- ఎమ్మెల్యే వనమా హామీ గాలికి..
- కలెక్టర్ భరోసాపై ఆశ వదులుకున్న బాధితులు
- ఇప్పటికీ స్థలాల జాడ కూడా లేదాయే
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు;పేదల గూడు చెదిరి రెండేండ్లు గడిచాయి. అయినా వారి గోసపై ప్రజాప్రతినిధులతోపాటు ఆఫీసర్లకు కనికరం లేకుండా పోయింది. న్యాయం చేస్తామన్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హామీ గాలిపోయింది. కలెక్టర్ ఇచ్చిన భరోసాపై కూడా ఆశ సచ్చిపోయింది. ఎవరిని నమ్మాలో తెలియక కొత్తగూడెం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌పరిధిలోని తుమ్మల నగర్ వాసులు కన్నీరు పెట్టుకుంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ రెండేళ్లుగా బాధితులు ఎమ్మెల్యే, కలెక్టర్చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. దశాబ్దాలుగా ఇక్కడే జీవిస్తున్న పేదల ఇండ్లను ఆక్రమణల పేరుతో రైల్వేశాఖ కూల్చివేసి రెండేండ్లు కావోస్తున్నా తిరిగి వారికి గూడు కల్పించడంలో ప్రజాప్రతినిధులుతోపాటు అధికారులు విఫలమయ్యారు.
సీఎంతో మాట్లాడిన.. మీ సమస్య తీరినట్లే
‘భయపడకండి, మేము ఉన్నాం, మీ ఇండ్లు కూలిస్తే ఊరుకుంటమా’..అంటూ అధికార బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు భరోసా ఇచ్చారు. ‘మీ ఇండ్లను కూలిస్తే నా ప్రాణాలను అడ్డుపెట్టి అయినా అడ్డుకుంటా’.. అంటూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. దీంతో పేదల్లో ఆశలు చిగురించాయి. అదే తడువుగా రైల్వే ఆఫీసర్లతో కొత్తగూడెం మున్సిపాలిటీ ఆఫీస్‌లో ఎమ్మెల్యే స్పెషల్మీటింగ్పెట్టారు. ఆ భూములు మావంటే మావని మున్సిపల్, రైల్వే శాఖల ఆఫీసర్లు వాదించుకున్నారు. ఇండ్లను ఎవరూ కూల్చివేయరని ఎమ్మెల్యే చెప్పడంతో తుమ్మలనగర్వాసుల్లో ఆందోళన తగ్గినట్లయింది. కానీ అదే రోజు తెల్లవారు జామున రైల్వే ఆఫీసర్లు పోలీసుల సాయంతో జేసీబీలతో ఇండ్ల కూల్చివేతకు శ్రీకారం చుట్టారు.
కన్నీళ్లు పెట్టుకున్నా కనికరించలేదు..
సుమారు 50 ఏండ్లుగా తుమ్మలనగర్లో ఇండ్లు కట్టుకుని పేదలు నివసిస్తున్నారు. అందరికీ విద్యుత్ శాఖ కరెంట్మీటర్లు ఇచ్చింది. మున్సిపల్ ఆఫీసర్లు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. కొందరికి పట్టాలు కూడా వచ్చాయి. అయినా ఆక్రమణలంటూ రైల్వే శాఖ కూల్చేవేసింది. అడ్డుకున్నవారిని పోలీస్స్టేషన్లకు తరలించారు. కన్నీళ్లు పెట్టుకున్నా ఎవరూ కనికరించలేదు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే వనమా 2021అక్టోబర్2వ తేదీ నాటికి పాత కొత్తగూడెంలో డబుల్బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామని మాటిచ్చారు. ఆయన మాటలను నమ్మిన బాధితులకు నెలలు, ఏండ్లు గడుస్తున్నా డబుల్బెడ్రూంల జాడ మాత్రం లేదు. కనీసం స్థలాల కేటాయింపూ లేదు. తమకు న్యాయం చేయాలంటూ పలుమార్లు గ్రీవెన్స్‌లో బాధితులు కలెక్టర్‌కు విన్నవించారు. తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పిన కలెక్టర్మాటలపై బాధితులు భరోసా కోల్పోయారు. దీంతో అద్దె ఇండ్లలో బాధితులు కాలం వెళ్లదీస్తున్నారు.
కనీసం జాగ అయినా ఇస్తమన్నరు..
డబుల్‌బెడ్ రూం ఇండ్లు లేకపోతే కనీసం జాగ అయినా ఇస్తమని ఎమ్మెల్యే, కలెక్టర్సార్లు చెప్పిండ్రు. ఇప్పటికీ ఇండ్లు లేవు. జాగల జాడే లేదు. ఇండ్లు కూల్చేకన్నా ముందు ఏడాది కిందనే రూ.3లక్షలు అప్పు చేసి కట్టుకున్నం. కూలి పని చేసుకునేటోళ్లం. ఇప్పుడు కిరాయికి ఉంటున్నం. చేసిన అప్పుకు మిత్తి కట్టలేక చస్తూ బతుకుతున్నం.
– భూక్యా అనసూర్య, బాధితులు, తుమ్మలనగర్
జీవితాలను రోడ్డు పాల్జేసిన్రు...
నలబై ఏండ్లుగా ఉంటున్న ఇంటిని రూ. 2.50లక్షలతో మంచిగ చేసుకున్నం. ఆర్నేళ్లకే రైల్వే సార్లు కూల్చేసిన్రు. ఇద్దరు కొడుకులు, కోడళ్లు, పాప, భర్త అందరం ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉంటున్నం. కూలి పని చేసుకుంటున్నం. ఎమ్మెల్యే, కలెక్టర్సార్లు చెప్పినట్టు జాగా, డబుల్బెడ్రూం ఇండ్ల కోసం వారి సుట్టూ తిరుగుతూనే ఉన్నం.
–లక్ష్మి, బాధితురాలు, తుమ్మలనగర్