కలుషితం అయిన నీళ్లు మురుగుతో మరింత కంపు కొడుతున్నాయి.
ముందుకు కదలని ఎస్‌టీపీలు
స్మార్ట్‌సిటీ పథకానికి వరంగల్ ఎంపికైన తర్వాత ఇక్కడ మురుగునీటిని శుద్ధి చేసేందుకు ఎస్‌టీపీలు నిర్మించాలని ఆఫీసర్లు ప్రపోజల్స్ రెడీ చేశారు. స్మార్ట్ సిటీ ఫండ్స్‌తో వీటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదట ప్రయోగాత్మకంగా రూ.2.7 కోట్లతో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో మినీ ఎస్‌టీపీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అది హాస్పిటల్ అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. దీంతో రూ.262.5 కోట్లతో ఒకే ప్యాకేజ్ కింద నగరంలో మరో మూడు చోట్ల ఎస్‌టీపీలను నిర్ణయించేందుకు ప్లాన్ చేశారు. ఇందులో ఉర్సు గుట్ట వద్ద 5 ఎంఎల్‌డీ, ప్రగతినగర్ వద్ద 15 ఎంఎల్‌డీ కెపాసిటీతో ఎస్‌టీపీల నిర్మాణ పనులను రెండేండ్ల కింద స్టార్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే వాటి పనులు కంప్లీట్ కావాల్సి ఉండగా ఇప్పటివరకు సగం కూడా పూర్తి కాలేదు. ఇక రెడ్డిపురం వద్ద 100 ఎంఎల్‌డీ కెపాసిటీతో ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించగా స్థల సేకరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెడ్డిపురం శివారులో సరిపడా ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ, కొన్ని రాజకీయ కారణాలతో ప్రైవేట్ స్థలం సేకరించేందుకు ఏడాదిన్నర కింద నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ప్లాంట్ నిర్మాణానికి 14.26 ఎకరాలు సేకరించే ప్రయత్నించగా భూ యజమానులు అడ్డుకున్నారు. తమ సాగు భూముల్లో కాకుండా ప్రభుత్వ స్థలంలో ఎస్‌టీపీని ఏర్పాటు చేయాలంటూ రిలే నిరాహార దీక్షలకు దిగారు. దీంతో ఆ ప్రక్రియకు కాస్త బ్రేక్ పడింది.
డేంజర్ జోన్‌లో చెరువులు
గ్రేటర్ వరంగల్ పరిధిలో సుమారు 135 చెరువులు ఉన్నట్లు ఇరిగేషన్ ఆఫీసర్లు చెబుతున్నారు. నగరంలో డ్రైన్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీటిని ఎక్కడికక్కడ సమీపంలోని చెరువులు, కుంటల్లోకి వదులుతున్నారు. తోళ్ల ఖార్ఖానా నుంచి కెమికల్స్, వృథా నీటితో దేశాయిపేట సాయిచెరువు పూర్తిగా కలుషితం అయింది. ఒకప్పుడు తాగునీటికి ఉపయోగపడిన భద్రకాళి చెరువు కూడా హంటర్ రోడ్డు, జూపార్క్పైఏరియా నుంచి వచ్చే మురుగునీటితో నిండి పోతోంది. దీంతో పాటు సిటీలోని డ్రైనేజీ, వరద నీళ్లన్నీ హసన్‌పర్తి మండలం నాగారం చెరువులోకి చేరుతుండడంతో ఆ చెరువు కూడాడేంజర్ జోన్‌లో పడింది. ఆఫీసర్లు స్పందించి ఎస్‌టీపీలు పూర్తి చేసి చెరువులను కాలుష్యం బారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.