
గ్రూప్-1లో ప్రిలిమ్స్ సిలబస్ వివరణాత్మకంగా లేదు. ఇండియన్ పాలిటీ, కానిస్టిట్యూ షన్ అని మాత్రమే ఇచ్చారు. మెయిన్స్‌లో మాత్రం సిలబస్ వివరణాత్మకంగా ఉంది. కాబట్టి, మెయిన్స్ ఆధారంగా సిలబస్‌ను విభజించి చదువుకోవాలి. బేసిక్స్, ప్రభుత్వం, ఫెడరలిజం, ఇతర ముఖ్యమైన అంశాలుగా విభజన చేయడంతో ప్రిపరేషన్ సులువవుతుంది. మొదట పాలిటీ బేసిక్స్ తెలుసుకోవాలి. రాజ్యాంగ పీఠిక, రాజ్యాంగ విశిష్ట లక్షణాలు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు బేసిక్స్‌గా చెప్పవచ్చు. ప్రిలిమ్స్‌లో పాలిటీ, గవర్నెన్స్ నుంచి 15–-20 ప్రశ్నలు ఇస్తారు. బేసిక్స్‌పైనే 6-–8 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు పౌరులకు సంబంధించినవి. అందుకే ప్రశ్నలు ఎక్కువగా అడుగుతుంటారు. ముఖ్యంగా ప్రాథమిక విధుల నుంచి కచ్చితంగా ప్రిలిమ్స్‌లో ప్రశ్న వస్తుంది. ఏ సంవత్సరంలో ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపర్చారు? ఏ ఆర్టికల్? ఏ రాజ్యాంగ సవరణ? ఒరిజినల్‌గా 10 ప్రాథమిక విధులు ఉన్నాయి. 11వ ప్రాథమిక విధి ఏమిటి? 11వ ప్రాథమిక విధిని ఎప్పుడు చేర్చారు? రాజ్యాంగ సవరణ ఏమిటి? అనే మౌలిక అంశాలు ప్రిలిమినరీ స్థాయిలో ముఖ్యం. విశ్లేషణాత్మక ధోరణిలో మెయిన్స్‌లో ప్రశ్నలు వస్తాయి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ప్రతి గ్రూప్-1 ఎగ్జామ్ మెయిన్స్‌లో తప్పకుండా రాజ్యాంగ పీఠిక నుంచి ప్రశ్న ఇచ్చారు. ప్రాథమిక హక్కులకు, విధులకు సంబంధం ఏమిటి? రెండింట్లో ఏది ముఖ్యం? ఉదాహరణకు ప్రశ్నలు చూద్దాం.
పిల్లలను బడికి పంపడం? (ప్రిలిమ్స్ ప్రశ్న)
జవాబు: ప్రాథమిక విధి
ప్రాథమిక హక్కులకు, విధులకు మధ్య సంబంధం ఏమిటి? (మెయిన్స్ ప్రశ్న)
ఆదేశిక సూత్రాల్లో వీటిపై ఫోకస్
ఆదేశిక సూత్రాలలో ‘కామన్ సివిల్ కోడ్’ ప్రిలిమ్స్, మెయిన్స్‌లో చాలా ముఖ్యమైన అంశం. 44వ అధికరణ ఉమ్మడి పౌరస్మృతి గురించి చెబుతుంది. దేశంలో వివాహం, విడాకులు, ఆస్తి పంపకం వంటి సివిల్ అంశాలు ఒక్కో మతంలో ఒక్కో విధంగా ఉన్నాయి. అలాకాకుండా అన్ని మతాలకు ఒకే రకమైన సివిల్ చట్టాలను ఏర్పాటు చేయడమే యూనిఫామ్ సివిల్ కోడ్. ‘రాజ్యాంగం అమలులోకి వచ్చి 72ఏళ్లలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయడం సాధ్యం కాలేదు. ఇప్పుడు సాధ్యమవుతుందా’ అని గ్రూప్-1 మెయిన్స్‌లో క్వశ్చన్ అడగవచ్చు. ప్రిలిమ్స్‌కు వచ్చేసరికి యూనిఫామ్ సివిల్ కోడ్‌పై కానిస్టిట్యూషనల్ ప్రొవిజన్ అడుగుతాడు. దానిపైన ఉన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్లపై ప్రశ్నలు రావచ్చు. ఉదాహరణకు సుప్రీంకోర్టు ఏ తీర్పులో యూనిఫామ్ సివిల్ కోడ్‌ను రూపొందించాలని సూచించింది? యూనిఫామ్ సివిల్ కోడ్‌కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన 4 ప్రధానమైన తీర్పులు ఉన్నాయి. వాటిలో దేనిపైనైనా ప్రశ్నలు రావొచ్చు. లేకపోతే ఏ ఆర్టికల్ లో కామన్ సివిల్ కోడ్ ఉందని అడగవచ్చు. మరికొన్ని ప్రశ్నలు చూద్దాం.
