
- తెలంగాణ అభివృద్ధికి సహకరించండి: సీఎం రేవంత్
- తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్రను ఒప్పించండి
- 1.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తాం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉండొద్దు
- హైదరాబాద్ మెట్రోకు సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి
ఆదిలాబాద్, వెలుగు: ప్రధానమంత్రి అంటే.. రాష్ట్రాలకు పెద్దన్న అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెద్దన్న సపోర్ట్ ఉంటేనే సీఎంలు తమ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని రాకను స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధికి పెద్దన్న లెక్క సహకరించాలని మోదీని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉంటే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. తాము కేంద్రంతో ఎలాంటి ఘర్షణకు వెళ్లబోమని స్పష్టం చేశారు.
సోమవారం ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా నిర్వహించిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మోదీతో కలిసి రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఎన్నికల టైమ్‌లోనే రాజకీయాలు చేయాలి. ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. 2014 పునర్విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలతో పాటు చాలా విషయాలను ఇప్పటికే ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం. రామగుండంలో ఎన్టీపీసీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది.
ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంట్ నుంచి 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈ పదేండ్లలో కేవలం 1,600 మెగావాట్లకే పరిమితం అయింది. మిగిలిన 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చి సహకరిస్తున్నది’’ అని రేవంత్ అన్నారు.
వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించనున్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు సహకరించాలని ప్రధానికి రేవంత్ విజ్ఞప్తి చేశారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కోసం 1,850 ఎకరాలు అవసరం ఉందని, మహారాష్ట్ర రైతుల నుంచి సేకరించే భూములకు కావాల్సిన పరిహారం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రధానిగా మహారాష్ట్ర సర్కార్ కు ఒక మాట చెప్తే ఇక్కడే ప్రాజెక్ట్ కట్టి 1.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని రేవంత్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నం
నాలుగు వేల మెగావాట్ల విద్యుత్‌లో 85% రాష్ట్రానికి కేటాయించడం ద్వారా తెలంగాణలో వెలుగులు నింపబోతున్నామని రేవంత్ తెలిపారు. గుజరాత్ తరహాలో తెలంగాణ అభివృద్ధి కావాలంటే మోదీ మద్దతు అవసరమన్నారు. ఇండియాలో ఐదు మెట్రోపాలిటన్ సిటీలు ఉంటే అందులో హైదరాబాద్ ఒకటని తెలిపారు. ప్రధాని సపోర్టుతో మెట్రో రైల్ ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
మూసీ రివర్ ఫ్రంట్ కోసం సబ్సిడీలు, ఇన్సెంటివ్ లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అడిగిన వెంటనే హైదరాబాద్‌లో స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖకు చెందిన 190 ఎకరాల భూమి అప్పగించారని గుర్తుచేశారు. మంత్రి పీయూష్ గోయల్‌కు విన్నవిస్తే టెక్స్ టైల్ కాలేజ్‌ను ప్రారంభించేందుకు ప్రత్యేకమైన అనుమతులిచ్చారని, ఇందుకు తెలంగాణ ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు చెప్తున్నామన్నారు.