- ఇంటి కిరాయిలకు పైసల్లేక సర్కార్ జాగల్లో గుడిసెలు వేసుకుంటున్న పేదలు
- జేసీబీలు పెట్టి తొలగిస్తున్న రెవెన్యూ ఆఫీసర్లు, పోలీసులు
- బాధితుల ధర్నాలతో రెండు వారాలుగా అట్టుడుకుతున్న వరంగల్
వరంగల్, వెలుగు: ‘అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి, గుడిసెలు లేని వరంగల్ చేస్తం’ అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఏడేండ్లయితున్నా అమలుకాకపోవడంతో గ్రేటర్ వరంగల్‍లో పేదలు రోడ్డెక్కుతున్నారు. కిరాయి ఇండ్లకు నెలనెలా వేలల్లో ఇంటి కిరాయిలు కట్టే స్థోమత లేక రాష్ట్ర సర్కారుతో తాడో పేడో తేల్చుకుందామని పోరుబాట పడుతున్నారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటున్నారు. వీటిని రెవెన్యూ, పోలీస్ అధికారులు జేసీబీలుపెట్టి కూల్చేస్తున్నారు. కొన్ని చోట్ల అగ్గిపెడుతున్నారు. దీంతో పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇల్లు కట్టిస్తామని చెప్పి కట్టియ్యకపోగా.. తాము వేసుకుంటున్న గుడిసెలను తొలగించుడేందని ప్రశ్నిస్తున్నారు.
బడాబాబులు వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేసినా పట్టించుకోని అధికారులు గరీబోళ్ల మీద పగబట్టినట్లు చేసుడేందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండువారాలుగా ఏదో ఒక రూపంలో తమ నిరసనలు తెలుపుతున్నారు.
6 వేల ఇండ్లని చెప్పి.. ఇచ్చింది 159 ఇండ్లే!
గ్రేటర్ వరంగల్ పరిధిలో 5 వేల నుంచి 6 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని ఏడేండ్ల కింద ప్రభుత్వ పెద్దలు చెప్పారు. అది అమలు కాకపోవడంతో మూడేండ్ల కింద పేదలు ధర్నాలు చేశారు. దీంతోరివ్యూ నిర్వహించిన ప్రభుత్వ పెద్దలు 2020 దసరా నాటికి 3,900 ఇండ్ల నిర్మాణం పూర్తిచేసి ఇస్తామన్నారు. తీరాచూస్తే.. 2022 ఏప్రిల్‍లో కేటీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా వరంగల్ ఎస్‍ఆర్ నగర్‍లోని 159 మందికి మాత్రమే ఇండ్లు ఇచ్చారు. హన్మకొండలోని అంబేడ్కర్, జితేందర్‍సింగ్ కాలనీల్లో 597 ఇండ్ల నిర్మాణం పూర్తయినా పేదలకు ఇవ్వట్లేదు. 3,700 ఇండ్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి.
కిరాయిలు కట్టలేక.. గుడిసెలు వేసుకుంటే..
గ్రేటర్ వరంగల్పరిధిలో ఇండ్ల కిరాయిలు అమాంతం పెరగడంతో నిరుపేదలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలోని ప్రభుత్వ స్థలాలు, చెరువు శిఖం భూముల్లో గుడిసెలు వేసుకుంటున్నారు. లెఫ్ట్ పార్టీలైన సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో గడిచిన రెండు వారాల్లో ఖిలా వరంగల్, మట్టెవాడ శివారు నిమ్మాయి చెరువు, గోపాల్‍పూర్ ఊర చెరువు, జక్కలొద్ది, బొల్లికుంట, గుండ్లసింగారం, దర్గా కాజీపేట రోడ్, మడికొండ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూముల్లో పేదలు గుడిసెలు వేశారు.
జేసీబీలతో కూలుస్తున్న ఆఫీసర్లు
ప్రభుత్వ భూముల్లో ఓ వైపు పేదలు గుడిసెలు వేస్తుంటే.. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది వాటిని జేసీబీలతో వరుసపెట్టి కూల్చుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిప్పు పెడుతున్నారు. పట్టువిడవని బాధితులు మళ్లీ కట్టెలు, చీరలు, కవర్లతో గుడిసెలు వేస్తున్నారు. జేసీబీలకు అడ్డంగా వెళుతున్నారు.
