
- ఆయన మనసు నిండా కుళ్లు, కుతంత్రాలే: సీఎం రేవంత్‌రెడ్డి
- రాష్ట్రాభివృద్ధి కోసం నీ ఇంటికి పదిసార్లు వచ్చి మాట్లాడిన
- ఒక్కసారన్నా ప్రధాని దగ్గరికి పోదామన్నవా?
- తెలంగాణ ప్రజల మీద పాములా పగబట్టినవ్
- నీ చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయిండని దుఃఖమా?
- నీకన్నా చిన్నోడు సీఎం అయితే ఎందుకంత ఓర్వలేనితనం
- కేంద్ర మంత్రి ఖట్టర్ వచ్చి సమీక్ష పెడ్తే
- గల్లీలోనే ఉన్న నువ్వు ఎందుకు అటెండ్ కాలే
- ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనకు కేసీఆరే కారణం
- పదేండ్లు ఆ ప్రాజెక్టును పట్టించుకోలే.. పాపాల భైరవుడు
- రోజా పెట్టిన రొయ్యల పులుసు తిని కృష్ణా నీళ్లను
- రాయలసీమకు మళ్లించిండని ఆగ్రహం
మహబూబ్‌నగర్, వెలుగు: సందట్లో సడేమియా లెక్క కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మోపయ్యారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘మేం కష్టపడి పనులు సాధిస్తే ఆయన ఖాతాలో వేసుకుంటడు. పనులకు అనుమతులు రాకపోతే రాష్ట్రంలో సీఎం ఏం చేస్తలేడని నా మీద ఆరోపణలు చేస్తడు. ప్రతిసారి నువ్వేం చేశావని ప్రశ్నిస్తున్నడు.. మరి కేంద్ర మంత్రిగా ఆయన తెలంగాణకు ఏం చేసిండు?” అని నిలదీశారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతులు రాకుండా కిషన్‌రెడ్డి సైంధవు డిలా అడ్డుకుంటున్నారని సీఎం అన్నారు. ‘‘మొన్ననే ప్రధాని మోదీని కలిసొచ్చిన. తెలంగాణకు ఏదైనా చేయాలని ఆయనకున్నది. కానీ కిషన్‌రెడ్డి సైంధవుడిలా తయారైండు.
తన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయిండన్న దుఃఖంలో ఉన్నడు. మేం తెలంగాణ ప్రజల కోసం కష్టపడుతుంటే.. సంక్షేమ పథకాలు ఇస్తుంటే.. ఓర్వడంలేదు. రాష్ట్రానికి రావాల్సిన వాటిని కుళ్లు, కుతంత్రాలతో అడ్డుకుంటున్నడు. సమస్య మోదీ దగ్గర కాదు.. కిషన్‌రెడ్డి దగ్గర్నే ఉంది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తిలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ‘ప్రజా పాలన ప్రగతి బాట’ బహిరంగ సభలో మాట్లాడారు.
‘‘కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటల్లో అసూయ కనిపిస్తది. తనకన్నా చిన్నోడు సీఎం అయిండనే అసూయ ఆయనలో ఉన్నది. అందుకే రాష్ట్రాభివృద్ధికి అడ్డం పడ్తున్నడు. కాళ్లలో కట్టెలు పెడ్తున్నడు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హైదరాబాద్‌కు వస్తానంటే కిషన్‌రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేసిండు. కానీ మళ్లీ ఖట్టర్ తెలంగాణకు వచ్చిండు. హైదరాబాద్‌లోని గ్రాండ్ కాకతీయ హోటల్లో ఆయన సమీక్ష పెడ్తే.. కిషన్‌రెడ్డి ఎందుకు వెళ్లలేదు? తెలంగాణకు విద్యుత్‌లో ఆర్థిక సాయం చేయాలని, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని ఖట్టర్‌ను ఎందుకు అడగలేదు?” అని సీఎం రేవంత్ నిలదీశారు.
ఇదే సమావేశానికి వచ్చిన ఈటల రాజేందర్ మెట్రోను మేడ్చల్ వరకు ఇవ్వాలని అడిగింది నిజం కాదా? మరి స్థానిక ఎంపీ, పైగా కేంద్ర మంత్రి అయిన కిషన్‌రెడ్డి ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. కుళ్లు, కుతంత్రాలతోనే కిషన్‌రెడ్డి ఆ మీటింగ్‌కు వెళ్లలేదని, రాష్ట్రాభివృద్ధిని కావాలని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ‘‘తెలంగాణ అభివృద్ధి కోసం పది సార్లు మీ చుట్టూరా తిరిగిన. మా ఆఫీసర్లను మీ ఇంటికి పంపి నివేదికలు ఇచ్చిన. కేంద్ర మంత్రి ఖట్టర్ వచ్చినప్పుడు నువ్వు రావా? హైదరాబాద్‌కు ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి వస్తడు కానీ.. గల్లీలో ఉన్న నువ్వు సమీక్షకు రావా? నీకెందుకంత కుళ్లు?” అని కిషన్‌రెడ్డిని నిలదీశారు.
