వరంగల్ రూరల్, వెలుగు: ‘కరోనా’ లాక్‍డౌన్.. చేసుకుంటే బతికే గరీబ్లపై పెను ప్రభావం చూపుతోంది. లాక్‍డౌన్ అమలు పేరుతో కమిషనరేట్ పోలీసులు స్టేషన్ల వారీగా రికార్డు స్థాయిలో వెహికిల్స్ సీజ్ చేస్తున్నారు. ఇందులో వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేనప్పటికీ.. ఎక్కువ శాతం మంది పేద, మిడిల్ క్లాస్ జనాలే ఎక్కువగా బలవుతున్నారు. ఇప్పటి వరకు సీజ్ చేసిన వెహికిల్స్‌లో దాదాపు 80 శాతం మంది కార్మికులు, చిరు వ్యాపారులు, నిత్యావసర వస్తువులు అమ్మేవారే. కావాలని లాక్‍డౌన్ రూల్స్ బ్రేక్ చేసేవారు ఏదో ఓ దారిగుండా పోలీసుల కన్నుగప్పి బయటపడుతుండగా..అవేమీ పెద్దగా తెలియకుండా రోడ్లు ఎక్కేవారే సీజ్ పేరిట ఇబ్బందులు పడుతున్నారు.
11,194 వెహికిల్స్ సీజ్ ..
లాక్‍డౌన్ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఒక్క వరంగల్ కమిషనరేట్ పరిధిలోనే నెల రోజుల్లో 11,194వెహికిల్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. రూల్స్ పాటించడం లేదని 79,002 కేసులు నమోదు చేశారు. రూ.2.53 కోట్లకు పైగా జరిమానా విధించారు. స్టేషన్ల వారీగా టార్గెట్లు ఉండటంతో వెహికిల్స్ సీజ్ చేయక తప్పట్లేదని స్థానిక పోలీసులు ఓపెన్‍గా అంటున్నారు. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల పోలీసులు సీజ్ చేసిన కేసులు అదనం.
ఓన్లీ..ఆటో ట్రాలీ అంటా
రాష్ట్రవ్యాప్తంగా లాక్‍డౌన్ అమలు ఉన్నా.. నిత్యావసర వస్తువులు అమ్మేవారికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ టైంలో సరకులు, కూరగాయలు అమ్మేవారు వారికి కావాల్సిన స్టాక్ తెచ్చుకోవచ్చు. కాగా, పోలీసులు సైతం అలాంటి వారికి అనుమతి ఇచ్చి మరీ వెహికల్స్‌ను సీజ్ చేస్తున్నారు. స్టాక్ తీసుకెళ్లడానికి ఆటో ట్రాలీలకే అనుమతి ఉందని.. ప్యాసింజర్ ఆటోలు, బైక్‌లపై కూరగాయలు, వస్తువులు తీసుకెళ్లడానికి వీలులేదంటూ సీజ్ చేస్తున్నారు. కష్టకాలంలో నాలుగు పైసలు వస్తాయని రోడ్డెక్కుతున్న చిరువ్యాపారుల వెహికిల్స్ సీజ్ కావడంతో లబోదిబోమంటున్నారు. రోజువారీ కూరగాయలు అమ్మేవారు కూడా ఆటో ట్రాలీల్లో మాత్రమే సామాను తీసుకువెళ్లాలనే రూల్ పెట్టి కేసులు రాయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వామ్మో.. ఇదేం పార్కింగ్ ఫీజు
లాక్‍డౌన్ పేరుతో ఆఫీసర్లు సరికొత్త పార్కింగ్ దందాకు తెరలేపారు. పోలీసులు డైలీ సీజ్ చేసిన వెహికిల్స్‌ను ప్రైవేటు పార్కింగ్ ప్లేసుల్లో పెడుతున్నారు. వారేమో బైక్, ఆటో వంటి త్రీవీలర్‍కు ప్రతీ ఆరు గంటలకు రూ.10 చొప్పున రోజుకు రూ.40 ఫీజు వసూలు చేస్తున్నారు. ఏదో ఒక్కరోజు అంటే ఏమోకానీ నెలల తరబడి అదే తరహాలో రూ.1,000 వరకు పార్కింగ్ ఫీజు కట్టాలంటే జనాలకు తలకుమించిన భారమే.. కారు అయితే రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఒక్క వెహికిల్కే ఇంత చార్జీ అయ్యే నేపథ్యంలో.. ఇప్పటికే సీజ్ చేసిన వేలాది వాహనాలకు రోజువారీగా వసూలు చేస్తున్న పార్కింగ్ ఫీజు ఎంత వసూలు అవుతుందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల వెహికిల్స్‌కు కనీసం నీడలేదు. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఉన్నాయి. కాగా, ఆఫీసర్ల కనుసన్నల్లోనే పార్కింగ్ దందా నడుస్తోందనే విమర్శలు వినపడుతున్నాయి.
పనుల వద్దకు పోవుడెట్లా..?
రాష్ట్రంలో మెల్లమెల్లగా కరోనా కంట్రోల్ అవుతున్న నేపథ్యంలో.. గ్రామాల్లోని పలు రకాల పరిశ్రమలు, వ్యాపారాల నిర్వహణకు స్టేట్ సర్కార్ అనుమతులు ఇచ్చింది. ఇటుక బట్టీలు, భవన నిర్మాణాలు, బీడీ తయారీ యూనిట్లు, చేనేత పరిశ్రమలు, స్టోన్ క్రషర్లు, టైల్స్ తయారీ, రిపేరింగ్ షాపులు, సిమెంట్ కంపెనీలు, జిన్నింగ్ మిల్లులు, స్టీల్ ఇండస్ట్రీ, ప్లాస్టిక్, శానిటరీ పైపుల తయారీ, పేపర్, రబ్బర్ తయారీ, కాటన్ దుస్తుల తయారీ పరిశ్రమలు ఇందులో ఉన్నాయి. ఇదే విషయమై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. పనిచేసేచోట కార్మికులు సోషల్ డిస్టెన్స్ పాటించి మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. కాగా, కార్మికులు వారివారి ఇండ్లు, ప్రాంతాల నుంచి పరిశ్రమలకు వెళ్లడానికి ప్రస్తుతం వారి బైక్‌లు కూడా అందుబాటులో లేవు. ఆటో వంటి ప్రైవేట్ వెహికిల్స్నడవడంలేదు. గవర్నమెంట్ పనులు చేసుకునే వీలు కల్పించినా..అక్కడికి వెళ్లే సొంత వాహనాలు మాత్రం పోలీసుల చేతుల్లో ఉండటంతో వారికి ఏంచేయాలో తెలియడం లేదు.