షెడ్యూల్ తెగలు, ఇతర సాంప్రదాయక అటవీవాసుల నివాసితుల ‘అటవీ హక్కుల గుర్తింపు చట్టం- 2006’ అమలులోకి వచ్చి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఈ చట్టం అడవిలో జంతువులను వేటాడడం తప్ప అన్ని రకాల హక్కులను గుర్తించింది. ప్రధానంగా ఈ చట్టం ప్రకారం.. అటవీ భూములలో నివాసం ఉండటం. సాగు చేసుకోవటం. ‘సామూహిక హక్కు’ను కలిగినవారికి హక్కుపత్రం ఇస్తారు. సామూహిక హక్కు అంటే అటవీ ఉత్పత్తులు.. తేనె, లక్క, తునికాకు, ఔషధ మొక్కలు, అటవీ మొక్కలు సేకరించటం, జల వనరుల్లో చేపలు పట్టడం మొదలైనవి. అటవీ భూములలో పోడు సాగులో ఉన్న భూములకు 10 ఎకరాలలోపు హక్కు పత్రం ఇస్తారు. అది కూడా డిసెంబర్ 13, 2005 నాటికి పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులకు మాత్రమే హక్కు పత్రం ఇస్తారు. ఆ తర్వాత సాగు చేసుకునేవారికి హక్కు పత్రం లభించదు. అక్రమంగా సాగు చేసుకునేవారిపై అటవీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తారు. గిరిజనేతరులకు డిసెంబర్ 13, 2005 నాటికి అటవీ భూమి 3 తరాలుగా సాగు చేసుకుంటున్న భూమికి హక్కు పత్రం లభిస్తుంది. హక్కు పత్రం వచ్చినవారు ఆ భూమిని వారసత్వంగానే అనుభవించాలి. ఎటువంటి భూ బదలాయింపు చేయరాదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటవీ హక్కుల చట్టం వచ్చాక 2008–-09లో తెలంగాణ ప్రాంతంలో పోడు భూముల హక్కు పత్రాల కోసం స్వీకరించిన దరఖాస్తుల సంఖ్య 2,04,176. వీటిలో తిరస్కరించినవి 92,744 కాగా వ్యక్తిగత హక్కులు లభించినవి 97,434. వీటితోపాటు 721 సామూహిక హక్కులను పొందడం జరిగింది. అటవీ హక్కులు అసంపూర్తిగా ఇవ్వడంతో పోడు సాగు చేసుకుంటున్నవారికి హక్కులు కల్పించాలని తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి అనేక ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి. 8 సంవత్సరాల అనంతరం ఈ సమస్య పరిష్కారం కోసం నవంబర్ 8, 2021 నుంచి డిసెంబర్ 8 2021 వరకు దరఖాస్తుల స్వీకరణ జరిగింది. దాదాపుగా 12 లక్షల 49 వేల ఎకరాలకు సంబంధించి 4 లక్షల 14 వేల దరఖాస్తులు వచ్చినట్లుగా ప్రభుత్వం తెలిపింది. వీటి పరిష్కారం కోసం గత నెల రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఒక జిల్లాస్థాయిలో సమన్వయ కమిటీని నియమిస్తూ జీవో 140 తీసుకురావడం జరిగింది. ఇది వివాదాస్పదం కావడంతో హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
పోడు భూముల హక్కుల గుర్తింపులో సమస్యలు
దీని విషయంలో హైకోర్టు స్పందిస్తూ అటవీ హక్కుల చట్టంలోనే అటవీ హక్కుల గుర్తింపు ప్రక్రియ అటవీ హక్కుల కమిటీ, గ్రామసభ, సబ్ డివిజనల్ కమిటీ, జిల్లా స్థాయి కమిటీ, రాష్ట్రస్థాయి మానిటరింగ్ కమిటీలు ఉన్నాయని తెలపటంతో జీవో 140 నిలిపివేయడం జరిగింది. అనంతరం పోడు భూముల సర్వే ప్రక్రియ ప్రారంభమై హక్కుల గుర్తింపు మొదలైంది. 2023లో 2 లక్షల 30 వేల 735 క్లైములకుగాను.. 6 లక్షల 69 వేల 676 ఎకరాల భూమికి పోడు పట్టాలు ఇచ్చారు. అయినప్పటికీ, పోడు భూముల హక్కుల గుర్తింపులో అనేక సమస్యలు కొనసాగుతున్నాయి. గతంలో పోడు రైతులకు క్లైమ్ నెంబర్లు, భూమి పట్టాలు వచ్చాయి. కానీ, హక్కు పత్రాలు ఇవ్వలేదు. వీటికి రైతుబంధు వస్తుంది. కానీ, ఫారెస్ట్ అధికారులు ఆ భూములను అటవీశాఖ భూములని రైతులకు హక్కు పత్రాలు లేవు కనుక అ భూములను గుంజుకొని హరితహారం పేరిట మొక్కలు నాటారు. పోడు సాగుదారుడికి 2 ఎకరాలు ఒకచోట, 3 ఎకరాలు మరొక చోట ఉన్న పోడు భూములకు కేవలం ఒకచోట మాత్రమే సర్వే చేసే ఆప్షన్ ఉందని అధికారులు తెలుపుతున్నారు.
కేంద్ర ప్రభుత్వాధీనంలోకి అటవీ భూములు
అటవీ భూములు 1980 కంటే ముందు రాష్ట్ర జాబితాలో ఉండటం మూలంగా ఎవరైతే అటవీ భూములు సాగు చేసుకున్నారో వారికి గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చాయి.1980 తర్వాత అటవీ భూములు కేంద్ర ప్రభుత్వాధీనంలోకి వెళ్లాయి. ఇప్పుడు ఏవైతే రెవెన్యూ శాఖ ఇచ్చిన పట్టా భూములు ఉన్నాయో అవి అటవీశాఖ భూములని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. ఇవి ధరణిలో అటవీ భూములుగా ఉన్నాయి. ఇలా రెవెన్యూ శాఖ పట్టాలు ఇస్తే అటవీశాఖ అటవీ భూములు అంటూ స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది. ఇలా రెవెన్యూ, అటవీశాఖ హద్దు వివాదాలు కలిగిన భూములు దాదాపుగా 20 లక్షల వరకు ఎకరాల వరకు ఉంటాయని అంచనా. పోడు భూములు సాగు చేసుకుంటున్నవారిలో కొందరికి అటవీ హక్కు పత్రాలు, మరికొందరికి క్లైమ్ నెంబర్లు రావడం జరిగింది. కానీ, ఆ భూములు టైగర్ జోన్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, కోల్ ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటికి భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం
ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదు.
పోడు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
ఒక రైతు పోడు భూమికి హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ రైతుకు భూమి ఒక చోటవుంటే హక్కు పత్రం మరోచోట కేటాయించటం జరిగింది. కొన్నిచోట్ల పోడు రైతులు గతంలో దరఖాస్తు చేసుకుంటే సర్వే జరిగింది. క్లైమ్ నెంబర్లు వచ్చాయి. కానీ, నేటికీ హక్కు పత్రాలు రాలేదు. కొంతమంది రైతులకు గతంలోనే పోడు భూములకు హక్కు పత్రాలు వచ్చాయి. అయితే, వాటికి క్లైమ్ నెంబర్లు రాకపోవడంతో రైతుబంధు రావడం లేదు. ఉమ్మడి కుటుంబాలు వేరుపడి పోడు భూములు సాగు చేసుకుంటున్నారు. కానీ, కొత్త కుటుంబాలకు రేషన్ కార్డులు లేకపోవడంతో వారి హక్కులను గుర్తించలేదని పోడు రైతులు వాపోతున్నారు. ఇలా అనేక పోడు భూముల సమస్యలుఉన్నాయి. కనుక పోడు భూముల సమస్యలను ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి. హక్కు పత్రాలు పొందిన వారి వివరాలు భూ భారతిలో ప్రత్యేక కాలంలో అందుబాటులో ఉంచాలి.
- వాసం
ఆనంద్ కుమార్