తెలంగాణ అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధి ఉంటే.. ఈ నెల 10 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నించాలని సవాల్ చేశారు. త్వరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా 17 మంది ఎంపీలు, ఏడుగురు రాజ్యసభ సభ్యులతో సెక్రటేరియెట్‌లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని.. ఆ సమావేశానికి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ వచ్చి సూచనలు చేయాలని ఆయన సూచించారు. ‘‘రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల వివరాలు, తీసుకోవాల్సిన అనుమతులపై మీరు చెప్పండి. అవన్నీ తీసుకొని ఢిల్లీకి పోయి సాధించుకుందాం’’ అని తెలిపారు.
మోదీ ఇచ్చింది రెండు ఉద్యోగాలే.. అదీ కిషన్‌రెడ్డికి, సంజయ్‌కి
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 12 నెలలు అయిందని, మోదీ 12 ఏండ్లుగా దేశ ప్రధానిగా కొనసాగుతున్నారని.. ఆయన ఎన్ని పనులు చేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘మేం ఏదైనా కష్టపడి, కొట్లాడి తేస్తే అది మేమే ఇచ్చినం అంటడు. మేం నానా తిప్పలు పడి ఢిల్లీకి పోయి చర్చిస్తే వరంగల్‌లో ఎయిర్పోర్ట్ వచ్చింది. కానీ, కిషన్‌రెడ్డి తానే తెచ్చినట్లు చెప్పుకుంటడు. కిషన్ రెడ్డి తెచ్చింది నిజమే అయితే మెట్రో సెకండ్ ఫేజ్ ఎందుకు రాలే? మూసీ ప్రక్షాళనకు నిధులు ఎందుకు రాలే? రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం నువ్వే (కిషన్‌రెడ్డి) తెచ్చినంటున్నవ్ కదా.. మరి దక్షిణ భాగం ఎందుకు ఆగింది? పీఆర్ఎల్ఐకి 60 టీఎంసీల నీటి కేటాయింపులు పదేండ్ల నుంచి పెండింగ్‌లో ఉంది.
దాన్ని ఆపింది నువ్వే కదా. ప్రధాని మోదీ ఆపితే కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి ఆపినట్లే కదా? ఈ లాజిక్ ఎందుకు మిస్సయితున్నవ్ కిషన్ రెడ్డీ’’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చిందని, దాని ప్రకారం వారు అధికారంలో ఉన్న 12 ఏండ్లలో 24 కోట్లు ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన అన్నారు. కానీ తెలంగాణలో మోదీ ఇచ్చింది రెండు ఉద్యోగాలేనని.. అందులో కిషన్‌రెడ్డికి ఒకటి, బండి సంజయ్‌కి ఇంకొకటి అని విమర్శించారు.
కేసీఆర్ నీ పిట్టకథలు ఎవరూ నమ్మరు
బీఆర్ఎస్పదేండ్లు అధికారంలో ఉందని, ఐదేండ్ల కోసం ప్రజలు తమకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించారని సీఎం రేవంత్ అన్నారు. కానీ ఏడాది కాకముందే తమను దిగిపోవాలంటూ కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పాలమూరు రైతు బిడ్డ, నల్లమల ప్రాంతం బిడ్డ సీఎం అయితే ఓర్చుకోలేరా? కేసీఆర్, ఆయన కొడుకు, మనుమళ్లు ఏలడానికి పుడితే.. మేం భిక్షం ఎత్తుకోవడానికి పుట్టినమా? మేం పాలించలేమా? మా పాలమూరు వాళ్లకు శక్తి లేదా? ప్రపంచానికి శక్తినిచ్చింది మా పాలమూరు సోదరులు, సోదరీమణులే. మాది అయాకత్వం కాదు.. మాది మంచితనం. మా మంచితనానికి పరీక్ష పెడితే తిక్కరేగి డొక్క చించి డోలు కడతాం. కేసీఆర్.. నువ్వు మా జిల్లా సంగతి చూడలేదు. మా జిల్లా వాసులను అమాయకులు అనుకుంటున్నవా? పిట్టకథలు చెప్పి నమ్మించొచ్చని అనుకుంటున్నవా? నీలాంటోళ్లను చాలా మందిని చూసినం. నల్లమలకు రా.. మా పౌరుషం ఏందో తెలుస్తది. నల్లమల అడవుల నుంచి దేశానికి నాయకత్వం వహించిన పటేల్ సుధాకర్ రెడ్డి మా పాలమూరు బిడ్డ అని మరిచిపోవద్దు. పౌరుషానికి, పోరాటానికి ప్రతీక పండుగ సాయన్న కూడా మా పాలమూరు బిడ్డేనన్న విషయం మర్చిపోవద్దు. పిట్టకథలు చెప్పి మభ్యపెట్టాలనుకుంటే ఊరుకోం. ఒడుపు చూసి మడత దగ్గర వాత ఎట్ల పెట్టాలే మా అక్కలకు తెలుసు. మా పాలమూరు ఆబిడ్డలు తెలివిగలవాళ్లు. గట్టిగా కట్టె పట్టుకొని నిలబడతరు” అని హెచ్చరించారు. కేటీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని, ఆ విషయం ఆయన మొఖంలోనే కనిపిస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు వస్తే సలాకా కాల్చి వాతలు పెట్టాలని సీఎం అన్నారు.
