బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.. కొండగట్టు బస్సు ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆనాటి ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను, గాయపడిన వారిని పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. బస్సు ప్రమాద మృతుల ఫొటోలు, ఫ్లెక్సీల వద్ద పూలు చల్లి.. నివాళులర్పించారు. అంతకుముందు.. కొండగట్టు బస్టాండ్ సమీపంలో ఉన్న "ఆంజనేయ స్వామి" విగ్రహానికి పూలమాలవేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాలుగేళ్ల క్రితం కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాదంలో 65 మంది చనిపోయిన విషయం తెలిసిందే. నేటికీ బాధిత కుటుంబాలను కేసీఆర్ సర్కార్ ఆదుకోలేదని బీజేపీ విమర్శిస్తోంది. కనీసం బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించలేదనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. కొండగట్టులో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్.. బస్సు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బండి సంజయ్ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ఇవాళ ఉదయం కొండగట్టు నుంచి ప్రారంభమైంది. కొండగట్టు గ్రామంలోకి బండి సంజయ్ పాదయాత్ర చేరుకోగానే స్థానిక బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఇవాళ కరీంనగర్ జిల్లా గంగాధర ఎక్స్ రోడ్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. చొప్పదండి నియోజకవర్గంలోని పూడూరు వెంకటయపల్లి ఎక్స్ రోడ్, ఇస్లాంపూర్, నమిలికొండ, తుర్కసినగర్, గంగాధర ఎక్స్ రోడ్ లో పాదయాత్ర కొనసాగనుంది.
దాదాపు 15 కిలోమీట్లర వరకూ ఇవాళ పాదయాత్ర చేయనున్నారు. ఈనెల 15వ తేదీన కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో యాత్ర ముగింపు సభ జరగనుంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరుకానున్నారు.