ఓన్లీ టికెట్.. నో జర్నీ : రైల్వేలో వెయిటింగ్ లిస్ట్ 2 కోట్ల 70 లక్షలు..

ఓన్లీ టికెట్.. నో జర్నీ : రైల్వేలో వెయిటింగ్ లిస్ట్ 2 కోట్ల 70 లక్షలు..

దూర ప్రాంతాలకు వెళ్లాలంటే చాలామంది ట్రైన్లలో ప్రయాణం చేస్తుంటారు. ఇందుకోసం ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. దూర ప్రయాణం ప్లాన్ చేసుకోవడానికి చాలామంది ముందుగానే రైళ్లలో టిక్కెట్లు ఉన్నాయా..? లేదా అనే విషయాన్ని ఆన్ లైన్ ద్వారా తెలుసుకుంటారు. అయితే.. ప్రతిరోజూ కోట్ల మందిని తమ గమ్య స్థానాలకు చేరుస్తున్న భారత రైళ్లలో ‘వెయిటంగ్ లిస్ట్’ సమస్య ప్రయాణికులను ఇబ్బంది పెడుతోంది. ‘వెయిటంగ్ లిస్ట్’ ప్యాసింజర్స్ నిరుత్సాహానికి గురి చేస్తోంది.

వెయిటింగ్‌ లిస్ట్‌ పెరుగుతుండటంతో ప్రయాణం మరింత భారమవుతోంది. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే వెయిటింగ్‌ లిస్ట్‌ ఉన్నా.. కన్‌ఫాం అవుతుందేమోనన్న ఆశతో ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకొని.. ఆ తర్వాత భంగపడినవారు కోట్లలో ఉంటున్నారు. 2022-23లో 2.7కోట్ల మందికి పైగా ప్రయాణికులు వెయిటింగ్ లిస్ట్‌ కారణంగా రైలు ప్రయాణానికి నోచుకోలేకపోయారని రైల్వేశాఖ వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌర్‌ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాలను తెలిపింది. 

2022-23 ఆర్థిక సంవత్సరంలో  మొత్తం 1.76 కోట్ల పీఎన్‌ఆర్‌ నెంబర్లపై 2.72కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించాల్సి ఉండగా.. వెయిటింగ్‌ లిస్ట్‌ కారణంగా ఆటోమేటిక్‌గా టికెట్లు రద్దయిపోయివడంతో రైలు ప్రయాణం చేయలేకపోయినట్టు రైల్వే బోర్డు వెల్లడించింది. 

2021-22లో చూస్తే..  1.06కోట్ల పీఎన్‌ఆర్‌ నెంబర్లపై 1.65కోట్ల మంది రైలు ప్రయాణానికి నోచుకోలేకపోయారని తెలిపింది. టికెట్లు రద్దయిన తర్వాత ఆ మొత్తాన్ని ప్రయాణికుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్నట్టు వెల్లడించింది. అధిక రద్దీ ఉన్న రూట్లలో తగినన్ని రైళ్లు లేకపోవడాన్ని ఈ సమస్య ప్రతిబింబిస్తోంది. 

డిమాండ్‌కు తగినట్టుగా రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు రైల్వేబోర్డు తెలిపింది. దీని ద్వారా వెయిటింగ్ లిస్ట్‌లో చేరే ప్రయాణికుల సంఖ్యను తగ్గించవచ్చని రైల్వేశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కరోనా మహమ్మారికి ముందు రైల్వే శాఖ 10,186 రైళ్లు నడపగా.. ఇప్పుడు ఆ సంఖ్య 10,678కి చేరిందన్నారు.

ప్రస్తుతం నెట్‌వర్క్‌ సిగ్నలింగ్‌, ట్రాక్‌ పనులు కొనసాగుతున్నాయని.. మరిన్ని రైలు సర్వీసులు తీసుకొచ్చేందుకు కృషి జరుగుతోందని రైల్వేశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు... 2014-15లో 1.13కోట్ల  పీఎన్‌ఆర్‌లు రద్దు కాగా.. 2015-16లో 81.05లక్షలు, 2016-17లో 72.13లక్షలు, 2017-18లో 74లక్షలు, 2018-19లో 68.97 లక్షల చొప్పున PNR నంబర్లతో టికెట్లు ఆటోమేటిక్‌గా రద్దయినట్టు రైల్వే బోర్డు తెలిపింది.

2020-21 కరోనా కాలంలో కాలంలో 38.89లక్షల పీఎన్‌ఆర్‌ నంబర్లు వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండి రద్దు కాగా.. 61లక్షల మంది ప్రయాణించలేకపోయినట్టు పేర్కొంది.