కేసీఆర్ సీఎం అయ్యాక స్వయం సహాయక సంఘాలను ఆగం చేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక వేల కోట్ల రుణాలను స్వయం సహాయక సంఘాలకు ఇస్తున్నామని తెలిపారు. 67 లక్షల మంది ఉన్న సంఘాల సభ్యులను కోటి మంది సభ్యులకు పెంచి వారిని కోటీశ్వరులను చేస్తామన్నారు. ఆడ బిడ్డలు కాంగ్రెస్‌కు అండగా నిలబడితే రాబోయే 15 ఏండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్న బుగులు బీఆర్ఎస్ లీడర్లకు పట్టుకుందని, అందుకు ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ‘‘కాంగ్రెస్ అధికారంలో ఉంటే వారి(బీఆర్ఎస్ లీడర్లు) బతుకులు బస్టాండ్ అవుతుంది. వాళ్లు వనపర్తి బస్టాండ్‌లో భిక్షం ఎత్తుకోవాల్సి వస్తుంది. అందుకే బీఆర్ఎస్, బీజేపీ అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి” అని అన్నారు.
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఐదేండ్లలో వనపర్తి రాజకీయాలు కలుషితం చేశారని ఆయన మండిపడ్డారు. పాలమూరు జిల్లాకు కాశీంనగర్ ప్రాజెక్టును మంజూరు చేశామని, దీని కింద నాలుగు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని సీఎం తెలిపారు. ఆఖరి శ్వాస వరకు పేదలకు వైద్యం అందించిన జిల్లెల మాధవరెడ్డి పేరును కాశీంనగర్ ప్రాజెక్టుకు పెడ్తామని ప్రకటించారు.
బెదిరించి బతకాలని చూడకు
‘‘మనసులో కుళ్లు పెట్టుకున్న కిషన్‌రెడ్డి మమ్మల్ని బెదిరించి, తిట్టాలనుకుంటే మూసీ ప్రక్షాళన జరుగుతుందా? రీజనల్ రింగ్ రోడ్డు వస్తదా?’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘నీ దగ్గర మోదీ ఉండొచ్చు.. ఈడీ, సీబీఐ ఉండొచ్చు. ఎంత కాలం బెదిరించాలనుకుంటరు? మేం భయపడం. గుర్తు పెట్టుకో కిషన్ రెడ్డి.. చావు ఒక్కసారే వస్తది.. చావుకు తెగించి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. చావుకు తెగించి మా కార్యకర్తలు కొట్లాడితేనే తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చింది. మేం ఎవరికీ భయపడం. మర్యాదకు మర్యాద ఇస్తం. కొంత కాలంగా మౌనంగా మీ తప్పులను లెక్క కడ్తున్నం.
కిషన్ రెడ్డీ.. బెదిరించి బతకాలని చూడకు. ప్రజల్లో గౌరవం పెంచుకోవాలంటే పనులు చేయాలి. ఏం పని చేస్తవో చెప్పు. ఎట్ల చేద్దామో చెప్పు. మీ ఇంటి కొచ్చి పదిసార్లు మాట్లాడిన. తెలంగాణకు ఏం కావాలో అడిగిన. నువ్వు పెద్దోనివని చెప్పిన . నీ పెద్దరికం నిలబెట్టుకున్నవా? ఒక్కసారైనా ప్రధాని మోదీ వద్దకు వెళ్దామన్నవా? కేంద్ర మంత్రి ఖట్టర్ వస్తేనే సమీక్షకు రాని నువ్వు.. ఈ రోజు మెట్రోకు సహకరించినట్లు చెప్తే మేం నమ్మాల్నా? మోదీ సబర్మతి నదిని, యోగీ గంగానదిని, అమిత్ షా యమునా నదిని ప్రక్షాళన చేసుకుంటున్నరు. ఇందుకు వేల కోట్ల నిధులు వరదలా పారిస్తున్నరు. కిషన్ రెడ్డీ మరి మన తెలంగాణకు మూసీ ప్రక్షాళన వద్దా? అక్కడి పేదలు నీకు ఓటు వేయలేదా? నిన్ను ఎంపీగా గెలిపించింది, కేంద్ర మంత్రిని చేసింది వాళ్లే కదా? ఎందుకు వారి మీద పాములాగా పగబట్టి బుస కొడ్తున్నవ్?” అని ఆయన నిలదీశారు.
