మిర్చి ధరలు ఢమాల్‍

  • మిర్చి ధరలు ఢమాల్‍
  • రెండు రోజుల్లో భారీగా పతనమైన ధరలు
  • క్వింటాల్​కు రూ.5 వేల వరకు తగ్గించిన్రు
  • ఆందోళనలో రైతులు

వరంగల్‍/హనుమకొండ/ ఖమ్మం టౌన్, వెలుగు : వరంగల్‍ ఏనుమాముల మార్కెట్లో బుధవారం మిర్చి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. రెండు రోజుల క్రితం మంచి ధర ఉందని రైతులు మార్కెట్​కు పంట తీసుకువచ్చారు. కానీ వ్యాపారులు ఒక్కసారిగా ధరలు తగ్గించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్‍గా వచ్చే తేజ, 341 రకాలపై క్వింటాలుకు రెండు రోజుల్లో రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు ధర తగ్గింది. పచ్చళ్ల కంపెనీలు ఎక్కువగా వాడే దేశీ, సింగిల్‍పట్టి మిర్చి క్వింటాల్‍కు ఏకంగా రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ధరలు పడిపోయాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ఎంతో ఆశతో పంటను అమ్ముకోడానికి వచ్చిన రైతులకు కన్నీరే మిగిలింది. ఇంటిల్లిపాది చేసిన కష్టంపోనూ.. కనీసం పెట్టుబడి ఖర్చు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు కావాలనే సిండికేట్‍గా మారి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. 

35 వేల మిర్చి బస్తాలు..

ఏనుమాముల మార్కెట్‍కు రైతులు బుధవారం 35 వేల మిర్చి బస్తాలు తీసుకొచ్చారు. మంగళవారం వచ్చినవాటిలో  7నుంచి 8 వేల బస్తాలు విక్రయం కాకుండా ఆగాయి. మొత్తంగా దాదాపు 40 వేల బస్తాలు ఉన్నాయి. కాగా వ్యాపారులు డిసైడ్‍ చేసిన ధరలను చూసి రైతులు లబోదిబోమన్నారు. సోమ, మంగళవారాలతో పోలిస్తే క్వింటాల్‍ మిర్చి ధర గరిష్ఠంగా రూ. 5 వేల వరకు తగ్గించడంతో ఆందోళన చెందారు. రెండు రోజుల ముందు యూఎస్‍ 341 రకం క్వింటాల్​రూ. 22,700 పలకగా బుధవారం రూ.17 వేల నుంచి రూ.17,500 కట్టిస్తామన్నారు. తేజ రకం క్వింటాల్‍ 16,500కి తగ్గించారు. దేశీ రకం క్వింటాల్​రూ. 75 వేల నుంచి రూ.80 వేల వరకు పలకగా.. బుధవారం రూ.50 వేలకు పడిపోయింది. సింగిల్‍ పట్టి రూ. 65 వేల నుంచి రూ. 40 వేలకు పడిపోయింది. 

జెండా పాట కంటే రూ. 2 వేలు తక్కువకు..

సాధారణంగా మార్కెట్‍ మొదలవగానే పంట క్వాలిటీ ఆధారంగా రైతులు, అధికారుల సమక్షంలో వ్యాపారులు మిర్చి రకాన్ని బట్టి ‘జెండా పాట’  పేరుతో ధర నిర్ణయిస్తారు. ఆ రోజు ఆ తరహా క్వాలిటీ మిర్చికి రైతులకు అంతే ధర కట్టించాల్సి ఉంటుంది. ఇక్కడే మెజార్టీ వ్యాపారులు అధికారులతో కలిసి రైతులను మోసం చేస్తున్నారు. జెండా పాట ధర కట్టించడం లేదు. క్వాలిటీ లేదని, మిర్చికి మచ్చ ఉందని సవాలక్ష సాకులు చూపి ఘోరంగా రేటు తగ్గిస్తున్నారు. మంగళ, బుధవారాల్లో తేజ, యూఎస్‍ -341 రకం జెండా పాట దాదాపు రూ. 22,700 నుంచి రూ.21,200 నడిచింది. వ్యాపారులు చాలామంది రైతులకు కేవలం 16,500 నుంచి రూ.18వేల వరకే ధర కట్టించారు. ఖమ్మం ఏఎంసీ మార్కెట్లో తేజ మిర్చికి మంగళవారం రూ. 24,500 జెండా పాట పెట్టారు. ధర బాగుందని బుధవారం పెద్ద సంఖ్యలో రైతులు పంటను మార్కెట్​కు తీసుకువచ్చారు.ఇదే అదునుగా వ్యాపారులు జెండా పాట ధర రూ. 1,400 తగ్గించి రూ.23,100 గా నిర్ణయించారు. 

