- గ్యారంటీపై ముందుకు రాని మిల్లర్లు
- ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టిన ఆఫీసర్లు
వనపర్తి, వెలుగు: ఈ సారి ఖరీఫ్ సీజన్లో సేకరించే వడ్లను సీఎంఆర్ చేయించేందుకు సివిల్ సప్లయ్ ఆఫీసర్లు అష్టకష్టాలు పడక తప్పని పరిస్థితి నెలకొంది. పెండింగ్ సీఎంఆర్ ఇవ్వక డిఫాల్టర్లుగా ఉన్న వారికి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వడ్లు ఇవ్వవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న మిల్లర్లలో 93 శాతం మంది మిల్లర్లు డిఫాల్టర్లే కావడం గమనార్హం. సీఎంఆర్ కేటాయింపులకు అర్హత ఉన్నవారు జిల్లాలో కేవలం 12 మందే ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
3.50 లక్షల టన్నులు నిల్వ చేయాల్సిందే..
జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు దిగుబడి వస్తుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. అందులో 50 వేల టన్నుల ధాన్యంలో కొంత విత్తనాలకు, తినడానికి బియ్యంగా మార్చుకునే అవకాశం ఉంది. ఈ సీజన్లో 377 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, 3.50 లక్షల టన్నుల వడ్లను కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెద్ద మొత్తంలో సేకరించిన వడ్లను ప్రతి సీజన్లో మిల్లర్లకు ఇచ్చి సీఎంఆర్ తీసుకుంటూ వస్తారు. ఈ సారి డిఫాల్టర్ మిల్లర్లకు ఇవ్వవద్దని నిర్ణయం తీసుకోవడంతో సేకరించిన వడ్లను నిల్వ చేసేందుకు అధికారులు గోదాములను సిద్దం చేస్తున్నారు.
మార్కెటింగ్, స్టేట్ వేర్ హౌసింగ్ ఇలా పలు సంస్థల గోదాముల్లో 2.28 లక్షల టన్నులు నిల్వ చేయనున్నారు. ఇంకా అవసరమైతే జడ్చర్ల, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని ప్రైవేటు గోదామ్లను పరిశీలిస్తున్నారు. మిల్లులు ఎక్కువగా ఉండి దిగుబడి తక్కువగా ఉన్న మహబూబ్నగర్, గద్వాల జిల్లాలతో పాటు పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు వడ్లను తరలించాలని యోచిస్తున్నారు.
గ్యారంటీతో ముందుకు రాని మిల్లర్లు
వడ్లను సీఎంఆర్గా ఇచ్చే విషయంలో గతంలో మిల్లర్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఇచ్చే వడ్లలో 25 శాతం గ్యారంటీ ఇస్తేనే సీఎంఆర్ కేటాయిస్తామని సర్కారు షరతు పెట్టింది. ఇటీవల మిల్లర్లతో సమావేశమైనప్పుడు గ్యారంటీ విషయంలో తాము ఆలోచించుకొని చెబుతామని దాటవేశారు. అలా సీఎంఆర్కు ముందుకు రాకపోతే నిబంధనల ప్రకారం ట్రేడింగ్ చేసే రైస్ మిల్లు 50 శాతం సీఎంఆర్, మరో 50 శాతం ట్రేడింగ్ చేసుకోవాలి. ఇలా మిల్లర్ల నుంచి సీఎంఆర్ చేయించే అవకాశాన్ని ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు.
సీఎంఆర్ ఆగదు
ఈ సారి దొడ్డు రకాలు, సన్న రకాలను విడివిడిగా కొంటాం. కొన్న వడ్లను గోదాముల్లో నిల్వ ఉంచి విడతల వారీగా సీఎంఆర్ చేయిస్తాం. సీఎంఆర్ సేకరణలో ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. స్థానిక మిల్లర్లతో పాటు ఎక్కడ మిల్లు అందుబాటులో ఉంటే అక్కడికి వడ్లు పంపి సీఎంఆర్ చేయిస్తాం.
వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్, వనపర్తి