పీవీ గ్రామాలు ఏడియాడనే

  •     బిల్లులు రాక వంగరలో మధ్యలోనే నిలిచిపోయిన పనులు
  •     కొత్త ప్రభుత్వంపైనే ఆశలు.. 
  •     రేపు పీవీ వర్ధంతి

హనుమకొండ/ భీమదేవరపల్లి, వెలుగు : మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు పుట్టి పెరిగిన గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంటున్నాయి. అభివృద్ధి లేకపోవడంతో పీవీ పుట్టిన లక్నెపల్లి, పెరిగిన వంగర గ్రామాలను టూరిస్ట్  స్పాట్లుగా తీర్చిదిద్దుతామని గత బీఆర్ఎస్ ​సర్కారు ప్రకటించినప్పటికీ సకాలంలో ఫండ్స్​ రిలీజ్​ చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. సుమారు రూ.11 కోట్ల అంచనాతో పనులు చేపట్టగా..

మొదలైన అరకొర పనులు కూడా నిధులు విడుదలకాక అర్ధంతరంగా ఆగిపోయాయి. పీవీ శత జయంతి ఉత్సవాల నాటికే పనులన్నీ పూర్తి చేస్తామని మాజీ సీఎం కేసీఆర్​ ప్రకటించగా.. ఇంతవరకు అవి పూర్తికాకపోవడంతో గ్రామస్థుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్​ ప్రభుత్వమైనా పీవీ స్వగ్రామాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

శతజయంతి సందర్భంగా ఎన్నో హామీలు

పీవీ నరసింహారావు వరంగల్  జిల్లాలోని లక్నేపల్లిలో 1921 జూన్ 28న పుట్టారు.  ప్రస్తుత హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో పెరిగారు. 2004 డిసెంబర్ 23న మరణించారు. ఆయన మరణం తరువాత ఆయన స్వగ్రామాలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2020 జూన్​ 28 నుంచి 2021 జూన్​ 28 వరకు పీవీ శత జయంతి ఉత్సవాల పేరుతో బీఆర్ఎస్​ సర్కారు హడావుడి చేసింది. ఆయన శత జయంతి వేడుకల్లో భాగంగా అప్పటి సీఎం కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారు. పీవీ పుట్టిన లక్నెపల్లి, పెరిగిన వంగర గ్రామాలను టూరిజం స్పాట్లుగా డెవలప్  చేస్తామని

  అసెంబ్లీలో ఆయన విగ్రహం కూడా పెడతామని కేసీఆర్  చెప్పారు. పీవీతో సంబంధం ఉన్న వంగర, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, ఢిల్లీలో ఆయన విగ్రహాలు పెడతామని హామీ ఇచ్చారు. కాకతీయ యూనివర్సిటీలో రూ.3 కోట్లతో పీవీ విజ్ఞాన పీఠం కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ, ఆయా పనులన్నీ ఇంకా కాగితాల దశలోనే ఉండిపోయాయి. వంగర, లక్నేపల్లి  గ్రామాల్లో ఇప్పటికీ ఇంటర్నల్​ రోడ్లు, డ్రైనేజీలు సరిగా లేక జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గ్రామాలకు చుట్టుపక్కల ఊర్ల నుంచి వెళ్లే రోడ్లు కూడా గుంతలుగా మారాయి. లక్నేపల్లిలో కల్చరల్ సెంటర్

వరంగల్​ నుంచి వంగర వరకు డబుల్​ రోడ్డు, రోడ్డుకు ఇరువైపులా బ్యూటిఫికేషన్, ముల్కనూరు నుంచి వంగర వచ్చే మార్గంలో ఆర్చి, గ్రామంలోని కైలాసనాథ టెంపుల్​ బ్యూటిఫికేషన్​ చేస్తామని బీఆర్ఎస్​ లీడర్లు చెప్పారు. వంగర చెరువును మినీ ట్యాంక్​గా చేసి అందులోనే సస్పెన్షన్​ బ్రిడ్జి, ఏడెకరాల్లో స్మృతివనం, చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే రోడ్లను డెవలప్ చేస్తామని పేర్కొన్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ఎక్కడిపనులు అక్కడే ఉండిపోయాయి.

