![సర్పంచ్ పదవికి రూ 27 లక్షలు.. గద్వాల జిల్లాలోని గోకులపాడులో వేలం పాట](https://static.v6velugu.com/uploads/2025/02/the-post-of-sarpanch-at-gokulapadu-in-gadwal-district-has-been-auctioned-for--27-lakhs_GlPtMvSk3D.jpg)
- నలుగురు పోటీ.. ఎక్కువ పాడినవారికి పదవి
- శివాలయం నిర్మాణానికి ఖర్చు పెట్టాలని తీర్మానం
గద్వాల, వెలుగు: స్థానిక ఎన్నికల నగారా మోగకముందే గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీల పదవులకు వేలం పాటలు జరుగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధి గోకులపాడు గ్రామ సర్పంచ్ పదవికి గ్రామస్తులందరూ కలిసి ఆదివారం వేలంపాట నిర్వహించారు. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు గ్రామానికి చెందిన భీమరాజు, సిద్దు, జయంతు, నరసింహులు పోటీపడ్డారు. చివరకు భీమరాజు అనే వ్యక్తి 27 లక్షల 60 వేల రూపాయలకు వేలంపాట పాడి, సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు.గ్రామంలో మొత్తం 450 మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 600 నుంచి 700 మంది జనాభా ఉన్నారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా నిర్ణయించుకొని, పకడ్బందీగా వేలం పాట నిర్వహించారు. ఎవరూ సెల్ ఫోన్లు తీసుకు రావొద్దనే నిబంధన పెట్టారు. దీంతో ఎక్కడా కూడా వేలం పాటకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రాలేదు.
ఆలయ అభివృద్ధి కోసం..
గ్రామంలో పెండింగ్‌లో ఉన్న శివాలయం గుడిని కంప్లీట్ చేసేందుకు ఈ వేలం పాట నిర్వహించాలని తీర్మానించుకున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో అందరూ పోటీపడి డబ్బులు వృథా చేసుకునే కన్నా.. ఇలా వేలం పాట నిర్వహించుకొని.. వచ్చిన డబ్బులును టెంపుల్ డెవలప్మెంట్కు వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నామని అంటున్నారు. ఇదిలా ఉండగా.. పదవి దక్కించుకున్న భీమరాజుకు ముగ్గురు పిల్లలు ఉన్నట్టు సమాచారం. స్థానిక సంస్థల రూల్స్ ప్రకారం ముగ్గురు పిల్లలు ఉన్న వారు సర్పంచ్, ఇతర లోకల్‌బాడీ ఎలక్షన్స్‌లో పోటీ చేసేందుకు అనర్హులు. దీంతో వేలం పాటలో దక్కించుకున్న పదవి భీమరాజుకు దక్కుతుందో లేదోననే చర్చ నడుస్తున్నది.