రొయ్యల పులుసు తిని ఏం చెప్పినవ్ కేసీఆర్?
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి కేసీఆర్ కారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ఎస్ఎల్బీసీని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టింది. 33 కిలోమీటర్ల వరకు పనులు పూర్తి చేసింది. ఇంకా పది కిలోమీటర్ల పనులు చేయాల్సి ఉండె. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పనులు పెండింగ్‌లో పెట్టిండు. ఆ పనులు ఆగిపోవడం వల్ల ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలింది. ఎనిమిది మంది ప్రాణాలకు ముప్పు వచ్చింది. ఈ పాపం కేసీఆర్‌దే. ఆయన పాపాల భైరవుడు” అని మండిపడ్డారు. తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టి రాయలసీమకు నీళ్లను తరలించుకుపోతుంటే ఆనాడు గుడ్లు అప్పగించుకొని కేసీఆర్ చూశారని అన్నారు. ‘‘రాయలసీమకు నీళ్లు తరలడానికి కేసీఆరే కారణం. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దదిగా చేసి నీళ్లను తరలించుకుపోతూంటే ఆయన ప్రభుత్వంలో నాడు ఉన్న కేసీఆర్ ఎందుకు అడ్డుకోలేదు. వైఎస్సార్ కొడుకు జగన్ సీఎం అయ్యాక ఆయన్ను ప్రగతి భవన్‌కు పిలిపించి పంచభక్ష పరమాన్నాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతలకు పునాదులు వేసిందే కేసీఆర్.
రాయలసీమ స్కీమ్ ఆలోచనకు కర్త, కర్మ, క్రియ ఆయనే. పునాది రాయి వేసిందీ కేసీఆరే” అని దుయ్యబట్టారు. ‘‘ఈయన సీఎం హోదాలో రాయలసీమలో ఉన్న అప్పటి ఏపీ మంత్రి రోజా ఇంటికి పోయిండు. ఆమె పెట్టిన రొయ్యల పులుసు తిని.. రాయలసీమను రత్నాల సీమ చేస్తానని చెప్పిండు. ఈ మాటలు అన్నది ఏ సన్నాసి? రొయ్యల పులుసు తింటేనే రాయలసీమను రత్నాల సీమను చేస్తానన్న కేసీఆర్.. కరీంనగర్ నుంచి పాలమూరుకు వచ్చిన కేసీఆర్‌ను ఇక్కడి ప్రజలు ఎంపీగా గెలిపిస్తే ఈ జిల్లాకు ఏం చేసిండు? సీఎంగా ఈ జిల్లాకు ఏం చేసినవ్. నిన్ను సీఎంగా చేసినందుకు ఇక్కడి ప్రజలకు నీ చర్మం వలిచి చెప్పులు కుట్టినా అది తక్కువే అవుతుంది.
కేసీఆర్ పాలమూరు ద్రోహి. కృష్ణానది జలాలను ఏపీకి కొల్లగొట్టిన వంద శాతం దుర్మార్గుడివి నువ్వు. 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఏపీ తీసుకోవాలని సంతకం చేసిన దుర్మార్గుడివి నువ్వు. నువ్వు పెట్టిన ఆ సంతకం తెలంగాణ రైతులకు యమపాశమైంది. వారి ప్రాణాలు బలిగొనే పరిస్థితి వచ్చింది” అని ఫైర్ అయ్యారు. తాను సీఎం అయ్యాక పాలమూరు రుణం తీర్చుకునేందుకు కొడంగల్ ఎత్తిపోతలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుంటే కేసులేసి అడ్డుతున్నారని, ఎస్ఎల్బీసీ వద్ద పనులు చేద్దామంటే అడ్డం వచ్చి పడుకుంటున్నారని కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కేసీఆర్‌ను నమ్మినందుకు పాలమూరు ప్రాజెక్టులను పడావు పెట్టిండు. ఆయన్ను నమ్మినందుకు ఇక్కడి ప్రజలను నట్టేట ముంచి.. పాలమూరును ఎడారిగా మార్చిండు” అని సీఎం పేర్కొన్నారు.