మహిళల జనాభా 85 లక్షలు : పోటీలో 50 మందే..!

హర్యానాలో మహిళా ఓటర్లు 85 లక్షల వరకు ఉన్నారు. 90 సీట్ల అసెంబ్లీకి పోటీ చేసేవాళ్లలో మహిళల సంఖ్య మాత్రం 50కి మించలేదు! అధికార బీజేపీ పాపులర్​ ఫిగర్లను బరిలో దింపితే, ప్రతిపక్ష కాంగ్రెస్​ పదో వంతు టిక్కెట్లు మాత్రమే లేడీస్​కి ఇచ్చి చేతులు దులుపుకుంది. దేవీలాల్​ ఫ్యామిలీకి చెందిన ఐఎన్​ఎల్​డీ అందరికంటే ఎక్కువగా 15మందికి చాన్స్​ ఇచ్చింది. 2014 ఎన్నికలతో పోలిస్తే… ఈసారి హర్యానా పొలిటికల్​ ఎరీనాలో మహిళా కేండిడేట్లు సగం కంటే తక్కువే ఉన్నారు.

హర్యానాలో పోల్​ గంట మోగడానికి కేవలం తొమ్మిది రోజులే గడువు. ఈ నెల 21న జరిగే పోలింగ్​లో అదృష్టం పరీక్షించుకోవడానికి రంగం రెడీ అయ్యింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్​లతోపాటు చౌతాలా ఫ్యామిలీకి చెందిన ఇండియన్​ నేషనల్​ లోక్​ దళ్​ (ఐఎన్​ఎల్​డీ), జన నాయక్​ జనతా పార్టీ (జేజేపీ)కూడా సై అంటే సై అంటున్నాయి. మొత్తం 90 సీట్ల అసెంబ్లీలో ఏ పార్టీకూడా కనీసం నాలుగో వంతయినా మహిళా కేండిడేట్లను నిలబెట్టలేదు. ఏఐసీసీ చీఫ్​గా సోనియా గాంధీ, పీసీసీ చైర్​పర్సన్​గా కుమారి షెల్జా ఉన్నప్పటికీ కాంగ్రెస్​ తరఫున తొమ్మిదిమంది ఆడవాళ్లు మాత్రమే పోటీలో ఉన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ 12 మందిని నిలబెట్టింది.  మాజీ డిప్యూటీ ప్రధాని దేవీలాల్​ ఫ్యామిలీ వాళ్లు ఇప్పుడు ఐఎన్​ఎల్​డీ, జేజేపీలుగా విడిపోయారు. దేవీలాల్​ కొడుకు, మాజీ సీఎం ఓమ్​ ప్రకాశ్​ చౌతాలాకి చెందిన ఐఎన్​ఎల్​డీ అన్ని పార్టీలకంటే ఎక్కువగా 15 మంది మహిళలను బరిలో దింపింది. చౌతాలా మనవడు దుష్యంత్​ సింగ్​ (అజయ్​ సింగ్​ కొడుకు) తమ జేజేపీ తరఫున ఏడుగురు ఆడవాళ్లకు టిక్కెట్లు ఇచ్చారు.

వీళ్లలో కొన్ని కొత్త ముఖాలున్నాయి. మరికొన్ని హర్యానా పొలిటికల్​ ఫ్యామిలీలకు చెందినవాళ్లున్నారు. ఇతర జేజేపీ కేండిడేట్లలో సాధౌరా నుంచి గతంలో లోక్​సభకు పోటీ చేసి ఓడిపోయిన కుసుమ్​ షేర్​వాల్ ​, నర్నౌల్​ నుంచి గతంలో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన కమలేశ్​ సైనీలున్నారు. కురుక్షేత్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్​ సంతోష్​ దహియా జేజేపీ అభ్యర్థిగా లాడ్వా నుంచి పోటీ చేస్తున్నారు.కాంగ్రెస్​ ఈ ఎన్నికల్లో తొమ్మిదిమందికి టిక్కెట్లివ్వగా, వాళ్లలో మాజీ సీఎల్​పీ లీడర్​ కిరణ్​ చౌధురి, మాజీ మినిస్టర్​ గీతా భుక్కల్​ ఉన్నారు.  ఇక, మహిళలకు ఎక్కువ సీట్లివ్వడంలో చౌతాలా పార్టీ ఐఎన్​ఎల్​డీ టాప్​లో నిలబడింది. ఈ పార్టీ మొదట మూడోవంతు (30) సీట్లు ఇస్తామని ప్రకటించినా, చివరకొచ్చేసరికి 15మందికే సర్దుబాటు చేసింది. అయినప్పటికీ ఇతర పార్టీలకంటే మెరుగ్గానే ఇచ్చిందని చెప్పాలి. అదే విధంగా స్వరాజ్​ ఇండియా పార్టీ కూడా మూడో వంతు ఇస్తామని చెప్పి, ఆఖరికి అయిదుగురితో సరిపుచ్చింది. ఈ రెండు పార్టీలు చెబుతున్న కారణం ఒక్కటే… ‘హర్యానా పాలిటిక్స్​లో మహిళలు చురుగ్గా లేరు. ఇక్కడి సోషల్​ లైఫ్​ వల్ల ఆడవాళ్లు అంతగా బయటకి రావడం లేదు’అని. ఈ వాదనను ప్రొఫెసర్​ సంతోష్​ కొట్టిపారేస్తున్నారు. 2016లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్​ ఇవ్వగా, 45 శాతం వరకు సర్పంచ్​ పోస్టుల్ని ఆడవారు గెలుచుకున్నారని గుర్తు చేశారు. కురుక్షేత్ర జిల్లాలో ఆమె ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కాంపెయిన్​కి బ్రాండ్​అంబాసిడర్​గాఉన్నారు.

