తాగునీటి కోసం రోడ్డెక్కుతున్నరు

తాగునీటి కోసం రోడ్డెక్కుతున్నరు

వెలుగు, నెట్​వర్క్ : ఎండలు ముదరకముందే రాష్ట్రంలో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. మిషన్​భగీరథ స్కీం ద్వారా ఇంటింటికీ 24 గంటలు నల్లా నీళ్లు ఇస్తున్నామని సర్కారు పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నా గ్రౌండ్​ లెవెల్​లో ఆ పరిస్థితి కనిపించడంలేదు. రిజర్వాయర్లలో నీళ్లున్నా నిర్వహణ లోపాలు, పైపులైన్లలో సమస్యల కారణంగా వేల గ్రామాల్లో కనీసం వారానికోసారి కూడా నీళ్లు అందడం లేదు. పట్టణాల్లోనూ రెండు, మూడు రోజులకోసారి వాటర్​ వస్తుండడంతో తాగునీటి కోసం పబ్లిక్ రోజుకో చోట ఆందోళనకు దిగుతున్నారు. అటు జడ్పీ, మండల పరిషత్​తో పాటు మున్సిపల్​ మీటింగుల్లోనూ తాగునీటి సమస్యను సభ్యులు లేవనెత్తుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎండలు ముదిరాక పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు.

మహిళల నిరసన.. 

మిషన్ భగీరథ స్కీం ద్వారా 24 గంటల పాటు ఇంటింటికీ తాగునీరు ఇస్తామంటూ రాష్ట్ర సర్కారు ఇప్పటికి రూ.35వేల కోట్ల దాకా ఖర్చు చేసింది. రిజర్వాయర్ల నుంచి నియోజకవర్గాలకు వెళ్లే మెయిన్​ ట్రంక్​లైన్లు వేసినా చాలా చోట్ల ఇంట్రా పైపులైన్లు పూర్తి కాలేదు. పైపులైన్ సమస్యలు, నిర్వహణ లోపాలు భగీరథకు శాపంగా మారాయి. శిథిలమైన పాత పైపులైన్లతో పాటు నాణ్యత లేని కొత్తపైపులైన్లు ప్రెజర్​ను తట్టుకోలేక పగులుతుండడంతో వందలాది గ్రామాలకు కొన్ని రోజుల పాటు నీళ్లు బంద్ ​అవుతున్నాయి. ఈ క్రమంలో కొద్దిరోజులుగా తాగునీటి కోసం మహిళలు బిందెలతో రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు.

* ఆదిలాబాద్ జిల్లా నాగల్కొండలో మంగళవారం తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. మెయిన్ రోడ్డుపై నిరసన చేపట్టారు. తమ ఊర్లో 15 రోజులుగా నీళ్లు రావడం లేదని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల ధర్నాతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

* కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్​లోని విజయనగర్ కాలనీ, రజ్వి చమన్ సెల్ఫీ కాలనీలో తాగునీళ్లు ఇవ్వాలంటూ కాలనీ వాసులు కరీంనగర్-–పెద్దపల్లి హైవేపై ఆదివారం ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. బొమ్మకల్ లోని పలు కాలనీలకు ఏడాది నుంచి మంచినీళ్లు రావడంలేదని వాపోతున్నారు. తమ సమస్యను మంత్రి గంగుల కమలాకర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు.

* కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదు. కామారెడ్డి టౌన్​లో రెండు రోజులకు ఒకసారి సప్లయ్ చేస్తున్నారు. టౌన్​లో తరచూ   పైపులైన్లు పగిలిపోయి నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు.

* నాగర్ కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో నల్లా కనెక్షన్ల పనులు పూర్తి కాలేదు. దీంతో జనం నీటి కోసం అల్లాడుతున్నారు.

* మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సోమనపల్లిలోని ఎస్సీ కాలనీ, దుబ్బపల్లి, గొల్లవాడలో తీవ్ర నీటి ఎద్దటి నెలకొంది. గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ సప్లయ్ కావడం లేదు. కాలనీల్లో ఉన్న నాలుగు బోర్లు కూడా నెల రోజుల కింద చెడిపోయాయి. చుట్టుపక్కల వ్యవసాయ బావుల నుంచి ఎడ్ల బండ్లు, ఆటోల్లో నీళ్లు తెచ్చుకుంటున్నారు.

