నీళ్లు సక్కగ ఇడ్వరు..సరిపడా రావు!

నీళ్లు సక్కగ ఇడ్వరు..సరిపడా రావు!

సిటీలో వెయ్యికిపైగా కాలనీల్లో లో ప్రెషర్ సమస్య

హైదరాబాద్, వెలుగు : సిటీలో ఫ్రీ వాటర్​ స్కీమ్ ​అమలవుతుండగా వచ్చే నీళ్లు సాల్తలేవు. నల్లా ఎప్పుడొస్తదో తెలియదు. అది కూడా లో ప్రెషర్ తో వస్తోండగా ఆ రోజుకే అయిపోతున్నాయి. మరుసటి రోజుకు ఉండడంలేదు.  దీంతో నల్లా వచ్చేటప్పుడు మోటార్లు పెట్టి నీళ్లను పట్టుకునే పరిస్థితి నెలకొంది. జలమండలి పరిధిలో దాదాపు వెయ్యికిపైగా కాలనీల్లో  లో  ప్రెషర్ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది.  నెలకు ప్రతి ఇంటికి రూ.200 లకుపైగా కరెంటు బిల్లు అదనంగా పడుతోంది. ఫ్రీ వాటర్​ స్కీమ్​ అని చెప్పిన ప్రభుత్వం వాటర్ బిల్లును కూడా కరెంట్ ​బిల్లుల రూపేణా వసూలు చేస్తుందా..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వాటర్ బోర్డు ట్విట్టర్ ఖాతాకు  రోజుకు వంద వరకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా  నల్లా నీళ్ల   సమస్యలపై కారణాలను గుర్తించడంలో అధికారులు ఫెయిల్​ అయ్యారని విమర్శిస్తున్నారు. నీళ్ల ప్రెషర్ పెంచడంపైన జలమండలి దృష్టి పెడితే తమ కష్టాలు తీరుతాయని జనం కోరుతున్నారు. 

ప్రతి సమ్మర్​లో ఇంతే..!
ప్రతి వేసవిలో లో ప్రెజర్​ కారణంగా మోటార్లు పెట్టి నీళ్లు పట్టుకునే పరిస్థితి ఉంది. వేసవి వస్తుందంటేనే మోటార్ల రిపేర్లు, కొత్త మోటార్ల కొనుగోలు చేస్తుంటారు. డిమాండ్ కు సరిపడా నీళ్లు సరఫరా కాకపోతుండగానే సమస్య వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. జలమండలి అధికారులు మాత్రం డిమాండ్ కు సరిపడా పంపిణీ చేస్తున్నామని చెబుతున్నారు. ప్రస్తుతం సిటీలో మొత్తం 541 ఎంజీడీలు సరఫరా అవుతున్నాయి. ఇంతకు ఎక్కువగా డిమాండ్ ఉంటేనే ప్రాబ్లమ్ వస్తోంది. అధికారులు బూస్టర్లను ఏర్పాటు చేస్తే ఆటోమెటిక్ గా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. 

బూస్టర్లు  పెట్టట్లే..
లో  ప్రెషర్ ఉన్న ప్రాంతాలపై అధికారులు దృష్టి పెట్టడంలేదు. ఎత్తుగా ఉండే ప్రాంతాలు, రోడ్లు తదితర నిర్మాణాల కారణంగా పైపులు లోపలికి ఉన్న చోట్ల  లో  ప్రెషర్ తో నీళ్లు వస్తుండగా, ఆయా ప్రాంతాల్లో   అధికారులు బూస్టర్​లను ఏర్పాటు చేయడంలేదు. ప్రతి సమ్మర్​లో  ఇంతేనని అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. సమస్య తీవ్రంగా ఉన్న చోటనే పెడుతున్నారు. అన్ని ప్రాంతాల్లో బూస్టర్లను ఏర్పాటు చేస్తే లో  ప్రెషర్ సమస్య తీరుతుంది. 

