ప్రతిపాదనలకే పరిమితమైన మల్టీలెవెల్ నిర్మాణాలు
గ్రేటర్లో 53 చోట్ల మాత్రమే జీహెచ్ఎంసీ పార్కింగ్ ఏరియాలు
రోజురోజుకు తీవ్రమవుతున్న సమస్య
హైదరాబాద్, వెలుగు : సిటీలో వెహికల్ పార్కింగ్ సమస్య తీవ్రమవుతోంది. వ్యాపార సముదాయాలు, ఇతర ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ పర్మిషన్ ఇచ్చిన పార్కింగ్ స్థలాలు గ్రేటర్లో కేవలం 53 మాత్రమే ఉన్నాయి. దీంతో ఇంట్లో నుంచి బయటకు వెళితే వెహికల్ని పార్క్ చేయడం వాహనదారులకు సవాల్‌గా మారుతోంది. రోడ్లుపై నిలిపితే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వెహికల్స్‌ను డైరెక్ట్‌గా పీఎస్‌కు తరలిస్తున్నారు. వాటిని విడిపించుకునేందుకు వాహనదారులు తంటాలు పడుతున్నారు.
3 వేల ఎకరాల స్థలం అవసరం
2001లో సిటీలో ప్రతి వెయ్యి మందికి 103 వెహికల్స్ ఉండగా, 2011లో ఆ సంఖ్య 279కి పెరిగింది. ప్రస్తుతం ప్రతి వెయ్యి మందిలో 500 మందికి వెహికల్స్ ఉన్నట్లు పలు సర్వేలు చెప్తున్నాయి. వెహికల్స్ పెరగడం, పార్కింగ్‌స్థలాల సంఖ్య తక్కువగా ఉండటంతో సమస్య తీవ్రమవుతోంది. ప్రస్తుతం పార్కింగ్ సమస్య తీరేందుకు దాదాపు 3 వేల ఎకరాల స్థలం అవసరమని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. కమర్షియల్ కారిడార్ల సంఖ్యను పెంచుతున్న జీహెచ్ఎంసీ పార్కింగ్ సదుపాయం కల్పించడంపై దృష్టిపెట్టకపోతుండటంతో జనం ఇబ్బంది పడుతున్నారు. చార్మినార్, ఎల్బీనగర్, కోఠి, సికింద్రాబాద్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, రాణిగంజ్, ఉస్మాన్‌గంజ్, బేగంబజార్ ఇలా ఎక్కడ చూసినా పార్కింగ్ కోసం కష్టాలు తప్పడం లేదు.
మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల ఊసే లేదు
పార్కింగ్ తో పాటు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేటు పార్ట్ నర్షిప్) పద్ధతిలో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లను నిర్మించాలని కొన్నేళ్లుగా అధికారులు చెబుతూనే ఉన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 42 ప్రాంతాల్లో పార్కింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి భూములను గుర్తించామని, ఈ ప్రాంతాల్లో ఆయా శాఖలు తమ అవసరాలతో పాటు వాణిజ్య, పార్కింగ్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు ఇవ్వాలని 2018 జూన్‌లో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్ర
టరీ అర్వింద్‌కుమార్ ఆదేశించారు. ప్రతి పార్కింగ్ కాంప్లెక్స్‌ను యూనిట్‌గా అభివృద్ధి చేయాలని, వాణిజ్య అంశాలను దృష్టిలో ఉంచుకొని, ప్యాకేజీల వారీగా ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించినా నేటికీ కాంప్లెక్స్‌ల నిర్మాణం జరగలేదు. ఇందుకోసం ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోతే ప్రైవేట్‌భూములను తీసుకొని నిర్మిస్తామని చెప్పిన్నప్పటికీ ఆ విషయంపై దృష్టిపెట్టడం లేదు. ఇదే విషయంపై 2021 జనవరిలో కమిషనర్‌లోకేశ్‌కుమార్ సైతం సమావేశం నిర్వహించారు. తొందరలోనే మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు ప్రారంభిస్తామన్నప్పటికీ పనులు మాత్రం స్టార్ట్ కాలేదు.
ఆదాయంపైనే ఫోకస్
కమర్షియల్ కారిడార్లపై వస్తున్న ఆదాయంపై మాత్రమే ఫోకస్ పెట్టిన బల్దియా.. అక్కడ సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతోంది. గ్రేటర్లో కమర్షియల్ రోడ్లు ఉన్న ప్రాంతాల్లో నిర్మాణ పర్మిషన్లు, వ్యాపార సముదాయలకు తీసుకునే పర్మిషన్ ఫీజులు సైతం పెరిగాయి. ట్యాక్స్‌లు చెల్లించని వారికి నోటీసులు సైతం జారీ చేస్తున్నారు. కానీ షాపింగ్‌కు వచ్చేవారికి పార్కింగ్ స్థలం కేటాయించకపోవడంతో రోడ్లపైనే వెహికల్స్‌ను పెట్టి వెళ్తున్నారు. బల్దియా అన్ని పన్నులు వసూల్చేస్తూ కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై వ్యాపారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫిర్యాదు చేయండి ఇలా..
అక్రమంగా పార్కింగ్ ఫీజు వసూల్ చేస్తే ..పార్కింగ్ బిల్లుతో బల్దియా ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ట్విట్టర్‌కి లేదా సర్కిల్ఆఫీసులోని డిప్యూటీ కమిషనర్‌కు కంప్లయింట్ చేయొచ్చు .రూల్స్ బ్రేక్ చేసిన వారికి రూ.50వేల ఫైన్ విధించే అవకాశం ఉంది. హెల్ప్‌లైన్ నం. 040–21111111కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
జీవోకు విరుద్ధంగా వసూళ్లు
పార్కింగ్‌కు సంబంధించి ప్రభుత్వం 2018లో జీవో నంబర్ 68ని జారీ చేసింది. కానీ దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. మాల్స్, హాస్పిటల్స్, కమర్షియల్ కాంప్లెక్స్ లలో ఎట్టి పరిస్థితుల్లో పార్కింగ్ ఫీజు వసూల్ చేయొద్దనే రూల్ ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటళ్లలో ఫోర్ వీలర్‌ను 3 గంటల పాటు ఉంచితే రూ.50, టూ వీలర్‌కి 5 గంటల లోపు రూ.30 వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత గంటకి రూ.10 చొప్పున అధికంగా కలెక్ట్ చేస్తున్నారు. మెట్రో రైల్, బస్టాప్, రైల్వే స్టేషన్లలో పార్కింగ్ ఫీజు ఎంత వసూలు చేయాలనే దానిపై జీవోలో క్లారిటీ లేకపోవడంతో.. ఇదే అదునుగా ఈ ప్రాంతాల్లో అడ్డగోలుగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు.
పార్కింగ్ ఫీజు లేకుండా చూడాలి
నిమ్స్‌లో పార్కింగ్ ఫీజు కట్టాల్సి వస్తోంది. బైక్‌కు ప్రతి12 గంటలకు రూ.20 చెల్లించాల్సి వస్తోంది. ఫీజు కట్టకపోతే బయట పెట్టుకోవాలని చెప్తున్నరు. హాస్పిటల్లో బిల్లులు కట్టిన ప్పుడు పార్కింగ్ ఫీజు ఎందుకు కట్టాలి. పార్కింగ్ ఫీజు లేకుండా చూడాలి.
‑ రాఘవేందర్, పేషెంట్ అటెండర్
పార్కింగ్ లేక రోడ్డుపై పెడుతున్నం
వస్తువులు కొందామని బేగంబజార్‌కి వస్తే వెహికల్ ఎక్కడ పెట్టాలో అర్థం కావడం లేదు. 30 నిమిషాల షాపింగ్ చేసేందుకు వస్తే పార్కింగ్ కోసం వెతికేందుకే అంతకుమించి టైమ్ పడుతోంది. జాగా లేకపోవడంతో రోడ్డు పక్కనే పెట్టాల్సి వస్తోంది.
‑ సంతోష్ రెడ్డి, వాహనదారుడు