కంది పప్పు కిలో రూ. 200.. మినపప్పు కిలో రూ. 160

  • నెలలో రూ.40 - 50పెరుగుదల ఈ సారి ఉత్పత్తి తగ్గడమే
  • కారణమంటున్న వ్యాపారులు
  • పక్క రాష్ట్రాలకుతరలిపోతున్న కంది పప్పు 
  • రేషన్ ​షాపుల్లో పంపిణీ చేస్తే ధరలు తగ్గే చాన్స్​ 

హైదరాబాద్, వెలుగు: కూరగాయల ధరలకు పప్పులు కూడా తోడయ్యాయి. రోజురోజుకూ ధరలు ఆకాశన్నంటుతుండడంతో సామాన్యుడికి పప్పన్నం కరువవుతున్నది. రిటైల్​ మార్కెట్​లో కిలో కంది పప్పు ధర నెల రోజుల క్రితం రూ. 150 నుంచి రూ.160 ఉండగా..ప్రస్తుతం  రూ.180 నుంచి రూ. 200 ధర పలుకుతున్నది.ఇక సూపర్ మార్కెట్లలో అయితే కిలో రూ. 220కు విక్రయిస్తున్నారు. అలాగే,  మినపప్పు ధరలు కిలో నెల క్రితం రూ. 90 నుంచి రూ. 120 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ. 140 నుంచి  రూ.160 వరకు ధర పలుకుతోంది.  పెసర పప్పు ధర కిలో రూ. 80 నుంచి రూ. 100 ఉండగా.. ప్రస్తుతం రూ. 110 నుంచి  రూ.120కి చేరుకున్నది. అలాగే, శనగ పప్పు కిలో ధర రూ. 90 పలుకుతోంది. ఈ సారి రాష్ట్రంలో పప్పుధాన్యాల పంటల ఉత్పత్తి తక్కువగా ఉండడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మరో ఆరు నెలలపాటు కొత్త పంట చేతికి వచ్చే వరకూ ధరలు తగ్గే అవకాశం ఉండదని అంటున్నారు. నిరుడు వర్షాభావం వల్ల ఈ సారి ఉత్పత్తి దాదాపు 40 శాతం పడిపోయినట్టు ముక్తియార్​గంజ్​పప్పుల మార్కెట్​లోని వ్యాపారుడు సోహన్​లాల్​ పేర్కొన్నారు. అందుకే ధరలు పెరిగినట్టు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్​లో తాండూరు కంది పప్పుకంటే విదేశాల నుంచి దిగుమతి అయిన కందిపప్పే అధికంగా లభిస్తోందని పేర్కొన్నారు. దీని సరఫరా కూడా తక్కువగా ఉండడంతో కొన్ని షాపుల్లో కంది పప్పు కొరత కనిపిస్తున్నట్టు వివరించారు. కాగా,  నగరంలోని ప్రధాన హోల్​సేల్​పప్పుల మార్కెట్లయిన కిషన్​గంజ్​, బేగంబజార్, ముక్తియార్​గంజ్, సికింద్రాబాద్​ మోండా మార్కెట్లలో పప్పుల  ధరలు రోజుకో తీరుగా మారిపోతున్నాయి.  ప్రస్తుత పరిస్థితిని రిటైల్​ వ్యాపారులు, సూపర్​మార్కెట్ల నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకొని ధరలు పెంచుతున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. 

పక్కరాష్ట్రాలకు తరలిపోతున్న కంది పప్పు

తెలంగాణలో ఉత్పత్తి జరిగే కంది పప్పుకు ముఖ్యంగా.. తాండూరు పప్పుకు దేశ వ్యాప్తంగా ఎంతో డిమాండ్​ ఉంటుంది. అత్యంత నాణ్యతతోపాటు రుచిలో కూడా తాండూరు పప్పుకు మంచి పేరుంది. కాగా, మార్కెట్​కు తాండూరు పప్పు సాధారణంగా రోజుకు 15 టన్నుల నుంచి 20 టన్నులు వస్తుండగా.. ప్రస్తుతం 15 టన్నుల లోపే వస్తోందని మార్కెటింగ్​ శాఖ అధికారులు తెలిపారు. ఇక తాండూరు పప్పుకు పెరిగిన డిమాండ్​ నేపథ్యంలో ధరలు కూడా బాగా పెరిగాయని తాండూరు మార్కెట్​కమిటీ కార్యదర్శి రాజేశ్వరి తెలిపారు. ప్రస్తుతం హోల్​సేల్​ ధరలు ఫస్ట్​క్వాలిటీ క్వింటాల్​కు  రూ. 11,880 పలుకుతుండగా, సెకండ్​క్వాలిటీ కంది పప్పు ధర క్వింటాల్​కు రూ. 11,205 గా ఉందని అన్నారు. తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద మొత్తంలో కంది పప్పుకు డిమాండ్​ పెరుగుతోందని ఆమె తెలిపారు. అయితే, తాండూరు మార్కెట్​నుంచి కొనుగోలుచేసే హోల్​సేల్​ వ్యాపారులంతా ఎక్కువ శాతం ఏపీ, కర్నాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్​, కేరళ, ఉత్తర ప్రదేశ్​ తదితర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు నగరంలోని బేగం బజార్​కు చెందిన హోల్​సేల్​ వ్యాపారుడు వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన కంది పప్పుకు మంచి ధర వస్తుండడంతో  అధికశాతం ఎగుమతులకే పోతోందని అంటున్నారు. నగరంలోని చాలా మంది హోల్​సేల్​ వ్యాపారులు బర్మా, మయన్మార్​తోపాటు మంగోలియా లాంటి ఆఫ్రికన్​ దేశాల నుంచి కూడా కంది పప్పు దిగుమతి చేసుకుంటున్నారు. అయితే ఈ పప్పులు తెలంగాణలో పండే కందిపప్పు అంత రుచిగా ఉండదని వ్యాపారులు చెబుతున్నారు. నిరుడు కంటే ఈసారి కంది పప్పుధరలు అధికం కావడంతో చాలా మంది వ్యాపారులు పక్కరాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారని, దీంతో రిటైల్​ మార్కెట్​లో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.

రేషన్ ​షాపుల్లోపంపిణీపై ఆశలు

కాంగ్రెస్​ ప్రభుత్వం రాగానే రేషన్​ షాపుల్లో పంపిణీ చేసే సరుకుల సంఖ్యను పెంచుతామని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రకటించారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో రేషన్​షాపుల్లో సరుకులు అంటే కేవలం బియ్యం, గోధుమలు మాత్రమే.. కానీ కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక చక్కెర కూడా అందిస్తున్నారు. త్వరలో కందిపప్పు, వంటనూనెలను కూడా సరఫరా చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ అమలుకు నోచుకోకపోవడంతో నిరుపేదలు వాటి కోసం ఎదురుచూస్తున్నారు. రేషన్​షాపుల ద్వారా తక్కువ రేటుకు కందిపప్పు పంపిణీ చేస్తే మార్కెట్​లో రేట్లు 
దిగివచ్చే చాన్స్​ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రిటైల్​ మార్కెట్​లో పప్పుల 
ధరలు (కిలోకు , రూపాయల్లో)

పప్పు          గత నెలలో    ప్రస్తుతం 
కందిపప్పు     150 -160      180-200
మినపప్పు      90-120         140-160
పెసర పప్పు    80-100       110-120