- తెలంగాణ అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ
బషీర్ బాగ్ వెలుగు : అయ్యప్ప స్వాములపై జరిగే దాడులు, శబరిమలలో స్వాములు పడే ఇబ్బందులను రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిష్కరించాలని తెలంగాణ అయ్యప్ప స్వాముల జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఉస్మాన్ గంజ్ లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవాసమితి ఆఫీసులో మంగళవారం మీటింగ్ జరిగింది. జంటనగరాలకు చెందిన గురుస్వాములు పాల్గొని.. శబరిమలలో అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అనంతరం అయ్యప్ప జేఏసీ ప్రతినిధులు బుచ్చిరెడ్డి గురుస్వామి, బాలకృష్ణ గురుస్వామి
క్యాతం రాధాకృష్ణ గురుస్వామి, ప్రేమ్ గాంధీ గురుస్వామి మాట్లాడారు. శబరిమలలో కనీస సౌకర్యాలు లేక తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన స్వాములు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అన్న ప్రసాదాలు, తాగునీరు, రవాణా సౌకర్యం, వైద్య సదుపాయాలు సరిగా లేవని తక్షణమే కేరళ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. టోల్ గేట్స్ వద్ద అధికంగా డబ్బులు దండుకుంటున్నారని, అయ్యప్ప స్వాముల వాహనాలకు ఫ్రీ ఎంట్రీ కల్పించాలని ఇందుకు..
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ, ప్రవేటు ఆఫీసులు, స్కూళ్లలో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వారిపై ఆంక్షలు విధిస్తున్నారని, వెంటనే ఆపాలని లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాజన్ గురుస్వామి, బసవేశ్వర గురుస్వామి,షేరణ్ దాస్ గురుస్వామి,మురళి గురుస్వామి,శ్రీనివాస్ గురుస్వామి,సింహం గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.