2014లో దుమ్ము లేపారు!

పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతమంది స్త్రీలు పోటీకి దిగారు.  మొత్తం 1,565 మంది పోటీకి దిగితే, వాళ్లలో 162 మంది మహిళలే. వీళ్లలో 13 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. 1966లో హర్యానా ఏర్పడిన తర్వాత ఇంతమంది ఆడవారు ఎమ్మెల్యేలుగా గెలవడం అదే మొదటిసారి. ఇప్పుడు 1,186 మంది పోటీ చేస్తుండగా, వాళ్లలో కేవలం 50 మంది మహిళలు. మొత్తం ఓటర్లు కోటీ 83 లక్షల మందికాగా, మహిళా ఓటర్ల సంఖ్య 85 లక్షల వరకు ఉంటుంది.  టిక్కెట్లిచ్చే సమయంలో ఆడవాళ్లను పట్టించుకోలేదని మహిళా సంఘాలు అంటున్నాయి.

పాపులారిటీ ఉన్నోళ్లకు సీట్లు

వరుసగా రెండోసారి అధికారం దక్కించుకోవడానికి బీజేపీ ఆచితూచి టిక్కెట్లు కేటాయించింది. బీజేపీ ఈసారి ఆడవాళ్లకు ఇచ్చిన సీట్లలో గ్లామర్​, పాపులారిటీకి మంచి ఇంపార్టెన్స్​ ఇచ్చింది. బీజేపీ నిలబెట్టిన 12మంది కేండిడేట్లలో ఒక సోషల్​ మీడియా స్టార్​, కుస్తీ క్రీడాకారిణి, ఫ్యాషన్​ డిజైనర్​ ఉన్నారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో… ఈసారి 33 శాతం (30) అసెంబ్లీ టిక్కెట్లు మహిళలకే ఇస్తామని చెప్పుకొచ్చింది బీజేపీ. తీరా టిక్కెట్ల పంపిణీలో 13 శాతానికి పరిమితమైంది. మొత్తం కోటీ 83 లక్షల ఓటర్లలో మహిళా ఓటర్లు 46 శాతం వరకు ఉంటారు. బీజేపీ నిలబెట్టిన మహిళల్లో… రెండుసార్లు కామన్​వెల్త్​ గేమ్స్​లో బంగారు పతకం సాధించిన బబిత ఫోగట్​ (దాద్రి స్థానం), టిక్​టాక్​ స్టార్​ సోనాలి ఫోగట్​ (ఆదంపూర్), ఫ్యాషన్​ డిజైనర్​ నౌక్షమ్​ చౌధురి (పున్హానా) ఫస్ట్​ టైమ్​ ఎలక్షన్స్​లో నిలబడినవాళ్లు.  హర్యానాలో చాలా వెనుకబడిన ప్రాంతమైన పున్హానా నుంచి బీజేపీ అభ్యర్థిగా ఫ్యాషన్​ డిజైనర్​ నౌక్షమ్​ చౌధురి పోటీ చేస్తున్నారు.

‘దంగల్​’ సినిమాకి ఇన్​స్ఫిరేషన్​ అయిన ఫోగట్​ ఫ్యామిలీ నుంచి వచ్చిన బబితకి బీజేపీ టిక్కెట్​ ఇచ్చింది. ఈ సినిమాలో బబిత తండ్రి, ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహవీర్​ సింగ్​ ఫోగట్​ పాత్ర అమీర్​ ఖాన్​ పోషించారు. బబిత తల్లి తమ గ్రామానికి రెండుసార్లు సర్పంచ్​గా ఎన్నికయ్యారు. ఇతర బీజేపీ కేండిడేట్లలో…. ఉచన కలన్​ నుంచి మాజీ కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్​ భార్య ప్రేమ్​ లత, కల్కా సీటులో లతిక శర్మ, బడ్కల్​ నుంచి సీమా తృఖా, నర్వానా నుంచి సంతోష్​ దనోడా, ఉక్లానా స్థానం నుంచి ఆశా ఖేడర్​ పోటీ చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్​ ప్రకటించగానే హర్యానా మహిళా కాంగ్రెస్​  చీఫ్​ సుమిత్ర చౌహాన్​ పార్టీకి రాజీనామా ఇచ్చేసి బీజేపీలో చేరిపోయారు. అలాగే, మాజీ పీసీసీ చీఫ్​ అశోక్​ తన్వర్​రాజీనామా చేసేశారు. ఈ రెండు పరిణామాలు కాంగ్రెస్​కి చాలా పెద్ద దెబ్బకొడతాయని ఎనలిస్టులు భావిస్తున్నారు.

