మహబూబ్‌నగర్, వెలుగు: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పోలేపల్లి సెజ్‌లో 40 పరిశ్రమలు ఉండగా, అందులో 25 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఈ సెజ్ పరిధిలో పోలేపల్లి గ్రామం వద్ద రంగమ్మకుంట, గుండ్లగడ్డ తండా వద్ద అవుసులవారి చెరువు(గండి కుంట), కుమ్మరికుంట, ముదిరెడ్డిపల్లి వద్ద పల్లె చెరువు, రాయపల్లి వద్ద పెద్దకుంట, చిన్నకుంట ఉన్నాయి. రూల్‌ప్రకారం ఫార్మా కంపెనీలు వ్యర్థ జలాలను ఈపీటీ ప్లాంట్ద్వారా రీసైకిల్ చేయాలి. కానీ, ఇది ఖర్చుతో కూడుకున్నది కావడంతో కంపెనీలు వ్యర్థ జలాలను పైపులైన్ ద్వారా బయటకు వదులుతున్నాయి. బయటకు వదిలిన నీరు కుంటల్లోకి చేరేలా పిల్ల కాల్వలను తీసి.. ఒక కుంట నిండాక దానికి గండి కొట్టి మరో కుంటకు కాల్వను తీసి లింక్ కలుపుతున్నారు. ప్రస్తుతం సెజ్ పరిధిలో ఉన్న కుంటలు మొత్తం పూర్తిగా వ్యర్థ జలాలతో నిండిపోయి కలుషితం అయ్యాయి.
నీళ్లల్లో తడిస్తే.. గోకుడే
గుండ్లగడ్డ తండాకు చెందిన ప్రజలు కుమ్మరికుంట, అసువులవారి చెరువు మధ్యలో తవ్విన కాల్వను దాటుకొని తండాలోకి వెళ్లాలి. ఈ కాల్వను దాటుతున్నప్పుడు కాళ్లు తడుస్తుండటంతో మోకాళ్ల వరకు ప్రజలకు స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తోంది. కాళ్లకు ఉన్న వెంట్రుకలు రాలిపోతున్నాయి. ఈ నీళ్లతో స్నానాలు చేస్తున్నవారికి ముఖాలు కందిపోయినట్లు అవుతోంది. తల స్నానం చేస్తే వెంట్రుకలు రాలిపోతున్నాయి. నీళ్లల్లో తడిస్తే కనీసం నాలుగు గంటల వరకు దురద తగ్గడం లేదని బాధితులు చెబుతున్నారు. దురద ఉందని జడ్చర్ల సర్కారు దవాఖానాకు పోతే, అక్కడ దీనికి సంబంధించిన మందులు లేవని పంపిస్తున్నారని తండావాసులు చెబుతున్నారు. చేసేది లేక ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చూపించుకుంటున్నామని, ఒకసారి ప్రైవేట్‌కు పోయి రావాలంటే మందులతో కలిపి రూ.3 వేలు అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎక్కడ?
వ్యర్థ జలాలతో నీళ్లు కలుషితం అవుతున్నాయని బాధిత రైతులు, మత్స్యకారులు, ప్రజలు కంప్లైంట్ చేస్తున్నా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్లు లైట్‌గా తీసుకుంటున్నారు. గత సోమవారం పల్లె చెరువులో వాటర్ శాంపిల్స్ సేకరణకు ఆఫీసర్లు కాకుండా సిబ్బంది రావడంతో మత్స్యకారులు, గ్రామస్థులు అడ్డుకొని తిప్పి పంపించారు. రెండు రోజుల తర్వాత ఆఫీసర్లు వచ్చి శాంపిల్స్ తీసుకెళ్లారు. రైతులు, ప్రజలు ఆందోళన చేసిన ప్రతిసారి ఇలా శాంపిల్స్ తీసుకుపోతున్నారే తప్ప రిపోర్టును బయటపెట్టడం లేదు.
ఈయన రఘునందన్‌చారి. మూడెకరాలు ఉండగా ఈ ఏడాది రూ.లక్ష పెట్టుబడి పెట్టి వరి సాగు చేశాడు. అవుసులవారి చెరువు తూము నుంచి ఈయన పొలంలోకి వ్యర్థ జలాలు రావడంతో పంటపై ప్రభావం పడింది. వరి కంకులు ఏర్పడినా తాలే మిగిలింది. కేవలం 30 శాతం మాత్రమే దిగుబడి రావడంతో పంటను వదిలేశాడు.
పంటలు ఖరాబ్.. చనిపోతున్న చేపలు
గుండ్లగడ్డతండా వద్ద ఉన్న అవుసులవారి చెరువు కింద 400 ఎకరాల ఆయకట్టు ఉంది. వానానాలం సీజన్లో వరి సాగు చేస్తుంటారు. ప్రస్తుతం ఈ చెరువులోకి ఫార్మా కంపెనీల వ్యర్థాలు చేరడంతో నీళ్లు రంగు మారాయి. ఇవే నీళ్లు పొలాల్లోకి వెళ్తుండటంతో పంటలు పండట్లేదు. మొక్కలకు బలం కోసం పొటాష్ వాడుతున్నా లాభం ఉండట్లేదు. చాలాచోట్ల మొక్కలు నాటినా రెండు వారాలకే చనిపోతున్నాయి. ఒకవేళ బతికినా మొక్కలపై నల్ల మచ్చలు ఏర్పడుతున్నాయి. కొన్ని చోట్ల వరి కంకులు ఏర్పడినా గింజ పట్టలేదు. తాలే మిగులుతోంది. ప్రస్తుతం చేతికొచ్చిన పంటను కొద్దామంటే పొలాల్లో వ్యర్థ జలాలు ఉండటం వల్ల చర్మవ్యాధులు వస్తున్నాయని చెబుతూ కూలీలు పనులకు రావడం లేదు. వరి కోత మెషిన్లు తెప్పించినా పొలాల్లోకి నీళ్లు వస్తుండటంతో బురదలో ఇరుక్కుపోతున్నాయి. దీంతో చాలామంది రైతులు వరి పొలాలు కోయకుండా వదిలేశారు. వ్యర్థ జలాలు చెరువుల్లోకి చేరుతుండటంతో చేపలు చనిపోతున్నాయి. చెరువులను గుత్తకు పట్టుకున్న మత్సకారులు చనిపోయిన చేపలను చూసి తండ్లాడుతున్నారు.
చేపలు చనిపోతున్నయ్
పల్లె చెరువును రూ.2.6 లక్షలకు గుత్తకు పట్టుకున్న. ఈ చెరువును నమ్ముకొని వంద మత్స్యకారుల కుటుంబాలు జీవిస్తున్నాయి. రెండు నెలల కిందట గవర్నమెంట్ సబ్సిడీ కింద చెరువులో 18 వేలు సంఘం నుంచి మరో 40 వేల చేప పిల్లలు వదిలినం. ఈ టైం వరకు చేపలు కిలో నుంచి కిలోన్నర సైజు పెరగాలె. రెండు నెలలైనా 50 గ్రాములు కూడా పెరుగుతలేవు. రోజూ 15 నుంచి 20 చేపలు చనిపోతున్నాయి. – కృష్ణయ్య, మత్సకారుడు, ముదిరెడ్డిపల్లి