కాంట్రాక్టర్​కు బిల్లులు పూర్తిగా చెల్లించలే

వంగర గ్రామంలో చేపట్టే వివిధ పనులకు దాదాపు రూ.11 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేయగా..   డీఎంఎఫ్​టీ నిధులతోనే ఆయా పనులన్నీ  చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు టూరిజం శాఖకు బాధ్యతలు అప్పగించారు. అయితే, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్  ఇప్పటి వరకు ఆడిటోరియం, ఓపెన్​ థియేటర్, సైన్స్​ మ్యూజియం, మెడిటేషన్​ సెంటర్, ఆర్ట్​ గ్యాలరీ ఇలా సుమారు రూ.6.20 కోట్ల విలువైన పనులు చేపట్టాడు. వాటికి ఇంత వరకు రూ.5.7 కోట్ల వరకు మాత్రమే బిల్లులు చెల్లించినట్లు తెలిసింది.

మిగతా బిల్లులు పెండింగ్​ లో ఉండడంతో సదరు కాంట్రాక్టర్​ పనులు మధ్యలోనే ఆపేశాడు. దీంతో దాదాపు మూడు నెలలుగా పనులు ముందుకు సాగడం లేదు. అలాగే చిల్డ్రన్స్  పార్క్, పీవీ విగ్రహం  వద్ద గార్డెనింగ్, ఫౌంటెయిన్ నిర్మాణం, స్వాగత తోరణం, వంగర వరకు డబుల్ రోడ్డు, వంగర చెరువు బ్యూటిఫికేషన్​, పీవీ ఇంటి ఆధునికీకరణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు.

పీవీ గ్రామాలను టూరిజం స్పాట్లుగా మార్చాలి

పీవీ శతజయంతి ఉత్సవాల కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించగా.. కమిటీ సిఫార్సులతో హైదరాబాద్  నెక్లెస్ రోడ్డు పేరును పీవీ జ్ఞానమార్గ్ గా మార్చి అక్కడ పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పీవీ రచనలు, ఆయన జీవిత విశేషాలతో  9 పుస్తకాలు పబ్లిష్  చేశారు. కానీ,  మిగతా పనులపై మాత్రం పెద్దగా దృష్టి పెట్టలేదు. పీవీతో సంబంధం ఉన్న జిల్లాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయలేదు. దీంతో పీవీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హనుమకొండలో ఏకశిలా ఎడ్యుకేషన్  సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహమే దిక్కవుతోంది.

ఇక వంగరలో దాదాపు 16  ఏండ్ల కిందట పీవీ కుమారులు ఏర్పాటు చేసుకున్న విగ్రహం వద్దే పొలిటికల్  లీడర్లు, అభిమానులు నివాళులు అర్పించాల్సిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇవ్వగా.. అందులో చాలావరకు కాగితాల దశలోనే ఆగిపోయాయి. కాగా, పీవీ కాంగ్రెస్​ పార్టీలో పని చేయడం, ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీ  ప్రభుత్వమే ఏర్పడడంతో ఆయా గ్రామాల ప్రజలు పీవీ ఊర్ల అభివృద్ధిపై ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో మొదలైన పనులను సకాలంతో పూర్తి చేయడంతో పాటు పీవీ గ్రామాలను టూరిజం స్పాట్లుగా మార్చాలని పీవీ అభిమానులు, గ్రామస్థులు కోరుతున్నారు.

పీవీ గ్రామాలకు ప్రాధాన్యం ఇవ్వాలి 

 పీవీ నరసింహారావు పుట్టి పెరిగిన గ్రామాలు నిరాదరణకు గురయ్యాయి. దీంతో గ్రామాలు అభివృద్ధికి నోచుకోకుండా పోయాయి. పీవీ గ్రామాలను డెవలప్​ చేస్తామని గత నాయకులు హామీలు ఇచ్చి పట్టించుకోలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైనా తగిన చర్యలు తీసుకొని పీవీ గ్రామాలను అభివృద్ధి చేసి, ఆయనకు సముచిత గౌరవం ఇవ్వాలి. 

 మాట్ల వెంకటస్వామి, వంగర

మాటలు తప్ప ఆచరణ లేదు

గత ప్రభుత్వం పీవీ నరసింహారావు గ్రామాలను డెవలప్​ చేస్తామని మాటలు చెప్పింది తప్ప ఆచరణలో చూపలేదు. దేశానికి ఎన్నో సేవలందించిన పీవీ గ్రామాలకు నిధులు సక్రమంగా విడుదల చేయక గత ప్రభుత్వం అవమానించింది. ఇకనైనా పీవీ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.    -

వెంకట్​ రెడ్డి, వంగర