ఇప్పటికే ఏ రాష్ట్రంలో కామన్ సివిల్ కోడ్ అమలులో ఉంది?
జవాబు: గోవా
పై ప్రశ్నను కొద్దిగా మార్పు చేసి ఇలా అడగవచ్చు.
ఏ రాష్ట్రంలో కామన్ సివిల్ కోడ్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు?
జవాబు: ఉత్తరాఖండ్
ప్రభుత్వం కంపారిటీవ్‌గా చదవాలి
దేశంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ, యూనియన్ గవర్నమెంట్‌లో కార్యనిర్వహకశాఖ అంటే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, మంత్రి మండలి, స్టేట్ గవర్నమెంట్‌లో ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నర్, చీఫ్ మినిస్టర్, మంత్రి మండలి, యూనియన్ జ్యుడీషియరీ సుప్రీంకోర్టు, స్టేట్ జ్యుడీషియరీ హైకోర్టు.. వీటిని కంపారిటివ్‌గా చదువుకోవాలి. అంటే రాష్ట్రపతి, గవర్నర్, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి మండలి, రాష్ట్ర మంత్రి మండలి, పార్లమెంట్, రాష్ట్ర శాసన శాఖ, సుప్రీంకోర్టు, హైకోర్టు వంటి అంశాలను ఒక్క దానితో మరొకటి పోల్చుతూ చదువుకోవాలి. 73, 74 రాజ్యాంగ సవరణలను కంపారిటివ్‌గా చదువుకుంటే చాలా సింపుల్‌గా కంప్లీట్ అవుతుంది. ఇందులోని అధికరణల్లో 80శాతం సిమిలర్‌గా ఉంటాయి. కాబట్టి, ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు.
ఇతర ముఖ్యమైన అంశాలు
ఇతర ముఖ్యమైన అంశాల్లో భాష, భూభాగం, అత్యవసర అధికారాలు, పౌరసత్వం, సంక్షేమ యంత్రాంగం, ఎన్నికల అంశాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో పౌరసత్వ అంశాలు వివాదాస్పదం అవుతున్నాయి. 2019లో తీసుకువచ్చిన సిటిజన్ అమెండ్‌మెంట్(సీఏఏ) యాక్ట్ తెలంగాణ గ్రూప్-1లో ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే, సీఏఏ, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్‌ను తెలంగాణలో అమలు చేయడానికి సుముఖంగా లేమని శాసనసభలో తీర్మానం చేసి పంపించారు. అంతేకాకుండా ఇటీవల కేంద్ర హోంమంత్రి దేశంలో పూర్తిస్థాయిలో కరోనా తగ్గిపోగానే సీఏఏను అమలు చేస్తామని ప్రకటించారు. దానిపై ప్రశ్న అడగవచ్చు. సంక్షేమ యంత్రాంగంలో రాజ్యాంగ నిబంధనలు తెలుసుకోవాలి. మరో ముఖ్యమైన చాప్టర్ ఎన్నికల వ్యవస్థ. దీనిపై ఎక్కువ ఫోకస్ చేయాలి.
ఇంటిగ్రేటెడ్‌గా చదవాలి
ప్రిలిమ్స్, మెయిన్స్ కోసం వేర్వేరుగా చదవకూడదు. ఇంటిగ్రేటెడ్‌గా చదవాలి. ప్రిలిమ్స్ స్థాయిలో రాజ్యాంగ నిబంధనలు, వాటికి సంబంధించిన చట్టాలు, ఆ చట్టాలపై వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చిన సుప్రీంకోర్టు తీర్పులపై ప్రశ్నలు వస్తాయి. ఉదాహరణకు కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ మౌలిక లక్షణాలపై ప్రిలిమ్స్‌లో క్వశ్చన్ అడుగుతారు. కేసులు, తీర్పులు, తదితర వివరాలతో మెయిన్స్ స్థాయిలో ప్రశ్న రాదు. కానీ, రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏమిటి? అసలు రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేది ఉన్నదా లేదా? అని క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. పైన అంశాలను ప్రిలిమ్స్ స్థాయిలో 40 నుంచి 50 గంటలు, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ కోసం 50 నుంచి 60 గంటలు చదవాలి. తెలుగు అకాడమీలో ‘పోటీ పరీక్షల కోసం భారత రాజ్యాంగం’ పుస్తకం ప్రిలిమ్స్‌కు ఉపయోగపడుతుంది. మెయిన్స్ కోసం బీఏ సెకండియర్ పొలిటికల్ సైన్స్‌లో భారత ప్రభుత్వ, రాజకీయాలు అనే పుస్తకం సరిపోతుంది.
సుప్రీంకోర్టు తీర్పులు కీలకం
పాలిటీలో అంశాలు చదివేటప్పుడు సుప్రీంకోర్టు తీర్పులపై పట్టుండాలి. జడ్జిమెంట్ల పేరు తెలిసి ఉండాలి. కేసు ఎవరు పెట్టారు? ఎవరి మీద పెట్టారు? ఇలాంటి అంశాలపై ఫోకస్ ఉండాలి. ప్రిలిమ్స్‌కు వస్తే రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు న్యాయపరమైన అంశాలు గణనీయంగా ఉన్నాయి. న్యాయపరమైన దృక్పథంతో ఈ అంశాలను చదవాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌లో న్యాయపరమైన దృక్పథంతో ప్రశ్నలు ఉంటాయి. 2016లో జరిగిన తెలంగాణ గ్రూప్-2లో 10 నుంచి 15 ప్రశ్నలు న్యాయపరమైన అంశాలపై వచ్చాయి. ఆ సంప్రదాయాన్ని మళ్లీ కొనసాగించే అవకాశం ఉంది.
ఫెడరలిజంలో వివాదాలు ఇంపార్టెంట్
ఫెడరలిజంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, అంతర్రాష్ట్ర సంబంధాలు ఉంటాయి. కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, పాలన, ఆర్థిక సంబంధాలు, రెండు రాష్ట్రాల మధ్య నదీ జల వివాదాలు ఉండవచ్చు. సరిహద్దు వివాదాలు ఉండవచ్చు. ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా, గోవావరి నదీ జల వివాదాలు, పోలవరం ప్రాంతంలో సరిహద్దు వివాదాలు. ప్రిలిమ్స్‌లో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, అంతర్రాష్ట్ర సంబంధాలపై రాజ్యాంగ నిబంధనలపై ప్రశ్న అడుగుతారు. మెయిన్స్‌లో వివాదాలపై ప్రశ్నలు వస్తాయి. కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన అంశాలు ఏమి ఉన్నాయి. ఉదాహరణకు పాలన సంబంధాలు గవర్నర్ కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వివాదాస్పదంగా మారడం. ఈ విషయంలో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థపై వివాదాలు ఉన్నాయి. ప్రభుత్వ విధానాలను టీఎస్‌పీఎస్సీ సమర్థించాల్సి ఉంటుంది. ఉదాహరణకు గవర్నర్ వ్యవస్థను రద్దుపై వ్యాఖ్యానించండి? అని అడిగే చాన్స్ ఉంది.