అధికారులు చూసీ చూడనట్టుగానే..
జలమండలి పరిధిలో చాలా ప్రాంతాల్లో లో ప్రెషర్ సమస్య ఉంది. గన్ ఫౌండ్రీ, భోలక్ పూర్, కార్వాన్, గుడి మల్కాపూర్, జియాగూడ,  అంబర్ పేట్​ఖాద్రీబాగ్, ఫిలింనగర్, లాల్ దర్వాజా, గౌరీశంకర్ కాలనీ, మౌలాలి, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల ఇలా పలు ఏరియాల్లో  ప్రెషర్ తక్కువగా ఉంటుంది. ప్రతి వేసవిలో జలమండలికి లో ప్రెషర్ పై  ఫిర్యాదుల చేస్తుంటారు. కొన్నాళ్లు ఇలాగే వస్తాయని అధికారులు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. శాశ్వత పరిష్కారా నికి మాత్రం చర్యలు తీసుకోవడంలేదు. నల్లాలకు మోటార్లు పెట్టొద్దని అధికారులు చెబుతున్నారే తప్ప,  లో ప్రెషర్ పై ఎందుకు దృష్టిపెట్టడంలేదని జనాలు ప్రశ్నిస్తున్నారు. మోటార్లు పెట్టకపోతే మరుసటి రోజు డబ్బులు పెట్టి  ట్యాంకర్లను కొంటున్నామని వాపోతున్నారు.

నల్లా నీళ్లు ఫ్రీ గా ఇస్తున్నా.. 
లో ప్రెషర్ సమస్య తీవ్రంగా ఉంది. దీంతో మోటార్లు పెట్టి పట్టుకుంటున్నాం.  కరెంటు బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది. నల్లా నీళ్లు ఉచితంగా అందిస్తున్నా సరిగా ఉపయోగ పడట్లేదు. మరో వైపు లో ప్రెషర్ సమస్య ఉంటుంది. దీంతో నీళ్లకు బిల్లులు రాకపోయినా అదనపు కరెంటు చార్జీలతో జేబులు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. 
- ఎండీ జమాల్, నాచారం

నీళ్లు కొద్దిసేపే వస్తుండగా..
 నీళ్లు ఎప్పుడోస్తయో కూడా తెలియట్లేదు. వచ్చిన నీళ్లు  లో ప్రెషర్ తో వస్తుండగా, అది కూడా కొద్దిసేపు వదులుతుండగా ఇబ్బంది పడుతున్నం. ఉదయం పూట నీళ్లను వదిలితే  డ్యూటీలకు వెళ్లేందుకు సమస్య రాదు. దీనిపై జలమండలి అధికారులు దృష్టి పెట్టాలి.
- వెంకటేశం, గౌరీశంకర్ కాలనీ, బంజారాహిల్స్​

ట్యాప్​లు ఒకేసారి ఓపెన్​ చేస్తే..
లో ప్రెషర్ సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. లో ప్రెషర్ కు కారణం అన్ని ట్యాప్​లు  ఒకేసారి ఓపెన్​చేస్తే  ప్రెషర్ తగ్గుతుంది. ప్రస్తుతమైతే అలాంటి సమస్య ఎక్కడలేదు. ఉన్న చోట వెంటనే మరమ్మతులు చేస్తాం. 
- కృష్ణ, జలమండలి డైరెక్టర్

అంబర్ పేట్​ ఖాద్రీబాగ్​లో  ఐదేండ్లుగా నల్లా నీళ్లు లో ప్రెషర్ తో వస్తున్నాయి.  అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంట లేదు. ఇక్కడ పలుసార్లు పర్యటించిన అధికారులు పైపులైన్ మార్చాలని నిర్ణయించారు. అయినా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవట్లేదు. పనులేందుకు చేయట్లేదో అర్థం కావట్లేదు’’. అంటూ కాలనీవాసి వరుణ్ వారం కిందట వాటర్​బోర్డుకు ట్విట్టర్​లో పోస్ట్ ​చేసి ఆవేదన వ్యక్తం చేసిండు. 

భోలక్​పూర్ ఇందిరానగర్​లో లోప్రెషర్  సమస్య ఉంది. పావుగంట మాత్రమే నీళ్లు వస్తుండడంతో ఇబ్బందిగా ఉంది. వచ్చిన నీళ్లు ఆ రోజుకే సరిపోతున్నాయి. మరుసటి రోజు నీళ్లు లేక గోస పడుతున్నాం. గంటన్నరైనా సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి..అని స్థానికుడు మహ్మద్ వాజిద్ హుస్సేన్ పదిరోజుల కిందట ట్విట్టర్​లో జలమండలికి పోస్ట్​ చేసిండు. ఇప్పటికి వీరి ప్రాబ్లమ్స్​పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.