వెలుగు సక్సెస్ : చివరి దివాన్లు

వెలుగు సక్సెస్ :  చివరి దివాన్లు

నిజాం పరిపాలన వ్యవస్థలో దివాన్ పదవి అత్యంత కీలకం. ఆ పదవికే వన్నెతెచ్చిన వ్యక్తి సాలార్​జంగ్​ -1.  ఎన్నో సంస్కరణలు చేపట్టాడు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్​ కాలంలో ఏడుగురు దివాన్లు పనిచేశారు వీరిలో మహారాజా కిషన్​ పర్షాద్​ ముల్కీల పక్షం వహించి స్థానికులకే ఉద్యోగాలు లభించేందుకు కృషి చేశాడు. సర్​ అలీ ఇమామ్​ శాసన వ్యవస్థ నుంచి న్యాయ వ్యవస్థను వేరు చేశాడు. శాసన వ్యవస్థలో సంస్కరణల కోసం జడ్జి బాలాముకుంద్​ నేతృత్వంలో కమిటీ వేశాడు. సర్​ అక్బర్ హైదరీ కాలంలో రాజ్యాంగ సంస్కరణల కోసం అరవముదు అయ్యంగార్ ఆధ్వర్యంలో కమిటీని వేశారు. ఏడో నిజాం పరిపాలన అంతంలో చటారీ నవాబ్​, సర్ మీర్జా ఇస్మాయిల్​,  మీర్ లాయక్ అలీ ప్రధానులుగా సేవలందించారు. 

మహారాజా కిషన్​ పర్షాద్​ 


ఈయన హైదరాబాద్​ దివాన్​గా 1901 నుంచి 1912 వరకు, 1926 నుంచి 1937 వరకు రెండు సార్లు దివాన్​గా పనిచేశారు. రెండోసారి దివాన్​గా పనిచేసిన సమయంలో హైదరాబాద్​లో అనేక సంస్కరణలు అమలులోకి వచ్చాయి. ఈయన పోరాటంతో హైదరాబాద్​ ప్రభుత్వం 1911లో ముల్కీ ఉద్యోగ ప్రకటన చేసింది. 

1911 ప్రకటన 

నాన్​ముల్కీ ఉద్యోగులందరూ తాత్కాలిక ఉద్యోగులుగా పరిగణిస్తారు.  ఉద్యోగ నియామకాలు రాజకీయ జోక్యంతో కాకుండా రాత పరీక్ష ద్వారా జరగాలి. స్థానికులకు తగిన అర్హతలు ఉన్నప్పుడు ఆ పదవుల్లో స్థానికులనే నియమించాలి. స్థానికేతరులను నియమించకూడదు. 

మీర్​ యూసఫ్​ అలీఖాన్​

1889, జూన్​ 13న మీర్​ యూసఫ్​ అలీఖాన్​ పుణెలో మీర్​ లాయక్ ​అలీఖాన్​, జైనబ్​ బేగంలకు జన్మించారు. మీర్​ యూసఫ్​ అలీఖాన్​ సాలార్​జంగ్​–3గా ప్రసిద్ధి పొందారు. ఈయన 1912 నుంచి 1914 వరకు హైదరాబాద్​ దివాన్​గా పనిచేశారు. మీర్​ యూసఫ్​ ఖాన్​ చిన్న వయస్సులోనే తన తండ్రిని కోల్పోయాడు. తల్లి జైనబ్​ బేగం అతన్ని కంటికి రెప్పలాగ పెంచి పెద్ద చేసింది. సాలార్​జంగ్​–3 యుక్త వయస్సులో ఉన్నప్పుడు ప్రేమించిన యువతిని వివాహం చేసుకోలేకపోవడంతో  మానసికంగా ఇబ్బందులకు గురయ్యాడు. సాలార్​జంగ్​ కుటుంబ వైద్యుడు అయిన డాక్టర్​ హంట్​ యూరోపియన్​ సంపన్నులు కళాకృతులను సేకరించడం ద్వారా మానసిక ఇబ్బందులను దూరం చేసుకుంటారని అని తెలిపాడు. ఈ విషయం యూసఫ్​ అలీఖాన్​కు నచ్చి అనేక వస్తువులను సేకరించడం మొదలు పెట్టాడు.
 
సాలార్​జంగ్​ మ్యూజియం 

సాలార్​జంగ్​ మ్యూజియంలోని అనేక వస్తువులను సాలార్​జంగ్​ –3 సేకరించాడు. సాలార్​జంగ్​ – 1, 3లు సేకరించిన వస్తువులను దివాన్​ దేవిడిలో ఒక మ్యూజియంగా 1951లో ఏర్పాటు చేశారు. అనంతరం ప్రభుత్వం 1968లో ప్రస్తుత సాలార్​జంగ్​ మ్యూజియాన్ని నిర్మించి దివాన్ దేవిడిలోని వస్తువులను అక్కడికి తరలించింది. 

సర్​ అక్బర్ హైదరీ

ఈయన 1937 నుంచి 1941 వరకు హైదరాబాద్​ దివాన్ గా పనిచేశాడు. అక్బర్​ హైదరీ తన గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత భారత ప్రభుత్వ ఆర్థిక శాఖలో చేరాడు. 1905లో అకౌంటెంట్​ జనరల్​గా హైదరాబాద్​కు వచ్చాడు. అనంతరం రెండేండ్లకు 1907లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పదోన్నతి లభించింది. 1911లో హోంశాఖ కార్యదర్శిగా నియామకమయ్యారు. ఈయనే 1914లో హైదరాబాద్​లో పురావస్తుశాఖను నెలకొల్పారు. 1921లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి హోం, ఆర్థిక, రైల్వే శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. 1928లో సర్​ అనే బిరుదును పొంది ప్రీవీ కౌన్సిలర్​ కూడా అయ్యాడు. లండన్​లో నిర్వహించిన మూడు రౌండ్​ టేబుల్​ సమావేశాలకు హైదరాబాద్​ సంస్థానం తరఫున సర్​ అక్బర్ హైదరీ హాజరయ్యాడు. నిజాం రాజ్యంలో రాజకీయ సంస్కరణలకు సంబంధించి మహాత్మా గాంధీ, అక్బర్ హైదరీకి మధ్య సుదీర్ఘ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. 1938లో ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతర ఉద్యమం జరిగినప్పుడు బహిష్కృత విద్యార్థుల ప్రతినిధి బృందం అక్బర్ హైదరీని కలిసి సమస్యను తెలిపారు. దీంతో హైదరీ ముస్లిం మనోభావాలను గాయపరిచే అంశాలు వందేమాతర గేయంలో ఏమీ లేవని అంగీకరించి, ప్రార్థన మందిరంలో కాకుండా సామాజిక కార్యక్రమాల్లో గేయాన్ని పాడుకోవాలని సలహా ఇచ్చాడు. నిజాం రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణల కోసం 1937లో అరవముదు అయ్యంగార్​ అధ్యక్షతన రాజ్యాంగ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 1939లో నివేదిక ఇచ్చింది. 

చటారీ నవాబ్​

ఈయన 1941 నుంచి 1946 వరకు మొదటిసారి, 1947, మే 15 నుంచి నవంబర్ 1 వరకు హైదరాబాద్ దివాన్​గా పనిచేశాడు. ఈయన ఉత్తరప్రదేశ్​లో చటారీ అనే గ్రామంలో జన్మించాడు. ఉత్తరప్రదేశ్​కు చెందిన ఒక జాగీర్దార్​. హైదరాబాద్​ రావడానికి ముందు ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వంలో మంత్రిగాను, కొంతకాలం గవర్నర్ గా పనిచేశారు. చటారీ నవాబ్​ పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్​ పరిస్థితిని అంచనా వేసేందుకు సహచరులందరినీ విడివిడిగా కలిశాడు. భారత ప్రభుత్వంతో నిజాం ప్రభుత్వం యథాతథ ఒప్పందం కుదర్చుకోవడంలో చటారీ నవాబ్​ కీలక పాత్ర పోషించాడు. ఈ ఒప్పందం ఇష్టం లేని ఖాసీం రజ్వీ, అతని అనుచరులు చటారీ నవాబ్​ నివాసమైన షామంజిల్​పై దాడి చేశారు. 