ఆఫీసుల ముట్టడి.. పోలీసుల కేసులు
ప్రభుత్వ భూములు, చెరువులను అక్రమార్కులు కబ్జా చేసి ప్లాట్ల బిజినెస్ చేస్తుంటే అడ్డుకోని అధికారులు.. పేదల గుడిసెలు ఎలా కూలుస్తారంటూ సీపీఐ, సీపీఎం నేతలు గ్రేటర్ కార్పొరేషన్, తహాసీల్దార్ ఆఫీసుల ముట్టడికి పిలుపునిచ్చారు. వేలాది మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలు, శిఖం భూములను పేదలకు పంచి.. జీవో 58 ప్రకారం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు వారాలుగా నిత్యం ఒకటి, రెండుచోట్ల ఉద్రిక్తత చోటుచేసుకుంటున్నది. ఖిలా వరంగల్‍లో ధర్నాకు సంబంధించి ఇప్పటికే మిల్స్ కాలనీ పోలీసులు 11 మందిపై కేసులు నమోదు చేశారు.
2015లో కేసీఆర్ ఏమన్నరంటే..
సీఎం కేసీఆర్ 2015 జనవరిలో వరంగల్ సిటీలో పర్యటించారు. వరంగల్ ఎస్‍ఆర్, గిర్మాజిపేట, హన్మకొండ శ్రీదేవి టాకీస్ వద్ద ఉన్న అంబేడ్కర్‍నగర్, దీన్‍దయాల్ నగర్ గుడిసెవాసుల కాలనీలకు వెళ్లారు. ‘నేను పాత ముఖ్యమంత్రి లెక్క వచ్చిపోవుడు కాదు. కేసీఆర్ ను. మాట ఇచ్చామంటే నెరవేరాలె. లేదంటే తలకాయ కిందపడాలె’ అని ఆయన అన్నారు. జీవో 58 ప్రకారం బాధితులకు ఇండ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు. అందరికీ వన్ ప్లస్ వన్ మోడల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి, గుడిసెలులేని వరంగల్ నగరాన్ని నిర్మిస్తామన్నారు. ‘ఐదు నెలల్లో కాలనీలు నిర్మాణం కావాలె. మళ్లీ నేనే వచ్చి రిబ్బన్ కట్ చేయాలె. మీరంతా జోరుదార్ దావత్ ఇవ్వాలె’ అని జనంతో చెప్పారు.
చూసిచూసి యాష్టకొచ్చింది
మాలాంటి పేదోళ్లకు ఇండ్ల పట్టాలు, ఇండ్లు ఇస్తామని ఏడేండ్ల కింద సీఎం కేసీఆర్ చెప్పినప్పుడు ఖుషీ అయిన. చూసిచూసి యాష్టకొచ్చింది తప్పితే ఇండ్లు కట్టుడు లేదు.. ఇచ్చుడు లేదు. ప్రభుత్వ స్థలాలు, చెరువులను కొందరు పెద్దలు కబ్జాలు చేస్తున్నరు. 60 గజాల కోసం మాలాంటి గరీబోళ్లు గుడిసె వేసుకుంటే ఏమనరనుకొని వచ్చినం. కబ్జాలు చేసెటోళ్లను పల్లెత్తు మాటనని పోలీసోళ్లు.. మేం గుడిసె వేయంగనే కూల్చేసిన్రు. ప్రభుత్వం స్పందించి గూడు చూపెట్టాలె. - రాచమల్ల రామా వెంకటేశ్, పోచమ్మకుంట, హన్మకొండ
కిరాయి కట్టలేకపోతున్నం
ఎప్పటినుంచో సిటీలో ఉంటున్నాం. చేసుకుంటేనే బతుకుడు తప్పించి వేరే మార్గం లేదు. కూలీ పనులకుపోతే వచ్చే డబ్బుల్లో సగం ఇంటి కిరాయిలకే పోతున్నయ్. సొంతంగా చిన్న గుడిసె ఉన్నచాలని గోపాల్‍పూర్ చెరువులో అందరితో కలిసి గుడిసె వేసుకున్నం. పోలీసులేమో జేసీబీలు పెట్టి కూల్చివేస్తున్నరు. ప్రభుత్వం మాకు స్థలం ఇచ్చి పట్టాలియ్యాలె. - భూక్య స్వరూప, కోమటిపల్లి, హసన్‍పర్తి
కేసీఆర్.. గుడిసెలు లేని వరంగల్ నగరమేది?
గుడిసెలు లేని వరంగల్ నగరం చేస్తామన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయి? జీవో 58 ప్రకారం పేదోళ్లకు ఇండ్ల పట్టాలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి తప్పింది. డబుల్ బెడ్రూం ఇండ్లు ఎక్కడికి పోయాయో పేదోళ్లు వేసుకున్న గుడిసెలను కూల్చివేయడం అన్యాయం. నిమ్మాయి చెరువును అక్రమార్కులు కబ్జా చేసి ప్లాట్లు చేస్తుంటే కదలని అధికారులు పేదోళ్లు గుడిసెలు వేసుకుంటే దాడులు చేయడం సరికాదు. - చాడ వెంకట్‍రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి