- బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు
- ధరణిలో ఎక్కితేనే ఇస్తామంటున్న ఆఫీసర్లు
- పెట్టుబడులకు ఇబ్బందులు పడుతున్న గిరిజనులు
- సర్కార్ పట్టాలిచ్చినా ఫలితం లేదని ఆవేదన
మంచిర్యాల, వెలుగు: ఫారెస్ట్ భూముల్లో పోడు వ్యవసాయం చేసుకునే గిరిజన రైతులకు గత ప్రభుత్వం ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్ కింద పట్టాలు ఇచ్చింది. ధరణిలోఎక్కించకపోవడంతో బ్యాంకుల్లో క్రాప్లోన్లు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఫారెస్ట్పట్టాల వివరాలు ధరణి పోర్టల్‌లో నమోదైతేనే ఇస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో పంట పెట్టుబడులకు పైసల్లేక వడ్డీలకు తెచ్చుకుంటున్నారు. మరోవైపు ఆ భూములను ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఎప్పుడైనా స్వాధీనం చేసుకోవచ్చనే ప్రచారం జరుగుతుండడంతో తమకు దక్కవేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని గిరిజన రైతులు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
కొత్త రూల్స్‌తో ఇబ్బందులు
రాష్ర్టవ్యాప్తంగా పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పట్టాలు ఇచ్చేందుకు బీఆర్ఎస్ హయాంలో గత మూడేండ్ల కింద దరఖాస్తులు తీసుకుంది. జిల్లావ్యాప్తంగా 13 వేల మందికిపైగా రైతులు దాదాపు 38 వేల ఎకరాలకు అప్లై చేసుకున్నారు.
రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటుండగా ఫారెస్ట్డిపార్ట్మెంట్కూడా నిర్ధారణ చేశాకనే యాజమాన్య హక్కులు కల్పించింది. గతేడాది 2,500 ఎకరాలకు ఆర్ వోఎఫ్ఆర్యాక్ట్ కింద పట్టాలు పంపిణీ చేశారు. ఇలా పట్టాలు పొందిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, చెన్నూరుఅసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు దండేపల్లి, జన్నారం మండలాల్లోని రైతులు సాగు చేసుకుంటున్నారు. అయితే ధరణి పోర్టల్‌లో ఎంట్రీ అయిన పట్టాలకే క్రాప్లోన్లు ఇవ్వాలని ప్రస్తుత ప్రభుత్వం కొత్త రూల్స్తీసుకొచ్చింది. కానీ ఫారెస్ట్ భూములకు ఇచ్చిన పట్టాలను ధరణిలో ఎంట్రీ చేయలేదు. ఈ కారణంగా బ్యాంకర్లు క్రాప్ లోన్లు ఇవ్వకపోతుండగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
కలెక్టర్‌ను కలిసిన బాధిత రైతులు
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి పంచాయతీ పరిధి దాంపూర్ కు చెందిన పలువురు గిరిజన మహిళా రైతులు గత సోమవారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ లో క్రాప్ లోన్లపై కలెక్టర్ కుమార్ దీపక్ కు ఫిర్యాదు చేశారు. దాదాపు 50 మంది రైతులకు అటవీహక్కు పత్రాలను బీఆర్ఎస్ హయాంలో అందజేశారని తెలిపారు.
దశాబ్దాలుగా భూములను సాగు చేసుకుంటున్నామని, పట్టాలు వచ్చి రెండు మూడేండ్లు అవుతుండగా.. బ్యాంకర్ల క్రాప్ లోన్లు ఇవ్వడం లేదని కలెక్టర్ కు విన్నవించారు. ఉన్నతాధికారులు స్పందించి ఫారెస్ట్ పట్టాలకు లోన్లు శాంక్షన్ చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
పంట పెట్టుబడి వడ్డీకి తెచ్చుకుంటున్నం
వారసత్వంగా మా భూములను సాగు చేసుకుంటున్నం. మూడేండ్ల కింద నాకు పట్టా ఇచ్చిన్రు. క్రాప్‌లోన్ కోసం బెల్లంపల్లిలోని గ్రామీణ బ్యాంక్‌కు పోతే లోన్రాదంటున్రు. ఫారెస్టు పట్టాలు ధరణిలోఎక్కలేదని, అందుకే లోన్లు ఇవ్వలేమని చెప్తున్రు. పంట పెట్టుబడికి పైసల్లేక వడ్డీకి తెచ్చుకుంటున్నం. మాకు లోన్లు వచ్చేలా సర్కారు న్యాయం చేయాలె. - అయిద అమ్మక్క, దాంపూర్
ధరణిలో ఎంట్రీ అయితేనే లోన్లు
ఫారెస్ట్భూముల పట్టాలకు గతేడాది వరకు క్రాప్లోన్లు ఇచ్చినం. ఈ ఏడాది నుంచి ధరణిలో ఎంట్రీ అయిన పట్టాలకే లోన్లు ఇవ్వాలన్న రూల్వచ్చింది. దీంతో ధరణిలో ఎక్కని ఫారెస్ట్ పట్టా భూముల రైతులకు లోన్లు ఇవ్వలేకపోతున్నాం. దీనిపై బ్యాంక్ ఉన్నతాధికారులు, రెవెన్యూ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాం. సమస్యను ప్రభుత్వమే పరిష్కరించాలి. -నరేందర్, టీజీబీ, బెల్లంపల్లి