* పైపులైన్ రిపేర్లు, లీకేజీల కారణంగా గ్రేటర్​ వరంగల్ లో నీళ్లు రాక జనాలు అల్లాడుతున్నారు. ధర్మసాగర్ నుంచి సిటీకి వాటర్ సప్లయ్ చేసే పైపులైన్ రిపేర్ల కారణంగా వరంగల్ అండర్ రైల్వే జోన్ పరిధిలోని పలు గ్రామాలకు ఫిబ్రవరి 28 నుంచి మూడు రోజులపాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆఫీసర్లు ప్రకటించారు.

* హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్​ పంచాయతీ పరిధిలోని మక్త నాయక్​ తండాకు దాదాపు పది రోజులుగా నీటి సరఫరా జరగడంలేదు. మండలంలోని గట్ల నర్సింగాపూర్​ నుంచి కొత్తకొండ మధ్య రోడ్డు వేస్తుండటంతో పైపులైన్​ పగిలిపోయి.. వాటర్​ సప్లై నిలిచిపోయింది. 

మీటింగుల్లోనూ ఇదే సమస్య..

*  సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం ఎనగుర్తిలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని గ్రామ ప్రజలు ఇటీవల రాస్తారోకో చేశారు. అక్కన్నపేట మండలం జనగామలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని మండల పరిషత్​ మీటింగ్​లో  హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్, ఎంపీటీసీ, సర్పంచ్ లు ఫిర్యాదు చేసినా  సమస్య పరిష్కారం కాలేదు.

* ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పలు గ్రామాలకు మిషన్​భగీరథ నీళ్లు​ రావడం లేదు. జామ్ని గ్రామ పరిధిలోని రెండు హాబిటేషన్లలో ఒక్క ఇంటికి నీళ్లు వచ్చినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని  ఈ నెల 17న జరిగిన మండల జనరల్​బాడీ మీటింగ్​లో గ్రామ సర్పంచ్ మెస్రం రాహుల్ సవాల్ చేశారు.  

*  నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంతో పాటు ఆస్తా, బ్రహ్మంగావ్, గన్నోర, విట్టోలి గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. నీళ్ల గోసపై వారం కింద జరిగిన మండల సమావేశంలో సర్పంచ్ లు, ఎంపీటీసీలు మిషన్ భగీరథ అధికారులను నిలదీశారు. పైపులైన్ పనులు సరిగా చేయకపోవడంవల్లనే లీకేజ్​లతో నీటి సప్లయ్ నిలిచిపోతోందని వారు మండిపడ్డారు.

* నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులకు నీరు  సప్లయ్ కావడంలేదని సోమవారం జరిగిన మున్సిపల్ మీటింగ్ లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. టౌన్ లో అమృత్, భగీరథ స్కీమ్​లున్నా శివారు ప్రాంతాలకు వాటర్ సప్లయ్ కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాలియా మున్సిపాలిటీలో, పెద్దవూర మండలంలోని పులిచెర్ల, కుంకుడు తండా, జానారెడ్డి కాలనీ, పర్వేదుల, త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. నీటి గోసపై జనం ఇటీవల ఆందోళనకు దిగారు.

* కొత్తగూడెం పట్టణంలో కొన్ని ఏరియాలకు మూడు, నాలుగు రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. తాగునీటి  సమస్య తీర్చాలంటూ ప్రజలు ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సమస్యపై కౌన్సిల్​ మీటింగ్​లో ప్రతిపక్ష కౌన్సిలర్లు నిరసన తెలిపినా, వాకౌట్ చేసినా సమస్య తీరలేదు. చండ్రుగొండ మండలం మహ్మద్​నగర్ లో భగీరథ నీళ్లు రావడం లేదని గ్రామస్తులు ఇటీవల ఆందోళన చేపట్టారు.