బస్తాకు 49 కిలోల నిబంధనతో ఆగం 

వరంగల్‍ ఏనుమాముల మార్కెట్‍లోకి సీజన్‍లో రోజు దాదాపు 50 వేల మిర్చి బస్తాలొస్తున్నాయి. అధికారులు ఒక్కో బస్తాలో సగటున 25 కిలోల నుంచి 49 కిలోల వరకే ఉండాలనే నిబంధన పెట్టారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మాదిరి 50 నుంచి 55 కిలోల బరువుతో వచ్చే మిర్చి బస్తాలను తీసుకోవడం లేదు. 49 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటే తరుగు పేరుతో ఇష్టారీతిన 2 కిలోల వరకు దోచుకుంటున్నారు. అదే టైంలో రైతులు కొత్తగా గన్నీ సంచులు కొనాల్సి వస్తోంది. కాంటాల వద్ద ఒక్కో సంచి చొప్పున చార్జీలు కట్టించుకుంటున్నారు. ఇంటి నుంచి పంటను మార్కెట్‍ కు తరలించే క్రమంలో బస్తాల చొప్పున రవాణా చార్జీలు పెట్టుకోవాల్సి వస్తోంది. ఈ సమస్యపై మూడుసార్లు అధికారులు, వ్యాపారులతో మీటింగ్‍ పెట్టిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు, ఎమ్మెల్యేలు చివరకు వ్యాపారులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏప్రిల్ 1 నుంచి వ్యాపారులు 49 కిలోల కంటే ఎక్కువ బరువుండే బస్తాలను తీసుకొచ్చే రైతులను ఆగమాగం చేస్తున్నారు. రైతుల పక్షాన నిలవాల్సిన మార్కెట్‍ పాలకవర్గం, అధికారులు వ్యాపారులకు లాభం చేకూర్చేలా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జెండా పాట అమలు చేయడంలో విఫలం అవుతున్నారు. తేమ పేరుతో కిలోలకొద్ది పంటను తీసుకుంటున్నా ఆపడం లేదు. తరుగు, ధర్మం పేరుతో  మోసాలు చేస్తున్నా కట్టడి చేయడం లేదు. 

వ్యాపారులు సిండికేట్‍ అవుతున్నరు

ఏనుమాముల మార్కెట్లో మంగళవారం ఉన్న ధరలు ఇప్పుడు లేవ్‍. సోమ, మంగళ వారాల్లో తేజ, 341 రకానికి క్వింటాలు రూ.23 వేలు కట్టించిన వ్యాపారులు బుధవారం ఒక్కసారిగా 16 వేల నుంచి 17 వేలలోపే ధర అంటున్నరు. అఫిషియల్‍గా జెండా పాట ధరనే రూ.1,500 వరకు తగ్గగా ఖరీదుదారులు వారిష్టం ఉన్నట్లు మరో రూ. 3 వేలు తగ్గించి ధర కడుతున్నారు. ఇదేంటని అడిగితే అంతా సిండికేట్​ అవుతున్నారు. మేం చెప్పిందే ధర అన్నట్లు మాట్లాడుతున్నారు. లేదంటే కొనం అంటున్నారు.
- రాజు, ఏటూరునాగారం

పెట్టుబడి కూడా ఎల్లట్లే

మార్కెట్లో రైతులకు జెండా పాట ధర కట్టించుడు అనేది ఉట్టిమాటే అవుతోంది.  ఖరీదుదారులు రైతులను అడుగడుగునా మోసం చేస్తున్నారు. ఎకరం మిర్చి పండించడానికి రూ.80 వేల కంటే ఎక్కువ ఖర్చు అయింది. తీరా మార్కెట్‍ కు వస్తే రూ. 16,500 చొప్పున ధర కట్టిస్తామంటే ఏం లాభం. ఇంటిల్లిపాది కష్టానికి కూలి లేకున్నా కనీసం పెట్టుబడి ఖర్చయినా ఎల్లకుంటే ఎట్లా. అధికారులకు చెప్పుకున్నా పట్టించుకోవడం లేదు.  ప్రభుత్వం రైతుల పక్షాన నిర్ణయం తీసుకోవాలి.
- రాంబాబు, ములుగు

క్వాలిటీ లేదని ధర తగ్గించిన్రు

బుధవారం మార్కెట్లో మిర్చి ధరలు తగ్గింది వాస్తవమే. అయితే రైతులు పంటను తీసుకొచ్చే క్రమంలో తేమ ఎక్కువగా ఉంటోంది. మొన్నటి వానలకు తొడిమ నల్లపడ్డాయి. అందువల్లే వ్యాపారులు ధర తగ్గించినట్లుంది. రైతులు పంటను ఆరబోసి మార్కెట్​కు తీసుకురావాలి. బస్తాకు 49 కిలోలు ఉండేలా చూసుకోవాలి. 
- రాహుల్‍, ఏనుమాముల మార్కెట్‍సెక్రటరీ