టిక్​టాక్​ తెచ్చింది టికెట్​

అందరిలోకి లక్కీ కేండిడేట్ సోనాలి ఫోగట్ (బీజేపీ). ఆమె టిక్ టాక్ సోషల్ మీడియాలో చాలా పాపులర్. లక్షా 66 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సోనాలి ఈ ఎన్నికల్లో మాజీ సీఎం భజన్ లాల్ కుటుంబానికి కంచుకోటలాంటి ఆదంపూర్ లో నిలబడింది. ఆమెకు పోటీగా భజన్ లాల్ కొడుకు కుల్ దీప్ బిష్ణోయ్ కాంగ్రెస్ తరఫున ఉన్నారు. ఆయన మూడుసార్లు ఆదంపూర్ నుంచే
ఎమ్మెల్యేగా గెలిచారు. హర్యానాకి మూడుసార్లు సీఎంగా పనిచేసిన భజన్ లాల్ కొడుకైన బిష్ణోయ్ ఆర్థికంగా ఫుల్ సౌండ్ పార్టీ. ఆదంపూర్ సీటును 1967 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీనే దక్కించుకుంది. మరి, ఈ ఎన్నికల్లో టిక్ టాక్ స్టార్ సోనాలి (బీజేపీ) ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అయితే, అయిదేళ్ల కొకసారి మాత్రమే భజన్ లాల్ ఫ్యామిలీ నియోజకవర్గం వైపు
తొంగిచూస్తందని, తాను గెలిచినా ఓడినా ఆదంపూర్ లోనే పనిచేస్తానని సోనాలి ప్రచారం చేస్తోంది.

రంగంలోచౌతాలా కోడలు

చౌతాలా కోడలు, అజయ్​ సింగ్​ భార్య నయనా చౌతాలా తమ పార్టీ జేజేపీ తరఫున మాజీ సీఎం బన్సీలాల్​ కొడుకు రణ్​బీర్​ మహీంద్రపై పోటీ చేస్తున్నారు. బాధ్రాలో వీరిద్దరి మధ్య పోటీ హోరాహోరీగా ఉందంటున్నారు. నయనా చౌతాలా అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె భర్త అజయ్​ సింగ్​, మామ ఓమ్​ ప్రకాశ్​ చౌతాలా 2013లో జూనియర్​ బేసిక్​ టీచర్ల రిక్రూట్​మెంట్​ స్కాంలో జైలు శిక్షకు గురయ్యారు. దాంతో నయనా చౌతాలా 2014 ఎన్నికల్లో ఐఎన్​ఎల్​డీ టికెట్​పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం తన కొడుకులు దుష్యంత్​ చౌతాలా​, దిగ్విజయ్ చౌతాలా స్థాపించిన జేజేపీ తరఫున పోటీలో ఉన్నారు. ఆమెకు గ్రామీణ హర్యానాలో మంచి పాపులారిటీ ఉందని పరిశీలకులు చెబుతున్నారు. నయన నిర్వహించే ఎన్నికల ర్యాలీలకు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

నౌక్షం చౌధురి జోరు

హర్యానాలో బాగా వెనుకబడిన ప్రాంతమైన మేవాత్​లోని పున్హానా నియోజకవర్గం ఇప్పుడు హట్​టాపిక్​గా మారింది. ఫ్యాషన్ వరల్డ్ నుంచి లేటెస్ట్​గా పొలిటికల్​ ఎంట్రీ ఇచ్చిన 28 ఏళ్ల నౌక్షం చౌధురి ఈ సీటులో పోటీకి దిగింది.  ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న పున్హానాలో ఇప్పటివరకు బీజేపీకి గెలుపు లేదు.  నౌక్షం సొంతూరు పేమా ఖేరా ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఆమె తండ్రి ఈ ప్రాంతంలో తొలి  ‘లా’ గ్రాడ్యుయేట్​గా రికార్డుకెక్కారు. నౌక్షం బంధువులు అందరూ పెద్ద ఉద్యోగాల్లో సెటిలయ్యారు. పున్హానా పాలిటిక్స్​కి కొత్త ఫేస్​ని పరిచయం చేసినట్ల వుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి.