ఆదిలాబాద్, వెలుగు :ఉమ్మడి జిల్లాలో ఆదివాసీ గిరిజనుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఏడాది పాటు కష్టాలను ఎదురీదుతున్నారు వర్షకాలం అంతా ఇబ్బంది పడుతున్నారు. వాగులు.. వంకలు.. బురద రోడ్లపై నడవలేక అవస్థలు పడుతారు. అవసరానికి సాయం అందక.. అత్యవసర సమయంలో వైద్యం చేయించుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటారు. వేసవిలో తాగునీరు లేక.. కొండలు కోనలు దాటి కోసుల దూరం పోతారు. వాగుల్లో చెలిమనీటితో దూప తీర్చుకుంటారు. ఓట్ల కోసం వచ్చే లీడర్లు గెలిచినంక అటువైపు చూడడంలేదు. తాగునీరు, రోడ్డు, వైద్యం, కరెంట్ తదితర కసీస సదుపాయాల కోసం ఊర్లకు ఊర్లే కదిలి వచ్చి ఆందోళనలు చేసినా పట్టించుకోవడం లేదు.
ఆరు నెలలు ఆగమాగం..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 150పైకి పైగా ఏజెన్సీ గ్రామాలు ఆగమవుతున్నాయి. వర్షం పడితే ఉట్నూర్, ఇంద్రవెల్లి, కడెం, దస్తురాబాద్, నార్నూర్, కెరమెరి, ఖానాపూర్, వేమమనపల్లి, పెంబి మండలాల్లో దాదాపు 50 గ్రామాలు బాహ్య ప్రంపంచానికి దూరమవుతాయి. ఆయా గ్రామాల చుట్టూ వాగులు వంకలు పొంగిపొర్లడంతో గ్రామస్తులు బయటకు రాని పరిస్థితి దాపురిస్తోంది. మట్టి రోడ్లు బురమయమవుతాయి. దీంతో కనీసం అంబులెన్స్‌లు కూడా రావడంలేదు. బ్రిడ్జీలు నిర్మించాలి... రోడ్లు వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నా ఎవరూ పట్టించు కోవడంలేదు.
బతుకులు మారుతలేవ్
ఓట్ల కోసం వస్తరు. ఆ తర్వాత ముఖం కూడా చూపియ్యరు. ఏండ్లసంది మా బతుకులు మారుతలేవ్. ఎవరికి చెప్పుకున్నా.. పట్టించుకుంటలేరు. ఏమైనా కష్టం వస్తే బయటకు వచ్చుడు కష్టమైతంది. ఒక్కోసారి పాణాలు పోయినా పట్టించుకునే నాథుడు లేడు. వాగుల మీద బ్రిడ్జీలు, ఊర్లకు రోడ్లు వేస్తే బాగుంటది.
- మడావి గంగారం, మారుతిగూడ, ఇంద్రవెల్లి