- ఇప్పటికే ఖమ్మం జిల్లాలో వెయ్యి, భద్రాద్రిలో 814 పోస్టులు ఖాళీ
- బదిలీలు, ప్రమోషన్స్‌తో మరో 1300 పోస్టులకు వేకెన్సీ
- ఊసే లేని విద్యా వాలంటీర్ల నియామకం
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సర్కారు బడులను టీచర్ పోస్టుల ఖాళీల సమస్య వెంటాడుతోంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే అన్ని కేటగిరీల కింద దాదాపు వెయ్యికి పైగా పోస్టులకు వేకెన్సీ ఉంది. ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ నేపథ్యంలో ఎస్జీటీ పోస్టులు దాదాపు 500 వరకు ఖాళీ కానున్నాయి. భద్రాద్రి జిల్లాలోని దాదాపు 814 పోస్టుల ఖాళీగా ఉండగా, బదిలీలతో మరో 800 పోస్టులకు వేకెన్సీ ఏర్పడనుంది. టీచర్ల ఖాళీలు, మరోవైపు విద్యా వాలంటీర్ల నియామకంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో విద్యాశాఖతోపాటు విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు.
భద్రాద్రిలో ఇదీ పరిస్థితి
భద్రాద్రి జిల్లాలో జడ్పీ, మండల పరిషత్ స్కూల్స్ 1,037 ఉన్నాయి. స్టేట్గవర్నమెంట్ స్కూల్స్ 42 ఉన్నాయి. వీటిల్లో స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, పీఈటీ, పండిట్స్‌తో పాటు పలు కేటగిరీలకు చెందిన 4,357 సాంక్షన్ పోస్టులుండగా, ఇందులో 814 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఖాళీగా ఉన్నవి ఎస్జీటీ పోస్టులే. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ బీజీలో టీచర్లు ఉన్నారు.
ఈ నెల 22 లోపు ప్రక్రియ పూర్తి చేసేలా విద్యాశాఖ అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్‌తో ఎస్జీటీ, పీఈటీ, పండిట్స్పోస్టులు దాదాపు 800 వరకు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ విద్యపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని టీచర్ల సంఘాల నేతలు చెబుతున్నారు.
ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ హడావుడిలో టీచర్లు
అసలే టీచర్ల ఖాళీలతో ఇబ్బందులు పడుతున్న స్కూల్స్‌కు ఇప్పుడు ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ బెడద పట్టుకుంది. బడులు తెరిచిన టైంలో ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్లలో భాగంగా సీనియార్టీ లిస్ట్‌లో వచ్చిన లోపాలను సరిచేసుకునేందుకు టీచర్లు సర్వీస్ బుక్స్ పట్టుకొని డీఈఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు టీచర్ల ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ జరగనుంది.
విద్యా వాలంటీర్ల నియామకంతోనే సర్దుబాటు!
ఇప్పటికే స్కూల్స్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం విద్యా వాలంటీర్ల నియామకంపై దృష్టి పెట్టాలని టీచర్స్, స్టూడెంట్స్ యూనియన్ల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో దాదాపు 700 మంది విద్యా వాలంటీర్లను ప్రభుత్వం తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో వారి అవసరం చాలా ఉందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.