సర్​ మీర్జా ఇస్మాయిల్​ 

1946లో చటారీ నవాబ్​ రాజీనామా అనంతరం సర్ మీర్జా ఇస్మాయిల్​ను దివాన్​గా నియమించారు. ఈయన మైసూర్, జైపూర్​లో చాలాకాలంపాటు దివాన్​గా పనిచేశాడు. మీర్జా ఇస్మాయిల్​ నియామకాన్ని మహమ్మద్​ అలీ జిన్నా, ఖాసీం రజ్వీ వ్యతిరేకించారు. మీర్జా ఇస్మాయిల్​కు కళాత్మక దృష్టి ఎక్కువ. హుస్సేన్​​సాగర్​లో ట్యాంక్​బండ్​పైన రోడ్డు పొడవున ఒక పెద్ద గోడ ఉండేది. దానిని మీర్జా ఇస్మాయిల్​ తొలగింపజేసి ఇనుప రేయిలింగ్​ను ఏర్పాటు చేయించాడు. ఈయన వికృతంగా కనిపించే నిర్మాణాలను కూలగొట్టి వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించే స్వభావం అధికంగా ఉండటం మూలంగా మీర్జాను తోడ్​ పోడ్​ మీర్జా అని ముద్దుగా పిలుచుకునేవారు. 1947లో వేసవిలో మీర్జా ఇస్మాయిల్​ తన స్వస్థలమైన బెంగళూరుకు వెళ్లి అక్కడి నుంచే రాజీనామా లేఖ పంపించాడు. 

సర్  అలీ ఇమామ్​

సాలార్​జంగ్​-3ను 1914లో దివాన్​ పదవి నుంచి తొలిగించాక ప్రధానిగా ఎవరినీ నియమించుకుండా మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ 1914 నుంచి 1919 వరకు ప్రధానిగా ప్రత్యక్ష పరిపాలన సాగించాడు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం బ్రిటీష్​ వారు ప్రత్యక్ష పాలనకు స్వస్తి చెప్పి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​పై ఒత్తిడి తెచ్చింది. దీంతో ఉస్మాన్​ అలీఖాన్​ మంత్రిమండలి స్థానంలో కార్యనిర్వహక మండలి పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యనిర్వాహక మండలిలో అధ్యక్షుడు, ఏడుగురు సాధారణ సభ్యులు, నిర్దిష్ట శాఖ లేని ఒక అసాధారణ సభ్యుడు ఉంటారు. బిహార్​కు చెందిన బారిష్టర్​ సర్​ అలీ ఇమామ్​ పూర్వం బ్రిటీష్​ వైశ్రాయ్​ కార్యనిర్వాహక మండలిలో సభ్యుడిగా పనిచేశాడు. మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేసే నాటికి బిహార్​, ఒరిస్సా కార్యనిర్వాహక మండలి సభ్యుడిగా పనిచేస్తూ ఉన్నాడు. దీంతో 1919లో ఏర్పాటు చేసిన నూతన కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు లేదా ప్రధానిగా సర్​ అలీ ఇమామ్​​ను మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ నియమించాడు. ఈయన శాసన వ్యవస్థలో సంస్కరణల కోసం హైకోర్టు న్యాయమూర్తి బాలముకుంద్​ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయించాడు. అలీ ఇమామ్​ కాలంలోనే శాసన వ్యవస్థ నుంచి న్యాయవ్యవస్థను వేరు చేశారు. 

మీర్​ లాయక్​​ అలీ

1947, నవంబర్ 30న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్​ దివాన్​గా మీర్ లాయక్​ అలీని నియమించాడు. ఈయన ప్రభుత్వంలో సహాయ ఇంజినీర్​గా వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. అక్బర్ హైదరీ సహకారంతో హైదరాబాద్​ కన్​స్ట్రక్షన్ కంపెనీని ప్రారంభించి నిజాం రాజ్యంలో గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. ఇత్తేహదుల్​ ముస్లిమిన్​ అనే సంస్థకు ఆర్థిక వనరులు సమకూర్చేవాడు. ఎంఐఎం అధ్యక్ష పదవికి ఖాసీం రజ్వీని ప్రతిపాదించినప్పుడు మీర్​ లాయక్​ అలీ అతని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించాడు. ఆ తర్వాత కాలంలో ఖాసీం రజ్వీ, మీర్ లాయక్​ అలీ సన్నిహితులయ్యారు. లాయక్​  అలీని హైదరాబాద్​ ప్రధానిగా నియమించడానికి ముందు ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ప్రతినిధిగా ఉండేవాడు. భారత్​లో హైదరాబాద్​ విలీనం అనంతరం మీర్ లాయక్​ అలీ తన మిత్రుడైన అబ్దుల్​ కులీ సహాయంతో గృహ నిర్బంధం నుంచి తప్పించుకొని పాకిస్తాన్​ పారిపోయాడు.