ఓబీసీ జనాభా లెక్కించాల్సిందే

2021 సెన్సెస్​లో కులాల వారీగా జనాభా లెక్కించడం సాధ్యం కాదని గత నెలలో సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్​లో కేంద్రం తెలిపింది. ఈ విషయంలో సెంట్రల్​ గవర్నమెంట్​మరోసారి ఆలోచించాలి. ఇప్పుడు గనుక కులాల వారీగా ఓబీసీ జనాభా లెక్కించకపోతే.. మరో పదేండ్లు జనాభా దామాషా పద్ధతిలో విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో లభించాల్సిన రిజర్వేషన్లు అందకుండా పోయే ప్రమాదం ఉంది. 1993 నుంచి ఓబీసీ రిజర్వేషన్లు 27 శాతం అమలు చేస్తున్నా.. నేటికీ అన్ని కేటగిరిల్లో సెంట్రల్​ జాబ్​ల ప్రాతినిధ్యం 21 శాతానికి మించడం లేదు. చట్ట సభల్లోనూ ఓబీసీలకు రిజర్వేషన్లు లేనందున లోకసభ, అసెంబ్లీల్లో ప్రాతినిధ్యం 20 శాతానికి మించడం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించి దేశంలో 50 శాతానికిపైగా జనాభా ఓబీసీ/బీసీ కులాలకు న్యాయం చేయాలి.

దేశంలో కులాల మధ్య ఏర్పడ్డ అసమానతలను రూపుమాపాలంటే, కులాల వారి జనాభా లెక్కలు తప్పనిసరని భావించిన అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం1872 నుంచి1931 వరకు కులాల వారీగా జనాభా లెక్కించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 26 జనవరి 1950 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. వివిధ అధికరణల ద్వారా షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) వారి జనాభా దామాషా పద్ధతిలో విద్య, ఉద్యోగ, ఆర్థిక, స్థానిక, చట్టసభలైన అసెంబ్లీలు, లోకసభలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించారు. 1951 నుంచి తీస్తున్న జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీ కులాలను లెక్కిస్తూ, మిగతా వారిని ఇతరులుగా నమోదు చేస్తున్నారు. కానీ కులాల వారీగా బీసీలను లెక్కించడం లేదు. ఆర్టికల్ 246లో తెలిపినట్లు షెడ్యూల్ ఏడో జాబితా ఒకటిలోని 69 క్లాజ్ ప్రకారం దేశ జనాభా లెక్కలు, ప్రతీ పది సంవత్సరాలకు లెక్కించడానికి సెన్సెస్ 1948 చట్టం చేశారు. దాని  ప్రకారం కేంద్రానికి జనాభా లెక్కించే అధికారం ఉంది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల(ఓబీసీ) జనాభా లెక్కలు లేనందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్లు, కులాల వారీగా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.

50 శాతానికి మించొద్దని..

ఓబీసీ జనాభా 50 శాతానికి మించి ఉన్నప్పటికీ సామాజిక రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని మండల్ కమిషన్ తీర్పులోని సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం కేంద్ర విద్యా, ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్లను 27 శాతానికి పరిమితం చేశారు. అదే తీర్పులో ఓబీసీ కులాల ఆమోదయోగ్యమైన జనాభా లెక్కలు ఉంటే 50 శాతం రిజర్వేషన్లు మించి అమలు చేసుకోవచ్చని ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2010లో అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ, ఇతర పార్టీలు 2011 జనాభా లెక్కల్లో ఓబీసీలను కులాల వారీగా లెక్కించాలని ఆందోళన చేశాయి. అందుకు స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ లో సమాధానం చెబుతూ, జనాభా లెక్కలకు సంబంధించిన సామగ్రిని అప్పటికే దేశవ్యాప్తంగా పంపించామని కులాల వారీగా లెక్కించడం వీలుకాదని తెలుపుతూ, ప్రత్యేకంగా సామాజిక, ఆర్థిక జనాభా లెక్కలు తీస్తామని తెలిపింది. 2011లో దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థికంగా జనాభాను లెక్కించినా.. నేటికీ ఆయా వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. దేశవ్యాప్తంగా జేడీయూ, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే, టీఎంసీ, బీజేడీ, శివసేన తదితర పార్టీలు 2021 సెన్సెస్​లో కులాల వారీగా జనాభా లెక్కించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కానీ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. కాలయాపన చేస్తున్నాయి. 

రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపు లేదు

రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి12 శాతానికి పెంచుతామని, ముస్లిం కోటా 4 శాతం నుంచి12 శాతానికి పెంచుతామని చెబుతోంది. కానీ బీసీ రిజర్వేషన్ల పెంపుపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించడం లేదు. పైగా స్థానిక సంస్థల్లో కొనసాగుతున్న బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు. వీటిని బట్టి బీసీల రిజర్వేషన్లు, అభివృద్ధిపై ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా తెలుస్తోంది. 2021 సెన్సెస్​లో కులాల వారీగా ఓబీసీ జనాభా లెక్కించకపోతే.. మరో పదేండ్లు జనాభా దామాషా పద్ధతిలో విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో లభించాల్సిన రిజర్వేషన్లు అందకుండా పోయే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం 2011లో లెక్కించిన ఓబీసీ కులాల సామాజిక, ఆర్థిక జనాభా లెక్కల వివరాలు ఇవ్వాలని ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. కాగా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం సదరు వివరాలను ఇప్పించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో భాగంగా కేంద్రం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పిస్తూ.. కులాల వారీగా ఓబీసీ జనాభా లెక్కలు సాధ్యం కావని తెలిపింది. అయితే కేంద్రం సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్​లో చాలా అంశాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి. దేశంలో 1931 నాటికి 4,147 కులాలు ఉన్నాయని, ప్రస్తుతం ఆ కులాల సంఖ్య ఉపకులాల, ఉపతెగల, గోత్రాల పేరుతో విడిపోయి 46 లక్షలకు చేరినట్లు తెలిపింది. రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లో 3,150 కులాలను,  కేంద్రంలో 2,479 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చినట్లు తెలిపింది. కులాల వారీగా ఓబీసీల జనాభా లెక్కిస్తే దేశంలో కులాల మధ్య అసమానతలు, విద్వేషాలు పెరిగి దేశసమగ్రతకు విఘాతం కలుగుతుందని సుప్రీంకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. అయితే బీజేపీ ప్రభుత్వం 2021 సెన్సెస్​లో కులాల వారీగా జనాభా లెక్కలు తీస్తామని 2018లో అప్పటి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ద్వారా విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించింది. బీజేపీకి ఓబీసీల జనాభా లెక్కలు తీయాలని ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో  కొందరు అధికారులు ఓబీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 

ప్రభుత్వాలకు సూచనలు చేసినా..

కేంద్ర ప్రభుత్వం1953లో కాకా కాలేల్కర్ అధ్యక్షతన నియమించిన మొదటి జాతీయ బీసీ కమిషన్ నుంచి ఇప్పటి వరకు అనేక రాష్ట్ర బీసీ కమిషన్లు, సుప్రీంకోర్టు, హైకోర్టులు బీసీ రిజర్వేషన్ల రక్షణ, పెంపు కోసం కులాల వారీగా బీసీలను లెక్కించాలని ప్రభుత్వాలకు సూచనలు చేశాయి. ఆమోదించదగిన, అధికారిక ఓబీసీ కులాల లెక్కలు లేనందున కేంద్ర,  రాష్ట్రాల్లోని విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు జనాభా దామాషా పద్ధతిలో అమలు కావడం లేదు. కేంద్ర ఉద్యోగాల్లో 1993 నుంచి ఓబీసీ రిజర్వేషన్లు 27 శాతం అమలు చేస్తున్నా.. నేటికీ అన్ని కేటగిరీల్లో ప్రాతినిధ్యం 21 శాతానికి మించడం లేదు. చట్టసభల్లోనూ ఓబీసీలకు రిజర్వేషన్లు లేనందున లోకసభ, అసెంబ్లీల్లో ప్రాతినిధ్యం 20 శాతానికి మించడం లేదు. ఇప్పటికైనా ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం  2021 సెన్సెస్​లో కులాలవారీగా జనాభా లెక్కలు తీయడానికి రాజ్యాంగ సవరణ ద్వారా చర్యలు తీసుకొని, దేశంలోని 50 శాతానికిపైగా జన సంఖ్యగల ఓబీసీ/బీసీ కులాలకు న్యాయం చేయాలి. 

- కోడెపాక
కుమార స్వామి, రాష్ట్ర
రాషట్ర అధ్యక్షుడు, తెలంగాణ విదుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం